family feuds
-
కట్టేసి, కారం చల్లి..
కరీంనగర్ క్రైం: కుటుంబ కలహాలతో భర్తను అతికిరాతకంగా కడతేర్చిందో భార్య. తాళ్లతో కట్టేసి, కారంపొడి చల్లి, వేడినీళ్లు పోస్తూ.. రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదర్శనగర్‌కు చెందిన తోట హేమంత్(39)కు 2012లో రోహితితో వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. హేమంత్ పెట్రోల్‌బంక్‌లో పనిచేసి మానేశాడు. రోహితి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పేషెంట్ కేర్‌గా పనిచేస్తోంది. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం గొడవ తీవ్రమైంది. దీంతో రోహితి హేమంత్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆస్పత్రిలో పనిచేసే నవీన్, సాయికుమార్ సాయం కోరింది. బుధవారం రాత్రి వారిని ఇంటికి పిలిచింది. వారు ఇంటికి వచ్చి గేటు, ఇంటి తలుపులు మూసేశారు. ముగ్గురూ కలిసి హేమంత్‌ను తాళ్లతో కట్టేశారు. కళ్లలో కారం కొట్టారు. అనంతరం నవీన్, సాయికుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత రోహితి హేమంత్ శరీరంపై వేడినీళ్లు పోస్తూ.. రోకలిబండతో విచక్షణరహితంగా దాడి చేసింది. తల, మర్మాంగాలపై దాడి చేయడంతో రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు. దీంతో రోహితి అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. హేమంత్ తల్లి విమల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కన్నతల్లి కళ్లెదుటే..: తన కళ్లెదుటే హేమంత్‌ను కొట్టారని, కొట్టొద్దని బ్రతిమిలాడినా వినలేదని విమల రోదించింది. వేడినీళ్లు, కారంపొడి పోస్తూ దాడి చేశారని, ముగ్గురు పిల్లలున్నారు వద్దన్నా వినకుండా చంపేశారని భోరుమంది. పథకం ప్రకారమే హేమంత్‌ను నిందితులు చంపారని బంధువులు ఆరోపించారు. బుధవారం ఉదయం నుంచి నవీన్, సాయికుమార్ పలుమార్లు ఫోన్ చేశారని హేమంత్ తమకు చెప్పాడన్నారు. ఈ క్రమంలోనే రాత్రి ఇంటికి వచ్చి పథకం ప్రకారం దాడిచేసి చంపారని ఆరోపించారు. -
తండ్రి సహా 12 మందిని చంపేశాడు!
టెహ్రాన్: ఇరాన్లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి, సోదరుడు సహా మొత్తం 12 మంది కుటుంబసభ్యులను పొట్టనబెట్టుకున్నాడు. కెమ్రాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇరాన్ మీడియా శనివారం తెలిపింది. 30 ఏళ్ల వ్యక్తి తన తండ్రి, సోదరుడితోపాటు మొత్తం 12 మందిని ఏకే రైఫిల్‌తో కాల్చి చంపాడని, అనంతరం పోలీసులు అతడిని కాల్చి చంపారని తెలిపింది. మారుమూల గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణానికి కుటుంబకలహాలే కారణమని పేర్కొంది. మృతుల్లో చిన్నారులు ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. అయితే, మృతుల వివరాలు, ఘటనకు కారణాలను మాత్రం మీడియా వెల్లడించలేదు. -
కుటుంబ తగాదాలు.. అత్తా మరదలుపై దాష్టీకం
కుటుంబ తగాదాలతో సొంత మరదల్ని పీక కోసి చంపిన ఓ యువకుడు.. ఆపై అత్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒడిశా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కేసు. ఈ భయానక ఘటన వివరాల్లోకి వెళ్తే.. కియోంజ్హర్: ఒడిషా వ్యాప్తంగా ఓ కేసు సంచలనంగా మారింది. కుటుంబ తగాదాలు శ్రుతి మించడంతో ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. మరదలిని హత్య చేసి.. ఆపై అత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కియోంజ్హర్ జిల్లా కిరిబురు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు రూప్‌సింగ్‌కు, బంధువులైన బాధితురాలి కుటుంబంతో చాలాకాలంగా గొడవలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో అడవిలో పుట్టగొడుగులు, కర్ర ఏరుకునేందుకు ఆ తల్లీకూతుళ్లు వెళ్లారు. అయితే వాళ్లను అనుసరించిన నిందితుడు.. అక్కడ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా గొడ్డలితో మరదలి గొంతును కోశాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. అంతటితో ఆగకుండా ఆ యువతి తల్లిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై యువతి శవాన్ని మోసుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న 200 అడుగుల లోయలో పడేశాడు. ఇదే అదనుగా భావించిన యువతి తల్లి.. అక్కడి నుంచి తప్పించుకుని దగ్గర్లో ఉన్న జార్ఖండ్ అవుట్‌పోస్ట్ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే బొలానీ పోలీసులకు వాళ్లు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బార్బిల్ సబ్ డివిజినల్ ఆఫీసర్ ఘటనాస్థలానికి చేరుకుని లోయ నుంచి యువతి మృతదేహాన్ని వెలికి తీశారు. బాధితురాలి తల్లిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపి.. రూప్ సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ దారుణ ఘటనలో నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ కేసు మీడియాలో హైలైట్ కావడంతో.. దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ పోలీస్ శాఖను ఆదేశించారు. -
భార్యను చంపేసిన భర్త
క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోపంలో విచక్షణ కోల్పోయిన ఓ భర్త.. కట్టుకున్న భార్యనే చంపేశాడు. వివరాలు.. సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతంలోని తుకారాంగేట్ వద్ద ఉండే శ్రీనివాస్, సాంబ దంపతులు గురువారం సాయంత్రం గొడవపడ్డారు. తీవ్ర కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ భార్యను కత్తితో నరికి చంపాడు. అనంతరం ఘటనస్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా.. భార్యా, భర్తల మధ్య గొడవకు కారణాలు తెలియ రాలేదు.