వస్తున్నాడు
11న హైదరాబాద్‌కు రాహుల్
12న నిర్మల్‌లో
15 కిలోమీటర్ల పాదయాత్ర
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ ఈ నెల 11న హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి.. కొంత ఆర్థిక సాయం అందించనున్నారు. రైతుల్లో భరోసాను కల్పించడానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో 12న ఉదయం 15 కి.మీ కాలినడకన తిరగనున్నారు. పాదయాత్రలో ప్రతీ నియోజకవర్గం నుంచి 200 మంది కార్యకర్తలకు తగ్గకుండా పాల్గొనేలా రాష్ట్ర నేతలు ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ ఈ నెల 11న హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి.. కొంత ఆర్థిక సాయం అందించనున్నారు. రైతుల్లో భరోసాను కల్పించడానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో 12వ తేదీన ఉదయం 15 కిలోమీటర్లు కాలినడకన తిరగనున్నారు. ఈ మేరకు రాహుల్ పర్యటన ఏర్పాట్లపై చర్చించడానికి టీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమన్వయ కమిటీ గాంధీభవన్‌లో మంగళవారం సమావేశమైంది. ఈ పర్యటన సందర్భంగా పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ‘రైతు ఆత్మగౌరవ యాత్ర’ పేరుతో జరుగుతున్న ఈ పాదయాత్రలో ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 200 మంది కార్యకర్తలకు తగ్గకుండా పాల్గొనేలా చూడాలని, నియోజకవర్గాల వారీగా బాధ్యతలను విభజించుకోవాలని నిర్ణయించారు.
పర్యటన వివరాలివీ..
11వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు చేరుకుని.. బేగంపేటలోని బాలయోగి పర్యాటక భవన్లో బస చేస్తారు. 12వ తేదీన ఉదయం 5.30కు హైదరాబాద్ నుంచి వాహనాల్లో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు బయలుదేరుతారు. ఉదయం 9 గంటల సమయంలో ఆ జిల్లాలోని లక్ష్మణచాంద మండలం వడ్యాల గ్రామానికి రాహుల్ చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. వడ్యాల నుంచి రాచాపూర్, పొట్టుపల్లి, లక్ష్మణచాంద మీదుగా కొరటికల్ గ్రామానికి చేరుకుంటారు. ఈ గ్రామాల్లో ఏడు రైతు కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించనున్నారు. పాదయాత్రలో చివరి గ్రామమైన కొరటికల్‌లో ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారు. అదేరోజున రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. 13న ఉదయం ఢిల్లీకి తిరిగి వెళతారు. పార్టీ నేతలు, ఇతర ముఖ్యులు ఎవరైనా రాహుల్‌గాంధీని కలవాలనుకుంటే 11వ తేదీన సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల దాకా అవకాశం ఉన్నట్టుగా టీ పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ముఖ్యనేతలు డి.శ్రీనివాస్, దామోదర, జె.గీ తారెడ్డి, శ్రీధర్‌బాబు, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఎ.మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
రెండు వారాల్లో మరో పర్యటన..
ఉస్మానియా యూనివర్సిటీలో ఇష్టాగోష్టి, తెలంగాణ ప్రొఫెసర్లతో చర్చలు, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాలని రాహుల్ ముందుగా నిర్ణయం తీసుకున్నారని.. అయితే వాటికోసం మరో పర్యటన పెట్టుకోవాలని నిర్ణయించారని టీ పీసీసీ నేతలు తెలిపారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే అందరి దృష్టి అటువైపు మళ్లే అవకాశం ఉంటుందని రాహుల్ భావిస్తున్నట్లు చెప్పారు. అందువల్ల మరో రెండు వారాల్లోనే రాహుల్ మరోసారి హైదరాబాద్‌లో పర్యటించే అవకాశముందని పేర్కొన్నారు.
రైతు కుటుంబాలను ఆదుకోవాలి
సంక్షోభంలో కూరుకుపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని టీ పీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మా జీమంత్రి డి.శ్రీధర్‌బాబు, నేతలు భిక్షమయ్యగౌడ్, మాదు సత్యం అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం వారు వి లేకరులతో మాట్లాడారు. సాగర్‌లో జరిగిన టీఆర్ఎస్ శిక్షణ శిబిరంలో రైతులు, వ్యవసాయం సంక్షోభం, ఆత్మహత్యలను ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని వారు వ్యాఖ్యానించారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.