Family counseling centers
-
రాజీ కుదిర్చేవారేరీ!
కర్నూలు, న్యూస్‌లైన్: వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చే భార్యాభర్తలకు నచ్చజెప్పి రాజీ చేయాల్సిన వారు కరువయ్యారు. డోన్, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, ఆదోని, నంద్యాల సబ్ డివిజన్ కేంద్రాల్లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ కింది స్థాయి సిబ్బందితో తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతి ఆదివారం కలహాల కాపురాలను రప్పించి సబ్ డివిజన్ అధికారి స్థాయిలో గంటలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించి ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేయాలి. అయితే పై అధికారుల ఆదేశాల మేరకు తూతూ మంత్రంగా సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆదివారం 30-40 జంటల దాకా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి జంటల మధ్య ఏర్పడిన మనస్పర్థలు విని సర్దిచెప్పి కుటుంబాలను నిలబెట్టే కృషి జరగాలి. డోన్‌లో రెండేళ్లుగా ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహించడం లేదు. మొదట్లో ప్రతి ఆదివారం సబ్ డివిజన్ అధికారితో పాటు సభ్యులుగా మహిళా మండలి సభ్యులు ఇద్దరు, ఐసీడీఎస్ అధికారి, ఇన్నర్ వీల్ సభ్యులు ఇద్దరుతో పాటు మరో నలుగురు స్వచ్చంధసంస్థల సభ్యులు కుర్చొని భార్యాభర్తలకు కౌన్సెలింగ్ చేసేవారు. అయితే ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సేమియానా, కుర్చీలు, టేబుళ్ల అద్దె ఖర్చు భరించేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ను ఎత్తివేసినట్లు సమాచారం. ఆత్మకూరులో కుటుంబాల మధ్య కలహాలను తొలగించేందుకు పోలీస్‌శాఖ 2002లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ ప్రారంభించింది. అప్పటి డీఎస్పీ మాధవాచారి, సీఐ రామకృష్ణ, ఎస్ఐ పవన్‌కిశోర్ ఈ సమావేశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 1025 కేసులు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలోఫ్యామిలీ కౌన్సెలింగ్ ఉందనే విషయం ఇప్పటి వరకు కోర్టులకు వెళ్లిన భార్యాభర్తలకు, విడిపోయిన రక్త సంబధీకులకు తెలియదు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారిని ఒక సారి ఎస్ఐ కూర్చో బెట్టి మాట్లాడటం వినక పోతే కేసు కట్టి కోర్టులో చూసుకో పొండని పంపుతున్నట్లు తెలిసింది -
ఆమెకు అన్యాయం
దంపతులు చిన్నపాటి విభేదాలతో జీవితాన్ని చీకటిమయం చేసుకోకుండా నివారించాల్సిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలు బాధ్యతల నుంచి తప్పుకున్నాయి. పోలీస్స్టేషన్లు, ప్రైవేట్ పంచాయితీలు అత్యధిక భాగం ‘పురుషుడి’ వైపే మొగ్గు చూపుతుండటంతో మహిళల బాధ అరణ్యరోదనే అవుతోంది. భార్యాభర్తలిద్దరినీ కూర్చోబెట్టి.. సమస్యకు మూల కారణాన్ని అన్వేషించి పరిష్కారం చూపడానికి ప్రభుత్వం ప్రతి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో డీఎస్పీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అవి సరిగా పని చేయకపోవడంతో మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రవేట్ పంచాయితీల్లో మహిళకు ...