తమిళనాడులో ఏం జరుగుతోంది?
- రజనీకి అనుకూలంగా ఫ్యాన్స్ భారీ ర్యాలీ.. అరెస్టులు
- నిన్న సూపర్‌స్టార్‌కు వ్యతిరేకంగా తమిళ సంఘాల ఆందోళన
- హీరో ఇంటివద్ద రసవత్తర సన్నివేశాలు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చ
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం అంశం.. మరోసారి తమిళనాట ఉద్రిక్తతకు దారితీసింది. సూపర్ స్టార్‌పై తమిళ సంఘాల వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనని అభిమానులు మంగళవారం పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో చెన్నైలోని రజనీ నివాసంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.
మరాఠా మూలాలున్న రజనీ తమిళుడు కాడని, ఆయన రాజకీయాల్లోకి చేరితే సహించబోమని సోమవారం పలు తమిళ సంఘాలు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. తమిళ సంఘాల వ్యాఖ్యలను నిరసిస్తూ ఇప్పుడు కౌంటర్ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ ఆందోళనలపై రజనీకాంత్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
చాలా ఏళ్ల తర్వాత గతవారం అభిమాన సంఘాలతో రజనీకాంత్ భేటీ కావడం, ఆ సందర్భంలోనే ‘నేను పక్కా తమిళుణ్ని..’అని వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా, రాజకీయ ఎత్తుగడతోనే రజనీ తమిళ మంత్రం జపిస్తున్నారని తమిళ సంఘాలు విమర్శించాయి. ఇప్పుడు వంతు రజనీ అభిమానులది. ఇలా వరుస ఆందోళనలు, అరెస్టుల నేపథ్యంలో అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
(రజనీకి తమిళ సెగ.. ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత!)