ఇర్ఫాన్ can
ఈయన స్టార్ కాడు స్వామీ. యాక్టర్. తేడా ఏంటో? స్టార్ అంటే ఎన్ని కోట్ల కలెక్షన్ అయిందో చెబుతారు. యాక్టరంటే ఎన్ని కోట్ల ఫ్యాన్సో చెప్పుకుంటారు. ఇర్... ఫాన్‌కు ఫ్యాన్లే ఫ్యాన్లు. డైలాగ్‌లో వాల్యూమ్ ఉండదు. వాల్యూ ఉంటుంది. ముఖ కవళికలు మినిమమ్, ఇంపాక్ట్ మాక్జిమమ్. కదిలినట్టు ఉండడు... కదిలిస్తాడు. పాత్ర పరిగెడుతుంది. కీప్స్ యువర్ హార్ట్ రేసింగ్. ఎస్! హి ఈజ్ ఇర్ఫాన్ can.
ఎడారిలో ఒంటె నీరు, ఆహారం లేకుండా దాదాపు నలభై రోజులు ప్రాణాలు నిలబెట్టుకుంటుంది. నలభయ్యో రోజు నీళ్లు దొరికితే రెండు మూడు నిమిషాల్లోనే రెండు డ్రమ్ముల నీళ్లు తాగేస్తుంది. ఇర్ఫాన్ ఖాన్ కథ సరిగ్గా ఇలాంటిదే.
హాలీవుడ్లో మహామహులు కోరితే అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించే ‘గ్లాడియేటర్’ దర్శకుడు రిడ్లే స్కాట్ ఆమధ్య ఇండియాకు కాల్ చేశాడు. తన తాజా సినిమా ‘ది మార్షియన్’కు ఇర్ఫాన్ డేట్స్ కావాలి. ‘మీకేమైనా వీలవుతుందా ఇర్ఫాన్’- అవతలి వైపు నుంచి అంత పెద్ద దర్శకుడు చాలా వినయంగా అడుగుతున్నాడు. ఏం చెప్పాలి? ఇర్ఫాన్‌కు డైరీ చూడాల్సిన అవసరం లేదు. అందులో ఒక్క పేజీ కూడా ఖాళీ లేదని తెలుసు. కాని చెప్పకతప్పదు. ‘సారీ స్కాట్... వెరీ సారీ’. ఇర్ఫాన్‌తో కలిసి పని చేసిన ‘అమేజింగ్ స్పైడర్‌మేన్’ దర్శకుడు మార్క్ వెబ్‌కు ఒకటే కోరిక. మళ్లీ ఇర్ఫాన్‌తో కలిసి పని చేయాలని.
ఎందుకంటే ఒక పాత్రను దాని అంతరాత్మకు సరిపోయేలా నటించే నటుణ్ణి అతడు అంతదాకా చూడలేదు. రేపో మాపో రిలీజ్ కాబోతున్న ‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడు కాలిన్ ట్రెవెరోకు హాలీవుడ్ గొడ్డుపోలేదని తెలుసు. అతడి ఎదుట వందలమంది యోగ్యులైన నటుల లిస్ట్ ఉంది. కాని ఆ సినిమాలో కీలకమైన జురాసిక్ పార్క్ ఓనర్ పాత్రను ఇర్ఫాన్‌తో సైన్ చేయిస్తే తప్ప అతడు స్థిమిత పడలేదు. టామ్ హ్యాంక్స్ నటనను ప్రపంచం గౌరవించింది.
అతడు హీరోగా ఇటీవలే ‘ఇన్ఫెర్నో’ అనే సినిమా మొదలైతే అందులో అంతకు సమానమైన మరోనటుడి అవసరం ఏర్పడింది. ఇర్ఫాన్‌ఖాన్‌కు బుడాపెస్ట్‌కు పిలుపొచ్చింది. స్లమ్‌డాగ్ మిలియనీర్, లైఫ్ ఆఫ్ పై... ఇర్ఫాన్ ఏమిటో ప్రపంచానికి చూపాయి. అమెరికాలో అత్యంత ఆదరణ పొందిన టెలివిజన్ సిరీస్ ‘ఇన్ ట్రీట్మెంట్’ ఇర్ఫాన్ ప్రెజెన్స్‌తో కొత్త స్టేటస్‌ను పొందాయి. అందరికీ ఇర్ఫాన్ కావాలి. ఇర్ఫాన్‌కు అన్ని మంచి పాత్రలూ కావాలి. ఇంతకాలం అతడు చుక్క నీళ్లు, గుప్పెడు మెతుకులు కనిపించక పోయినా ప్రాణాలు కాపాడుకున్నాడు.
