సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ కార్డుతో పాన్ నెంబర్‌ను నిర్దేశిత గడువులోగా లింక్ చేసుకోని వినియోగదారులు త్వరగా ఆ పని పూర్తి చేయండి. లేదంటే కార్డు పనిచేయకుండా పోతుంది. ఆధార్‌తో అనుసంధానం కాని పాన్ కార్డుల రద్దుపై ఇప్పటికే పలు హెచ్చరికలను జారీ చేసిన ఆదాయ పన్ను శాఖ భారీ సంఖ్యలో పాన్ కార్డులకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ పాన్ కార్డులతో అధిక మొత్తాల్లో లావాదేవీలు నిర్వహిస్తూ తప్పించుకుంటున్న పన్ను ఎగవేతదారులపై కూడా ఐటీ శాఖ కొరడా ఝుళిపించనుంది. దీంతోపాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్, క్రెడిట్,డెబిట్ కార్డులు ద్వారా జరిపే భారీ లావాదేవీలపై కూడా నిఘా పెట్టనుంది.
పాన్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి గడువు 2021 మార్చి 31వ తేదీ లోపు లింకింగ్ ప్రక్రియ పూర్తి చేచేయకపోతే కనీసం180 మిలియన్ల (18 కోట్ల) కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. 130 కోట్ల జనాభాలో కేవలం15 మిలియన్ల మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారని ఐటీ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిలో 2.5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న సంస్థలు 57 శాతం, 2.5 నుంచి 5 లక్షల రూపాయల మధ్య ఆదాయం ఉన్నవారు పద్దెనిమిది శాతం, 5 నుండి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 17శాతం, 10 నుంచి రూ .50 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 7 శాతం, 50 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు ఒక శాతం మాత్రమే ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. కాగా 32.71 కోట్లకు పైగా పాన్ కార్డులను బయోమెట్రిక్ ఐడీ ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు ఇటీవల ప్రభుత్వం తెలిపింది. జూన్ 29 నాటికి జారీ అయిన మొత్తం పాన్ కార్డుల సంఖ్య 50.95 కోట్లుగా ఉందని మైగోవ్ఇండియా ఒక ట్వీట్‌లో పేర్కొంది
Comments
Please login to add a commentAdd a comment