కన్నీటి వీడ్కోలు
ముషీరాబాద్/చిక్కడపల్లి: ప్రముఖ జర్నలిస్ట్, కవి, విప్లవ స్ఫూర్తి ప్రదాత యాదాటి కాశీపతి అంత్యక్రియలు కవులు, కళాకారులు, విప్లవ అభిమానుల అశ్రునయనాల మధ్య ఆదివారం బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో జరిగాయి. గత గురువారం తుది శ్వాస విడిచిన కాశీపతి భౌతిక కాయాన్ని నిమ్స్ ఆసుపత్రి మార్చురీలో భద్ర పరిచారు. అమెరికాలో ఉంటున్న ఆయన కుమార్తెలు ప్రగతి, వెన్నెలలు నగరానికి చేరుకోవటంతో ఆదివారం ఉదయం కాశీపతి భౌతిక కాయాన్ని గాంధీనగర్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విప్లవాభిమానులు, వివిధ పార్టీల, ప్రజా సంఘాల నేతలు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు నివాళులు అర్పించారు. కాశీపతి జర్నలిస్ట్‌గా, విప్లవ భావాలతో సమాజాన్ని చైతన్యం చేసిన తీరును ఈ సందర్భంగా కొనియాడారు.
భౌతిక కాయంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కాశీపతి అమర్ రహే అంటూ జోహార్లు అర్పించారు. ఆయనపై విప్లవ గీతాలను ఆలపించారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఈడీ రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, మల్లెపల్లి లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావ్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్రావ్, వేములపల్లి వెంకటరామయ్య, పి. రంగారావ్, పి. ప్రసాద్, జేవీ చలపతిరావ్, కె. గోవర్థన్, ఎం. శ్రీనివాస్, సంధ్య, అనురాధ, నరేందర్, పస్క నర్సయ్య, రమ, ఝాన్సీ, జనశక్తి అమర్, అరుణోదయ విమల, గౌతమ్ ప్రసాద్, సత్య, ప్రముఖ కవి జూలూరి గౌరిశంకర్, పాశం యాదగిరి, చండ్ర పుల్లారెడ్డి సతీమణి రాధక్క, కొండేటి మోహన్‌రెడ్డి, అరుణోదయ రామారావ్, విమల, రాజేందర్ ప్రసాద్, వేణు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, ప్రముఖ జర్నలిస్ట్ పల్లె రవికుమార్, విరసం సభ్యులు రామకృష్ణ, రామ్మోహన్, నారాయణస్వామి, సుధాకిరణ్, రత్నమాల, భారత్ విద్యాసంస్థల ఎండీ సిహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, రచయిత జనజ్వాల, బీసీ మహాజన ఫ్రంట్ నేత యు. సాంబశివరావ్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కొలుకలూరి ఇనాక్, బైరాగి మోహన్, పరశురాం, సీపీఎం నాయకులు జి. రాములు, బి.బిక్షమయ్య, అనంతపురం నుంచి ప్రభాకర్‌రెడ్డి, వినాయక్‌రెడ్డి, వినయ్‌బాబు, చెరుకు సుధాకర్, ములగు ప్రసాద్, అంబిక, స్వర్ణ, పశ్య పద్మ తదితరులు నివాళులు అర్పించారు.
అంతకంటే ముందు కాశీపతి భౌతికకాయం వద్ద అరుణోదయ రామారావ్ తదితరులు డప్పుకొట్టి పాటలు పాడుతూ ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం బౌతిక కాయాన్ని బన్సీలాల్ పేట శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. శ్మశాన వాటికలో జరిగిన సంతాప సభకు న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వై. కొండయ్య అధ్యక్షత వహించగా పలువురు ప్రసంగించి ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పారు.