ఇప్పటికి ఒయాసిస్కు చేరుకున్నాడు. ఇక జిహ్వకి తిన్నంత. మనసుకు తాగినంత. రాజస్థాన్‌లో ‘టోంక్’ అనే ప్రాంతం ఉందని చాలామందికి తెలియదు. ఇర్ఫాన్‌ఖాన్ వల్లే తెలిసింది. జైపూర్‌కు దాదాపు 60 మైళ్ల దూరంలో ఉన్న ఆ చిన్న పట్టణం ఇర్ఫాన్ తల్లిది. ఇర్ఫాన్ బాల్యం అక్కడి ఇసుక దిబ్బల మీద కొంత గడిచింది. తండ్రి సొంత వూరైన జైపూర్‌లో మరి కొంత. సంప్రదాయ ముస్లిం కుటుంబం.
సినిమాలను పాపహేతువులుగా చూసే కుటుంబం. పైగా పూర్వికులు నవాబులు కావడం వల్ల ఇప్పుడు ఆ సంపద లేకపోయినా డాబూ దర్పం మాత్రం కాపాడుకోవాల్సిందే. అందుకే తండ్రి అతడికి ‘సాహబ్జాదే ఇర్ఫాన్ అలీఖాన్’ అని పేరు పెట్టాడు. ‘సాహబ్జాదే’ అంటే యువరాజు అని అర్థం. కాని ఈ యవరాజు తల మీద పగిడీ కట్టి, అలంకారంగా కరవాలం ధరించి ఊళ్లేలాలని అనుకోలేదు. ముఖానికి రంగు రాసుకోవాలని అనుకున్నాడు. అంతా చేసి అతడు కోరుకుంది ఎవరైనా అడిగితే పెట్టడానికి ఒక్క ఆటోగ్రాఫ్.
‘మృగయా’ అతడి మీద మొదటగా ప్రభావం వేసిన సినిమా. ఆ తర్వాత నసీరుద్దీన్ షా కూడా. నటించాలి అని తీర్మానించుకున్నాడు. ఆ రోజుల్లో దూరదర్శన్ ఊపు మీద ఉంది. సినిమాలంటే బాంబేకు వెళ్లాలి కాబట్టి కనీసం టీవీలో కనిపిద్దామని జైపూర్‌లో కొండ మీద ఉన్న టీవీ టవర్‌కు చేరుకున్నాడు. అక్కడ షూటింగ్స్ జరుగుతుంటాయని ఎవరో ఒకరు వేషం ఇస్తారని అతడి ప్లాన్. తీరా చేరుకున్నాక అక్కడ మనిషి లేడు. పురుగు కూడా.
ట్రాన్స్మిషన్ టవర్ అతణ్ణి చూసి దయగా నవ్వింది. తర్వాత ఎవరో చెప్పారు ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఉంటుంది.. అక్కడ చేరు.. యాక్టింగ్ నేర్పిస్తారు అని. ఇంట్లో ఒప్పుకోలేదు. తల్లికి తన కొడుకు లెక్చరర్ కావాలని కోరిక. కొడుకు కూడా అదే చెప్పాడు. నేను వెళ్తున్నది యాక్టింగ్ చదువుకు. అది పూర్తయితే జైపూర్‌లో లెక్చరర్ ఉద్యోగం వస్తుంది అని. అబద్ధమే. కాని తల్లికి చెప్పకపోతే ఎవరికి చెప్తాం.
‘సలామ్ బాంబే’.... ఇర్ఫాన్ మొదటి సినిమా. దాదాపు 30 ఏళ్ల క్రితంది. ఏ ముహూర్తాన ఆ సినిమా చేశాడోకాని బాంబే అతడి చేత అన్ని సలాములూ చేయించింది. ఎక్కే గడప దిగే గడప... ఇస్తామన్న హామీ ఇవ్వకుండా పొడిచే పోటు... తిండి గడవడానికి టివి కొంత దారి చూపించింది. ‘చంద్రకాంత’ సీరియల్లో ఇర్ఫాన్ పాత్ర పెద్ద హిట్. ఆ తర్వాత వరుసపెట్టి అవే పాత్రలు. గంగవెల్లువకు చిన్న కమండలం. డిప్రెషన్. యాంగ్జయిటీ. కొన్నాళ్లు మందులు వాడాడు. కాని తప్పదు.
ఎలాగైనా ప్రాణాలు కాపాడుకొని నిలబడాల్సిందే. ఎడారి నుంచి వచ్చినవాణ్ణి. ఎండలో బతకడం తెలియదా? అప్పుడు రెండు వింతలు జరిగాయి. ఒకటి ఆసిఫ్ కపాడియా అనే బ్రిటిష్ ఇండియన్ డెరైక్టర్ వచ్చి ఇర్ఫాన్‌తో ‘వారియర్’ అనే సినిమా తీశాడు. రాజస్థాన్‌లో కత్తి యుద్ధాన్ని ఒక పరంపరగా చేసుకున్న వీరుడికథ అది. చాలా ఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందింది. ఆ వెంటనే ‘రోడ్ టు లడాఖ్’ అనే ఒక షార్ట్‌ఫిల్మ్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇంతమంచి నటుడు ఇండియాలో ఏం చేస్తున్నట్టు? అందరికీ ఆశ్చర్యం. ఆ వెంటనే ‘ది మైటీ హార్ట్’, ‘ది నేమ్‌సేక్’... హాలీవుడ్ సినిమాల ఆఫర్స్ తలుపు తట్టడం మొదలుపెట్టాయి.
