సాక్షి, అమరావతి : ఉదయాన్నే రాష్ట్ర పౌరులు ఎవరి పనుల్లో వాళ్లున్నారు. పేపర్ చూసే పనిలో ఉన్న ఓ పౌరుడు సడన్‌గా ఉలిక్కిపడ్డాడు. ఏంటన్నట్లు చూశాడు పక్కనున్న పౌరుడు.
‘‘ఈ గవర్నమెంటు ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి తెచ్చిపెడుతూనే ఉంటుంది’’ అన్నాడు చేతిలో పేపర్ ఉన్న పౌరుడు (చే.పౌ).
‘‘అవున్నిజమే. నేనూ చూశాను పేపర్‌లో. ఆధార్‌కి పాన్‌ని లింక్ చెయ్యాలట కదా.. మార్చి 31 లోపు. ఏప్రిల్లో పోలింగ్ డేట్ పెట్టుకుని, మార్చిలో ఈ లింకింగ్ డేట్ ఏంటో..’’ అన్నాడు పక్కనున్న పౌరుడు (ప.పౌ.)
‘‘అదేం పెద్ద ప్రాబ్లం కాదు. లింక్ చేస్తే లింకైపోతుంది’’.
‘‘మరేంటి ప్రాబ్లమ్? పాతవి లింక్ చెయ్యకపోతే పెనాల్టీ అంటున్నారా?’’ అన్నాడు ప.పౌ. పేపర్‌లోకి తొంగి చూస్తూ.
‘‘పాతవేం పెండింగులో లేవు. ఎప్పటికప్పుడు అన్నీ లింక్ చేసి పడేశా. ఆధార్‌ని ఫోన్ నంబర్‌కి లింక్ చేశా. ఫోన్ నంబర్‌ని పాన్ నంబర్‌కి లింక్ చేశా. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌ని లింక్ చేశా. ఆధార్‌కి గ్యాస్ అకౌంట్ లింక్ చేశా. ఓటర్ ఐడీని ఆధార్‌కి లింక్ చేశా. ఇప్పుడు ఆధార్‌ని పాన్‌కి లింక్ చెయ్యమంటున్నారు కదా. అదీ చేసేస్తా. పాన్‌కి పాన్‌ని, ఆధార్‌కి ఆధార్‌ని, ఫోన్‌కి ఫోన్‌ని, ఓటర్ ఐడీకి ఓటర్ ఐడీని లింక్ చెయ్యమన్నా చేసేస్తా..’’ అన్నాడు చే.పౌ.
‘‘మరింక ప్రాబ్లమ్ ఏంటి? ఏం రాశారు పేపర్‌లో?’’
‘‘ఈవీఎంల్లో అభ్యర్థుల ఫొటోలు పెడుతున్నారట!’’
‘‘మంచిదే కదా. ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుంటే కన్‌ఫ్యూజన్ లేకుండా మన క్యాండిడేట్ ఫొటోని చూసి గుద్దే యొచ్చు’’ అన్నాడు ప.పౌ.
‘‘పార్టీ సింబల్ ఉంటుంది కదా. మళ్లీ ఫొటో ఎందుకు? ఓటర్‌కి క్లారిటీ కోసం అని ఫొటోతో పాటు పార్టీల నినాదాలు కూడా ఈవీఎంలపై రాయించేలా ఉన్నాడు ఎలక్షన్ కమిషనర్’’ అన్నాడు చే.పౌ.
‘‘సింబల్‌ని గుర్తు పట్టలేకపోతున్నారనే కదా.. ఫొటోలు పెడుతున్నారు. మొన్న తెలంగాణ ఓటర్లు కారుకి, ట్రక్కుకు తేడా కనిపెట్టలేకపోవడంతో తనకు రెండు మూడు ఓట్లు తగ్గాయని కేసీఆర్ ఎలక్షన్ కమిషన్‌కు కంప్లయింట్ కూడా చేశాడు’’ అన్నాడు ప.పౌ.
‘‘ప్రాబ్లం నీకు అర్థం కావడం లేదు’’ అన్నాడు చే.పౌ.
‘‘ఏంటి చెప్పు..’’ అన్నాడు ప.పౌ.
‘‘చెప్తే అర్థం కాదు. ఆధార్ కార్డుందా నీ దగ్గర? ఉంటే ఇటివ్వు’’ అన్నాడు.
‘‘ఆధార్ కార్డే కాదు, అన్ని కార్డులూ ఉన్నాయి’’ అని జేబులోంచి రబ్బరు బ్యాండ్‌వేసి ఉన్న పెద్ద కార్డుల సెట్టు ఒకటి తీశాడు ప.పౌ.!
ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఆర్.సి.కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు.. అన్నీ గవర్నమెంట్ కార్డులు. ‘‘ఈ కార్డులన్నిట్లో నీ ఫొటోలు ఉన్నాయి కదా! ఒక్క ఫొటోలో అయినా నువ్వు నువ్వులా ఉన్నావా? నీ జేబులోంచి కార్డులు తీశావు కాబట్టి కార్డుల్లో ఉన్నది నేనేనని అనుకుంటున్నావు కానీ.. నీ కార్డుని మిగతావాళ్ల కార్డుల్లో కలిపి, వాటిల్లోంచి నీ కార్డేదో తియ్యమంటే తియ్యగలవా? చిలకని పట్టుకు రావల్సిందే’’ అన్నాడు చే.పౌ.
చే.పౌ. పాయింట్ అర్థమైంది ప.పౌకి.
‘‘చట్టం ముందు అంతా సమానం అన్నట్లు, గవర్నమెంట్ కార్డుల్లో ఫొటోలన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి, రేపు ఈవీఎంల్లోనూ అభ్యర్థుల ఫొటోలు కూడా ఒకేలా ఉంటాయని కదా నీ పాయింట్’’ అన్నాడు ప.పౌ.
‘‘అది కాదు నా పాయింట్’’ అన్నాడు చే.పౌ.
‘‘మరేంటి?!’’
‘‘ఫొటోల్లో అభ్యర్థులు చక్కగా కనిపిస్తున్నా.. ఒక పార్టీ గుర్తు పక్కన వేరే పార్టీ అభ్యర్థి ఫొటో అతికించారనుకో.. అప్పుడేంటీ?!’’ అన్నాడు చేతిలో పేపర్ ఉన్న పౌరుడు. ‘పాయింటే’’ అన్నాడు పక్కనున్న పౌరుడు.
– మాధవ్
పాతవి లింక్ చెయ్యకపోతే పెనాల్టీ అంటున్నారా?
Published Wed, Mar 20 2019 8:04 AM | Last Updated on Wed, Mar 20 2019 8:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment