కబాలి టీషర్ట్స్‌తో అభిమానులు ఖుషీ
కబాలి చిత్రంపై అంచనాలు నానాటికీ అంబరాన్ని తాకుతున్నాయనడం అతిశయోక్తి కాదేమో. కారణం అందరికీ తెలిసిం దే. ఒకే ఒక్క పేరు సూపర్‌స్టార్ రజనీ కాంత్. ఆయన యంగ్, సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ల్లో తన అభిమానుల్నే కాకుండా యావత్ ప్రపంచ సినీ అభిమానుల్ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రాన్ని కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మించారు.
ఆ మధ్య విడుదలైన చిత్ర టీజర్ ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా చూసి అదుర్స్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 12న బ్రహ్మాండంగా నిర్వహించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏనోట విన్నా కబాలి మాటే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. తాజాగా కబాలి టీషర్ట్సుతో మరింత కొత్తరకం ప్రచారాన్ని పొందుతోంది. ఇటీవల హాలీవుడ్ నటుడు జాకీచాన్ కబాలి చిత్రంలోని సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫోటోతో కూడిన టీషర్టు ధరించినట్లు స్టిల్ ఇంటర్నెట్లో హల్చల్ చేసింది.
కాగా తాజాగా కబాలి ఫొటోలతో కూడిన రకరకాల టీషర్టులు మార్కెట్లో విక్రయం జరుగుతూ అటు వ్యాపార పరంగానూ, ఇటు చిత్రానికి ప్రచారాన్ని పెంచుతున్నాయి. 350 నుంచి 600 రూపాయల వరకూ అమ్ముడుపోతున్న ఈ కబాలి టీషర్ట్సు చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ నగరాలలో హల్చల్ చేస్తున్నాయి. ఇక రజనీకాంత్ అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు యమ ఖుషీ అవుతున్నారు.