బ్రిటిష్ ఫిల్మ్ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’... ఒక పెద్ద గుర్తింపు. ‘ది అమేజింగ్ స్పైడర్‌మేన్’, ‘లైఫ్ ఆఫ్ పై’తో ఇర్ఫాన్ ఒక ఇంటర్నేషనల్ స్టార్‌గా ఆవిర్భవించాడు. రచ్చ గెలవడం అయ్యింది. మరి ఇంట? ‘పాన్‌సింగ్ తోమార్’. సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు దేశంలోనూ విదేశంలోనూ ఇర్ఫాన్ ది బెస్ట్.
నటుడి పని ఏమిటంటే నటించడం. డబ్బు సంపాదించడం కాదు. నటన వల్ల డబ్బు వస్తే రావచ్చు. కాని డబ్బు సంపాదించడానికే నటన కాదు అనేది ఇర్ఫాన్ ఉద్దేశ్యం. అందుకే అతడు ఇటీవల ‘ఖాన్’ను తన పేరు నుంచి తొలగించాడు. షారూక్, ఆమిర్, సల్మాన్ ఈ ఖాన్‌లతో తనకు పోలిక ఏమిటి? వాళ్లు స్టార్లు. తాను? నటుడు. వాళ్ల స్టార్డమ్ వంద కోట్లు, రెండు వందల కోట్లు, ఆమిర్ ‘పికె’ 500 కోట్లు సంపాదించిందట. ఇదే కొలమానం అయితే ఇర్ఫాన్ నటించిన ‘లైఫ్ ఆఫ్ పై’ 5000 కోట్లు సంపాదించింది. ఇర్ఫాన్‌కు కోట్లతో పని లేదు. సీన్లతోనే పని. ఆ సీన్లో ఆ క్షణాన తానెంత మెరిశాడు. పాత్రను ఎంత మెరిపించాడు.
‘పికూ’ వచ్చింది. అమితాబ్, దీపికా, ఇర్ఫాన్ కలిసి ఇప్పటికి వంద కోట్లు వసూలు చేశారు. చిన్న సినిమా. పెద్ద విజయం. ఇర్ఫాన్ కోసం ఇప్పుడు భారతదేశంలోని ప్రతి మంచి దర్శకుడు ఒక పాత్రను రాసే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే సినిమాలో అతడుంటే గౌరవం. ప్రతికూల క్షణాల్లో ఒంటె తాను బతకడమే కాక తన వీపున ఉన్న మనిషిని కూడా తన ఒంట్లోని కొవ్వు ఇచ్చి బతికిస్తుంది. చెత్త సినిమాల ధోరణిలో ఇర్ఫాన్ తాను బతకడమే కాదు- భారతీయ సినిమాను కూడా బతికించనున్నాడు. నిజజీవితంలో అతడు ‘సాహబ్జాదా’ కాలేకపోవచ్చు. కాని- నవ్య సినిమాల్లో మాత్రం అతడే సాహబ్జాదా!
- సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి
చాలా ఫాస్ట్ యాక్టర్!
అటు అమ్రిష్‌పురి, ఇటు ఇర్ఫాన్‌ఖాన్ - ఇద్దరితో సినిమా చేసిన అనుభవం నాది. ఒక సీన్ చెబితే అమ్రిష్ చాలా టైమ్ తీసుకొని, బాగా ఆలోచించి, దాన్ని పండించేవారు. కాని ఇర్ఫాన్ ఫాస్ట్ యాక్టర్. ఏదైనా చెప్పగానే చాలా వేగంగా ఆ సీన్‌ను నటించి చూపేవారు. ‘సైనికుడు’లో ఇర్ఫాన్‌ఖాన్‌ను తొలిసారిగా దక్షిణాది వెండితెరపైకి తెచ్చే అదృష్టం నాకు దక్కింది. ఆ క్రెడిట్ గుణశేఖర్‌ది.
సినిమా అంటే ఇర్ఫాన్‌కు అమిత ప్రేమ. ఎక్కడో కొడెకైనాల్లో ‘సైనికుడు’ షూటింగ్ అయితే, ముంబయ్ నుంచి వేళకాని వేళలో దిగినా, పొద్దున్నే ఠంచన్‌గా టైమ్‌కు సెట్స్‌కు వచ్చేవారు. అఇవాళ ఇర్ఫాన్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. మా సినిమా ఆల్బమ్స్ ఎప్పుడైనా తిరగేస్తూ వాటిలో ఇర్ఫాన్ ఫోటోలు చూసినప్పుడు అంత గొప్ప ఆర్టిస్టును తెలుగు తెరకు పరిచయం చేసినందుకు చాలా గర్వపడుతుంటా.
- సి. అశ్వినీదత్, ప్రసిద్ధ నిర్మాత