సండే ఫ్లాష్..: బ్యాక్సినిమాకెళ్తాం నాన్నా!
షూటింగ్‌లు ఆగిపోతాయట.. సినిమా టికెట్లు తగ్గించాలట. కలెక్షన్లు లేవట.. థియేటర్లు ఖాళీ అట. ఇవీ ఇవాళ్టి వార్తలు. కాని థియేటర్లో రిలీజయ్యే సినిమాయే ఏకైక వినోదంగా ఉన్న 1980–90లలో సినిమాకు వెళ్లాలంటే ఎంత తతంగం. ఎంత ప్రిపరేషను. ఎన్ని పర్మిషన్లు. ఎంత హడావిడి. ఎంత సంబరం. జ్ఞాపకం ఉన్నాయా ఆ రోజులు. జ్ఞాపకం చేయమంటారా?
నేల డెబ్బయి అయిదు పైసలు. బెంచి రూపాయి. కుర్చీ రూపాయిన్నర. బాల్కనీ రెండు రూపాయలు. ఆ డబ్బులు ఉండేవి కాదు. సినిమాకంటూ కొంత డబ్బు మిగలాలంటే ఇంటి బడ్జెట్లో చాలా కుదరాలి. ఎవరికో హటాత్తుగా జ్వరం రాకూడదు. ఏ ఇంటనో పెళ్లి జరక్కూడదు. ఏదో ఒక బంధువుల ఇంటికి ప్రయాణం పడకూడదు. చుట్టాలు ఊడి పడకూడదు. నోటు పుస్తకాలని, టెక్ట్స్ పుస్తకాలని పిల్లలు డబ్బులు అడక్కూడదు. అన్నీ కుదిరి ఇంట్లో ఐదు రూపాయల వరకూ ఉంటే ఫ్యామిలీ అంతా సినిమాకు పోవచ్చు.
సినిమా మారితే గోడ మీద పోస్టర్ పడుతుంది. దానిమీద నీలి సిరాతో థియేటర్ పేరు... ఎన్ని ఆటలో రాసి ఉంటుంది. బండి వీధుల్లో తిరుగుతూ మైక్‌లో ‘మీ అభిమాన థియేటర్ శ్రీ వేంకటేశ్వరలో... రేపటి నుండి’... అని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అది ఫ్యామిలీ సినిమా అయితే అమ్మ మనసు లాగుతుంది. ఫైటింగ్ సినిమా అయితే పిల్లలకు తబ్బిబ్బవుతుంది. నాన్నకు ఏ సినిమా అయినా ఒకటే. ఆయన ఉదయం వెళ్లి రాత్రివరకూ పని చేస్తూనో ఉద్యోగం చేస్తూనో షాపు నడుపుతూనో బిజీ. సినిమా మారినట్టే తెలియదు. చూద్దామనే ఆసక్తీ ఉండదు. కాని పర్మిషన్ ఇవ్వాల్సిందీ డబ్బు చేతిలో పెట్టాల్సిందీ ఆయనే.
కొందరు నాన్నలు ఎప్పుడూ ధుమధుమలాడుతూ ఉంటారు. వారిని సినిమాకు పర్మిషన్ అడగాలంటే భయం. కాని ఆ నాన్నలే పిల్లల మాట వింటారు. ‘రేయ్... సినిమాకెళ్తామని మీ నాన్నని అడగండిరా’ అని తల్లులు పిల్లల్ని రాయబారానికి పంపుతారు. కొందరు నాన్నలు చుట్టాలు ఇంటికి రాగానే పొంగిపోతారు. ‘అందరు కలిసి సినిమాకు పోండి’ అని డబ్బులిచ్చి పంపుతారు. కొందరు నాన్నలు చాలా వింత. వాళ్లకై వాళ్లు ఏ మ్యాట్నీయో చూసేసి ఏమెరగనట్టు ఉంటారుగాని ఇంట్లోవాళ్లు సినిమాకు వెళతామంటే మాత్రం ఒప్పుకోరు. కొందరు నాన్నలు అందరూ కలిసి వెళ్లేలా టికెట్లు ముందే తెచ్చి తీసుకువెళతారు. వీళ్లు మాత్రం చాలా మంచి నాన్నలు.