ఇంత మొత్తం చెల్లించి వెళ్లిపోవచ్చంటూ మగరాయుళ్లకు అనుకూలంగా తీర్పులు వెలువరిస్తున్నారు. అనంతపురం క్రైం/లీగల్, న్యూస్‌లైన్: మాట పట్టింపులతో కొందరు.. ఉమ్మడి కుటుంబాల్లో ఇమడలేక మరికొందరు.. దంపతుల మధ్య ఇలా చిన్నపాటి కారణాలతో మొదలైన గొడవలు విడాకులకు దారితీస్తుంటే అడ్డుకుని సర్దిచెప్పాల్సిన వారు జిల్లాలో చోద్యం చూస్తున్న పరిస్థితి నెలకొంది. అలాంటి వారిని చూసి ఇరువైపుల కుటుంబాలూ మనోవేదనకు గురవుతున్నాయి. దంపతులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాలను సరిదిద్దేందుకు ఉద్దేశించిన సంస్థలపై చాలామందికి అవగాహన ఉండడం లేదు. దీంతో వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేరుగా పోలీసుస్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. సమస్య పరిష్కరించాల్సిన పోలీసులు మరింత పెద్దది చేస్తూ కాపురాలు కూలడానికి కారణమవుతున్నారు. అందుబాటులో లేకనే.. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు జిల్లా వ్యాప్తంగా అందుబాటులో లేకపోవడంతో చాలామంది పోలీసు స్టేషన్లను ఆశ్రయించాల్సి వస్తోంది. పైగా కౌన్సెలింగ్ సెంటర్లు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా సేవలందించేందుకు ఉన్నాయన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. దీంతో ఎక్కువ శాతం పంచాయితీల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. పెద్దల ఒప్పందంతో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎవరో ఒకరు నష్టపోవాల్సి వస్తోంది. పైగా మహిళలకే తీరని అన్యాయం జరుగుతోంది. విడిపోతున్న మహిళలకు రూ.10వేలో, రూ.20 వేలో చేతిలో పెట్టి అదే న్యాయమని పెద్దలు ఆదేశిస్తున్నారు. విడాకుల కేసులు అధికం 2012 నుంచి ఇప్పటిదాకా జిల్లా కేంద్రంలోని కుటుంబ న్యాయ స్థానానికి వచ్చిన కేసులను పరిశీలిస్తే విడాకులు కోరుతున్నవే అధికంగా ఉండడం ఆందోళన కల్గించే విషయం. 2012లో 152 మంది కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 136 మందికి పరిష్కారం చూపారు. 16 కేసులు పెండింగ్ ఉన్నాయి. 2013లో 108 మంది కోర్టును ఆశ్రయించగా.. 103 మందికి పరిష్కారం చూపారు. ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2014లో నేటి దాకా నలుగురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న కేసుల్లో ఎక్కువగా దంపతుల మధ్య విభేదాలతో విడాకులు కోరడం, ఉమ్మడి కుటుంబాల్లో మహిళల మధ్య విభేదాలు, అన్నదమ్ములు, వారి భార్యల మధ్య అభిప్రాయ భేదాలతో కూడిన కేసులే అధికంగా ఉన్నాయి. జిల్లా న్యాయసేవాధికార సంస్థకు ఏడాదికి 150 కుటుంబ సమస్యలతో కూడిన కేసులు వస్తున్నాయి. న్యాయసేవాధికార సంస్థ మానవ సంబంధాలు, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు బలపడేలా అవగాహన కల్పిస్తోంది. ఈ సంస్థకు అనుబంధంగా మధ్యవర్తిత్వ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రతి మండల పరిధిలోని ఐదు వేల జనాభా ఉన్న పంచాయతీల్లో న్యాయసేవలు అందించడానికి ఒక న్యాయవాది, ప్యారాలీగల్ వలంటీర్లతో మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కుటుంబాల్లో సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ కేంద్రాలు కీలకంగా పనిచేస్తాయి. పోలీసుస్టేషన్ల మెట్లెక్కకుండా, అవగాహన రాహిత్యంతో వందేళ్ల జీవితాన్ని ఏ కుటుంబమూ కోల్పోకుండా ఈ సంస్థ సేవలందిస్తుంది. పోలీసు స్టేషన్లో కుదుర్చుకొనే రాజీ ఒప్పందాలు న్యాయ సంస్థలో చెల్లుబాటు కావని అనంతపురానికి చెందిన న్యాయవాది హరికృష్ణ తెలిపారు.