నగరంలో మరో ‘ఠాగూర్’ ఘటన
నాగోలు: మృతి చెందిన వ్యక్తికి వైద్యం చేస్తూ డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ మతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన సంఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా కోదాడలోని గుదిబండ గ్రామానికి చెందిన కె.తులసిరెడ్డి ఛాతి నొప్పితో నాలుగు రోజుల క్రితం కొత్తపేటలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి యాజమాన్యం కుటుంబ సభ్యుల నుంచి రూ.2 లక్షలను కట్టించుకుని శస్త్ర చికిత్స నిర్వహించి పరిస్థితి బాగానే ఉందని నమ్మించారు.
తీరా శుక్రవారం మిగిలిన డబ్బులు కట్టించుకున్న తరువాత.. తులసిరెడ్డి మృతి చెందాడని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆసుపత్రి డాక్టర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ గుండెనొప్పి రావడంతో తులసిరెడ్డిని ఆసుపత్రికి తీసుకొచ్చారని, శస్త్ర చికిత్స చేసి స్టంట్లు వేశామని, మెదడు మాత్రం సరిగా స్పందించడం లేదని, సరైన చికిత్స అందించామని అన్ని రికార్డులు ఉన్నాయని తెలిపారు.
చైతన్యపురి సీఐ సమక్షంలో ఆసుపత్రి వర్గాలు అందించిన వైద్యం గురించి బంధువులకు తెలియజేశారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యంతో బంధువులు చర్చలు జరపడంతో ఆందోళన సద్దుమణిగింది.