family counselor
-
లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడితే... జైలు, జరిమానా
కేస్ స్టడీ సరిత, దినేష్‌ల పెళ్లయ్యి ఆరేళ్లయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. దినేష్ తన తలిదండ్రులకు ఒక్కడే సంతానం. వారి పినతండ్రులకూ, పెద తండ్రులకూ ఎవరికీ మగసంతానం లేదు. వారి ఏకైక వారసుడు దినేష్ ఒకడే. అందరూ వారి వంశంలో ఒక మగపిల్లాడు పుట్టాలని కలలు కంటున్నారు. దినేష్‌కి గనక మగపిల్లలు పుట్టకపోతే, ఇక అతని తర్వాత వారి వంశం అంతరించి పోతుందని వారి భావన. దాంతో మూడోసారైనా కొడుకు పుట్టాలని సరితని ఆపరేషన్ చేయించుకోకుండా ఆపేశారు. ఇప్పుడు సరిత గర్భవతి. అందరిలోనూ టెన్షన్. ఒకవేళ ఇప్పుడు పాపే పుడితే ..? అందరూ కలిసి ఆమెను బలవంతం చేయసాగారు. తెలిసిన డాక్టర్ దగ్గరకెళ్లి స్కానింగ్ చేయించి చూసి పాపైతే అబార్షన్ చేయిస్తామని తీవ్రంగా వేధించసాగారు. సరితకు ససేమిరా ఇష్టం లేదు. అతికష్టం మీద భర్తను ఒప్పించి ఫ్యామిలీ కౌన్సెలర్ దగ్గరకు తీసుకొని వెళ్లింది. ఆ ఫ్యామిలీ కౌన్సెలర్ న్యాయవాది కూడా: నెమ్మదిగా వారి సమస్య ఏమిటో తెలుసుకుని, గర్భస్థ పిండ పరీక్ష, లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 గురించి ఇలా వివరించారు. హాస్పిటల్స్‌లో ఎవరైనా డాక్టర్గాని, టెక్నీషియన్ గాని, గైనకాలజిస్ట్ లేక మెడికల్ ప్రాక్టిషనర్ గానీ లింగనిర్థారణ పరీక్షలు నిర్వహించకూడదు. అవసరం లేకుండా గర్భిణులకు స్కానింగ్ చేయరాదు. ఒకవేళ ఆరోగ్య కారణాల దృష్ట్యా చేయవలసి వస్తే గర్భస్థ శిశువు ఎవరైనదీ చెప్పరాదు. అలా చేస్తే చట్టప్రకారం 3 సం. జైలుశిక్ష, జరిమానా పడతాయి. 35 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భవతులైన మహిళలకు, ఎక్కువసార్లు గర్భస్రావాలు జరుగుతున్న మహిళలకు, జన్యుసంబంధ, క్రోమోజోమ్ సంబంధ, సెక్స్ సంబంధ రోగాలతో బాధపడుతున్న గర్భిణులకు మాత్రమే గర్భస్థ శిశువు పెరుగుదల, ఆరోగ్యాలను గురించి తెలుసుకునేందుకు పిండపరీక్ష లు చేయవచ్చు. అంతేగాని లింగనిర్ధారణ, ఫీమేల్ ఫీటిసైడ్ కోసం కాదు. న్యాయవాది చెప్పిన విషయాలు విని దినేష్ షాక్ తిన్నాడు. తన కుటుంబ సభ్యులకూ చెప్పాడు. దాంతో సరితపై వేధింపులు తగ్గాయి. అసలు గర్భస్థ శిశువు ఆడామగా అనేది నిర్ణయించేది పురుషునిలోని ్ఠడ క్రోమోజోములే! ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
అమ్మను సంతోషపెట్టాలి!
కౌన్సెలింగ్ చట్టాలు, అర్హతలనుఅడ్డుపెట్టుకుని కడుపున పుట్టిన పిల్లలు తమ బాధ్యతలను విస్మరించవద్దు. అమ్మ సంరక్షణ భారాన్ని తీసుకోవడానికి ... లేని కారణాలు సృష్టించుకొని, అమ్మను దూరం చేసుకోవద్దు. అమ్మను కష్టపెట్టకూడదు. ప్రేమమయమైన అమ్మ మనసును సంతోష పెట్టడం పిల్లల బాధ్యత. కూతురు... : చిన్నతనంలో ఆడపిల్లలు అమ్మ చీరను చుట్టబెట్టుకుని, అమ్మలా అజమా యిషీ చలాయిస్తారు. అది చూసిన అమ్మ తానొక చిన్నపిల్లలా మారిపోయి, కూతురినే తల్లిలా చూస్తుంది. కన్నకూతురు తన కళ్ల ముందు పెరిగి పెద్దదవుతూంటే ఒక పక్కన సంతోషపడుతూనే, మరో పక్క భయపడుతూ ఉంటుంది. ‘అమ్మో అమ్మాయి పెరిగి పెద్దదైపోతే! ఒక అయ్య ఎగరేసుకుపోతే ఎలా? అనుకుంటుంది. ఆ భయం అయ్య ఎగరేసుకుపోకూడదని కాదు, ఎలాంటి అయ్య వస్తాడోనని! కన్న కొడుకులాంటి అల్లుడు వచ్చి తన కూతురిని మహారాణిలా చూసుకుంటే, కూతురు దూరంగా ఉన్నా కూడా తల్లి ఆనందిస్తుంది. అదే కూతురు అత్తవారింటికి వెళ్లిపోయి, అమ్మతో తనకే సంబంధ మూ లేదనుకుంటేనే ఆ తల్లి బాధపడుతుంది. తన చేతులలో పెరిగి, తన చేతుల మీదుగా అత్తవారింటికి వెళ్లి, తన చేతుల మీదుగా చంటిపిల్లల్ని ఎత్తుకున్న కూతురు, అమ్మ అవసరం తీరిపోయిందని అమ్మను దూరం చేస్తే ఆ తల్లి పడే వేదన అంతా ఇంతా కాదు. కొడుకు... : తల్లి గుండెల మీద చిట్టిచిట్టి పాదాలతో తన్నుతూ అమ్మకు ఆనందాన్ని కలిగిస్తాడు కొడుకు. వంశోద్ధారకుడు పుట్టినందుకు ఆ తల్లి పొంగిపోతుంది. నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతూ, కొడుకుతో పాటు తను కూడా చదువు నేర్చుకుంటూ, వాడికి కలిగే సందేహాలు నివృత్తి చేస్తూ, వాడి ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది తల్లి. కొడుకు ఇష్టపడిన అమ్మాయితో వివాహం చేస్తుంది. తండ్రికి ఇష్టం లేకపోయినా సర్దిచెబుతుంది. ఆ కొడుకు తనకు భార్య రాగానే తల్లిని నిర్లక్ష్యం చేసి, ఆమె అడిగే ప్రశ్నలకు విసుక్కుంటూ ఉంటే ఆ తల్లి మనసు గాయపడుతుంది. కొడుకన్నాక భార్యను, తల్లిని ఇద్దరినీ సమదృష్టితో చూడాలి. ఆ తల్లి వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాననీ, ఒక భార్యకు భర్తనయ్యాననీ అర్థం చేసుకోవాలి. తల్లి ఋణం తీర్చుకోలేమనే విషయాన్ని సంతానం అర్థం చేసుకోవాలి. - సి. వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సెలర్