ఈ రోజు ఫస్ట్ షోకు వెళ్లాలంటే పొద్దున్నుంచే హడావిడి. ఇరుగమ్మకు పొరుగమ్మకు అవసరం ఉన్నా లేకపోయినా ‘ఇవాళ మేము సినిమాకు వెళుతున్నాం’ అని చెప్తుంది అమ్మ. మంచి చీరా జాకెట్టు వెతుక్కోవడం, వంట తొందరగా ముగించడం, నాన్నకోసం తాళం పక్కింట్లో ఇవ్వడం.... పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర గొప్పలు పోతారు– సినిమాకు వెళుతున్నామని. ఇంట్లో నానమ్మ ఉంటే ఆమె మెల్లగా నడుస్తుంది కనుక చాలా ముందే బయలుదేరాలి. ఆమె వేలు పట్టుకుని నడిపించడానికి మనవడు తెగ తొందర పడుతుంటాడు. ట్రైల్పార్ట్ ఉంటుందని కొందరు ఆరాంగా బయలుదేరుతారు. మరికొందరు ‘డింగ్డింగ్ డింగ్డింగ్’ అని మ్యూజిక్ వచ్చి కుచ్చుల తెర పైకి లేచేప్పటి నుంచి చూడాలని ముందే వచ్చేస్తారు. చివరి నిమిషంలో టికెట్లు అయిపోయాయని వెనక్కు వెళ్లేవాళ్లు కొందరైతే... సినిమాకు గంట ముందే వచ్చి ముందు జాగ్రత్తగా ఖాళీ క్యూలో నిల్చునేవారు కొందరు.
ఇంటర్వెల్లో ఏం తినాలి? దాని బడ్జెట్ ఎంత? అనేదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. పిల్లలకు పావలా ఇవ్వడం పెద్ద విషయం. కొందరు తల్లులు ఏ జామకాయనో, బొరుగులనో జేబుల్లో పోసి ఇవి తిను అంటారు. ఉప్పుజల్లిన రేక్కాయలు పది పైసలకు కూడా దొరుకుతాయి హాలు బయట. లోపలకు తీసుకెళ్లి తినడమే. వడలు, బజ్జీలు తింటే అదో తృప్తి. పెద్ద కుటుంబాల వారు ఇంటర్వెల్లో గోల్డ్‌స్పాట్ కొనుక్కుని మెల్లమెల్లగా తాగుతూ చూస్తారు. అన్నింటికంటే ముఖ్యం స్టిల్స్ డబ్బా ముందు నిలబడి ఎన్ని స్టిల్స్ ఫస్ట్ హాఫ్‌లో ఉన్నాయో ఎన్ని స్టిల్స్ సెకండ్ హాఫ్‌లో రానున్నాయో చూసుకోవడం. రాబోయే సినిమాల పోస్టర్లను నోరు వెళ్లబెట్టి చూడటం. తెలిసిన ఏ ఒక్కరు కనిపించినా ‘ఏవోయ్... సినిమాకు వచ్చావా?’ అని అడగడం. సినిమాహాల్లో కనిపించినవాడు సినిమాకు రాక టిఫిన్ తినడానికి వస్తాడా?
సినిమాలో మనం కట్టుకోలేని బట్టలు హీరో హీరోయిన్లు కట్టుకుంటారు. మనం చేయలేని సాహసాలు హీరోలు చేస్తారు. మనం చూడని ప్రదేశాలు అందంగా చూపిస్తారు. మనం నవ్వే ఏడ్చే సందర్భాలను రక్తి కట్టిస్తారు. అద్దె ఇళ్లు, రేషన్ సరుకు, చాలీ చాలని ఆదాయం, స్లిప్పర్లు కూడా లేని జీవితం, బయట టీ తాగడానికి కూడా ఆలోచించే బతుకు... వీటిమధ్య మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది.
ఇవాళ? చేతిలో కంప్యూటర్లో టీవీలో ఎన్ని కావాలంటే అన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటువంటి సినిమాలు కావాలంటే అటువంటివి ఉంటే... అంతా అతి అయిపోతే కొద్దిపాటి రుచిలోని మాధుర్యం పోయింది. ఎంతో గొప్ప వంటకం తెర కోసం తయారైందని తెలిస్తే తప్ప హాలు వైపు నడవడం లేదు ఎవరూ.
కొత్తొక రోత. పాతొక వింత.
మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది.