![SEBI new rule Trading Window Close will apply to relatives as well PAN cards will be frozen](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/sebi-.jpg.webp?itok=lO0PcF6o)
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి కొత్త సమాచారం వెలువడింది. లిస్టెడ్ కంపెనీల “ట్రేడింగ్ విండో క్లోజ్”కు సంబంధించి సెబీ కొత్త నిబంధనలు తీసుకురాబోంది. ఇవి కంపెనీ ఇన్‌సైడర్ల బంధువులకు కూడా వర్తిస్తాయి. నిర్ణీత సమయంలో వారి పాన్ కార్డులు (PAN cards) కూడా స్తంభిస్తాయి. ఈ మేరుకు సెబీ ప్రతిపాదనలు జారీ చేసింది.
“ట్రేడింగ్ విండో క్లోజ్” అంటే..
“ట్రేడింగ్ విండో క్లోజ్” అనేది కంపెనీ ఇన్‌సైడర్లకు సంబంధించిన నిబంధన. అంటే ఆ నిర్ణీత సమయంలో కంపెనీ ఇన్‌సైడర్లు షేర్లను ట్రేడ్ చేయలేరు. తద్వారా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను నిరోధించే ఆస్కారం ఉంటుంది. మార్కెట్ పారదర్శకత కోసం సెబీ దీనిని అమలు చేస్తుంది.
త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు "ట్రేడింగ్ విండో" ఆటోమేటిక్ క్లోజర్ నిబంధనలో మరికొంత మందిని చేర్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సెబీ చెబుతోంది. ప్రస్తుతం కంపెనీ డైరెక్టర్లు, ఉన్నత స్థాయి అధికారులు వంటి వారు ఈ నిబంధన కింద ఉన్నారు. కానీ కొత్త నిబంధన ప్రకారం ఈ వ్యక్తులందరి దగ్గరి బంధువులు కూడా దీని పరిధిలోకి వస్తారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు ఎటువంటి అవకాశం లేకుండా నిరోధించడం దీని ఉద్దేశం.
ట్రేడింగ్ విండో క్లోజ్ సమయంలో మరింత భద్రత కోసం ఇన్‌సైడర్ల పాన్ కార్డులను స్తంభింపజేయడానికి, డిపాజిటరీల ట్రేడింగ్‌ను నిలిపివేయడానికి సెబీ 2022 ఆగస్టులో మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం లిస్టెడ్ కంపెనీ విడుదల చేసిన సమాచారం ఆధారంగా వారి పాన్ కార్డులను స్తంభింపజేస్తున్నారు. గతంలో ఈ నిబంధన నిఫ్టీ 50, సెన్సెక్స్ వంటి బెంచ్‌మార్క్ సూచీలలో నమోదైన కంపెనీలకు వర్తించేది. 2023 జూలైలో సెబీ దీనిని అన్ని కంపెనీలకు తప్పనిసరి చేసింది.
కొత్త ప్రతిపాదనలపై ఫిబ్రవరి 28 లోగా స్పందనలు తెలియజేయాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కోరింది. సెబీ నిర్వచనం ప్రకారం దగ్గరి బంధువు అంటే తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు. అలాగే స్టాక్ మార్కెట్ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో సంప్రదించే వ్యక్తులు కూడా ఇందులోకి వస్తారు.
ప్రతి త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు ప్రకటించిన 48 గంటల వరకు ట్రేడింగ్ విండో మూసివేత వర్తిస్తుందని సెబీ పేర్కొంది. సెబీ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన సమాచారం ప్రకారం.. కంపెనీలు సాధారణంగా త్రైమాసిక, వార్షిక ఆర్థిక ఫలితాలు, పెద్ద ఒప్పందాలు, కొనుగోళ్లు లేదా విలీనాలను ప్రకటించే ముందు ట్రేడింగ్ విండోను మూసివేస్తాయి. అలాగే బోనస్ షేర్లు, స్టాక్ స్ల్పిట్‌లు లేదా డివిడెండ్‌లను ప్రకటించే ముందు కూడా ట్రేడ్ విండో క్లోజ్ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment