ఆ రైతు కుటుంబాలను నిలబెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు మళ్లీ తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని మహిళా రైతులు, శ్రామికుల హక్కుల వేదిక (మకాం) డిమాండ్ చేసింది. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన మహిళలను రైతులుగా గుర్తించాలని, వారు వ్యవసాయం కొనసాగించడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరింది. మహిళా రైతులను ఆదుకునేందుకు వారి పేరిట పట్టాలు, రుణాలు, ఇతరత్రా సదుపాయాలు కల్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.
శుక్రవారమిక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మకాం ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభం-మహిళా రైతులు, శ్రామికులపై పడుతున్న ప్రభావం-మనమేం చేద్దాం?’’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. రైతు స్వరాజ్య వేదిక సభ్యురాలు గోపరాజు సుధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోప్రొ.రమా మెల్కొటే, మకాం ప్రతినిధులు ఉషా సీతాలక్ష్మి, విజయ రుక్మిణిరావు, కె.సజయ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో మహిళల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. మకాం పక్షాన గ్రామాలకు వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని, మహిళా రైతు లు, గ్రామాల్లో సంప్రదాయ వ్యవసాయ పరిరక్షణకు చర్యలను చేపట్టాలని నిర్ణయించారు. వ్యవసాయంలో మహిళల పాత్రను వివరిస్తూ రూపొందించిన పోస్టర్లను బాధిత రైతు కుటుంబాల మహిళలతో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రమా మెల్కొటే మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు కేంద్రం సమగ్రమైన విధానం రూపొందించాలన్నారు. సాగును మరిచిపోయి కేవలం పాశ్చాత్య దేశాల్లోని అభివృద్ధిని అనుసరించడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వ్యవసాయాన్ని ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడకపోవడం వల్లే సంక్షోభం తలెత్తుతోందని ఉషా సీతాలక్ష్మి అన్నారు. రైతుల కోసం విరాళాలు సేకరిస్తున్నవారిలో.. రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశం కాకుండా, వారి ద్వారా ఏం ప్రయోజనం పొందుదామనే ధోరణే కనిపిస్తోందని కె.సజయ అన్నారు. మహిళా రైతులకు గుర్తింపు, ఇతరత్రా సమస్యలపై పాదయాత్ర నిర్వహించాలని ప్రముఖ రచయిత్రి విమల సూచించారు.