పాన్ కార్డు ఖరీదు 105!!
ఇప్పటివరకు మీకు పాన్కార్డు లేదా? కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఆదాయపన్ను శాఖకు పన్నులతో కలిపి 105 రూపాయలు చెల్లించాల్సిందే. భారతీయ పౌరులకు పాన్ కార్డులు జారీ చేసేముందు వారి వారి పత్రాల పరిశీలనకు ఆదాయపన్ను శాఖ కొత్త విధివిధానాలను నోటిఫై చేసింది. ఒకే వ్యక్తికి రెండు మూడు పాన్ కార్డులు లేకుండా చూసేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మొత్తం 105 రూపాయలు చెల్లించి పాన్ కార్డు పొందొచ్చు. అయితే సర్వీసు చార్జిని మాత్రం మార్చలేదు. జనన ధ్రువీకరణ, చిరునామా, గుర్తింపు ధ్రువీకరణకు ఒరిజినల్ డాక్యుమెంట్ల పరిశీలన ప్రక్రియను కూడా ఇటీవలే ప్రవేశపెట్టారు.
ఫిబ్రవరి మూడో తేదీ నుంచి కొత్తగా ఎవరైనా పాన్ కార్డులు కావాలనుకుంటే వాళ్లు తమ గుర్తింపు, చిరునామా, జనన ధ్రువీకరణ పత్రాల కాపీలను దరఖాస్తుతో పాటు జతచేయాలని, వాటి ఒరిజినల్స్ను చెక్ చేసి తర్వాత తిరిగిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దరఖాస్తుదారులు తమ పత్రాల కాపీల మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది. బినామీ ఆస్తులు కూడగట్టుకోడానికి, పన్నులు ఎగవేయడానికి వీలుగా ఒకే వ్యక్తి రెండు మూడు పాన్ కార్డులు తీసుకుంటున్న వైనాన్ని ఆదాయపన్ను శాఖ పలు సందర్భాలలో గుర్తించింది. ఇప్పుడు అత్యాధునిక పరిజ్ఞానాన్ని కూడా ప్రవేశపెడుతుండటంతో, ఏమాత్రం పొరపాట్లు లేకుండా పాన్ కార్డులు జారీచేసే అవకాశం కనిపిస్తోంది.