farest dipartment
-
గజరాజులకు గూడు.!
ఎప్పుడు ఏ ప్రాంతానికొచ్చేస్తాయో... ఎవరి పంటలు నాశనం చేసేస్తాయో తెలియదు. ఒక రోజు... ఒక పక్షం... ఒక నెల కాదు... ఏడాదిగా అను నిత్యం అనుభవిస్తున్న నరక యాతన. కురుపాం నియోజకవర్గ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల బెడద నుంచి ఇక ఉపశమనం కలగనుంది. ఎట్టకేలకు వాటికి పునరావాసం కల్పించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే పార్వతీపురం మండలం డోకిశిలలో 526 హెక్టార్ల భూమిని పరిశీలించారు. అక్కడ వాటికోసం సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సంచరిస్తున్న పది ఏనుగులకు అక్కడ నివాసం కల్పించనున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా సరిహద్దుల్లో సంచరిస్తున్న ఆరు ఏనుగులతో పాటు, శ్రీకాకుళం అడవుల్లో నివాసం ఏర్పరచుకున్న నాలుగు ఏనుగులకు ఇకపై విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మండలం డోకశిల ప్రాంతంలో గూడు లభించనుంది. జిల్లాలో కొన్నేళ్లుగా ఏనుగులు సంచరిస్తూ పంటలు నాశనం చేయడమే కాకుండా మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటివరకూ ఏనుగులు ముగ్గురిని బలిగొన్నాయి. నాలుగు నెలల్లో ఇద్దరిని గాయపరిచాయి. వందలాది ఎకరాల్లో పంటలు నాశనం చేస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన జిల్లాలో ప్రవేశించిన ఏనుగులు అదే ఏడాది ఒకరిని, ఈ ఏడాది జనవరిలో మరొకరిని బలిగొన్నాయి. శ్రీకాకుళం జిల్లా, ఒడిశా ప్రాంతాల నుంచి ఏనుగులు విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం, సాలూరు గిరిజన ప్రాంతా ల్లోకి ప్రవేశిస్తున్నాయి. గిరిజనులు కొండ చరియల ప్రాంతంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి పంటలను సాగుచేస్తున్నారు. జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో అంకుళవలస, సుందరావువలస, కుమ్మరిగుంట, ఆర్తాం, సోమినాయుడు వలస, గుణానవలస, కుండతిరువాడ, నీచుకవలస, ఆర్నాడ గ్రామాల్లో పంటల్ని ఈ ఏనుగులు తీవ్రంగా నష్టపరిచాయి. 1368 ఎకరాల్లో వరి, చెరకు, అరటి, టమాట పంటలు వీటి దాడిలో దెబ్బతిన్నాయి. 1138 మంది రైతులు ఏనుగుల సంచారం వల్ల రూ.89.50 లక్షల విలువైన పంటలు నష్టపోయారు. తొమ్మిదేళ్ల క్రితం కూడా బీభత్సం.. పార్వతీపురం మండలంలోని ఎర్రసామంతవలస, పిట్టలవలస, ప్రాంతాల్లో 2016లో ఏనుగులు సంచరించాయి. 2007 సంవత్సరంలో కూడా ఏనుగులు జిల్లాలో ప్రవేశించి ఆస్తి, ప్రాణనష్టం కలిగించాయి. అప్పట్లో జియ్యమ్మవలస మండలానికి చెందిన ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాయి. అప్పట్లో ఒక ఏనుగును చంపేశారు. ఏడాదిగా అనేక మందిని గాయపరిచాయి. ప్రస్తుతం గరుగుబిల్లి మండలంలో తిష్టవేశాయి. ఒడిశా సరిహద్దువైపు వెళుతున్నాయి. ఏనుగుల సంచారంతో విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా, ఒడిశా రాష్ట్ర ప్రజలు కూడా భయాందోళనలో బతుకుతున్నారు. గతంలో ఏనుగులు విరుచుకుపడినప్పుడు ఆపరేషన్ జయంతి, అపరేషన్ గజ పేరున రెండు ఏనుగులను రప్పించారు. నాలుగు ఏనుగులను లారీలపై ఎక్కించి ఒడిశా రాష్ట్రంలోని లఖేరీ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు యత్నించిన క్రమంలో ఓ ఏనుగు మరణించడంతో జంతుసంరక్షణ కమిటీ అభ్యంతరం తెలిపింది. దాంతో ఆ ఆపరేషన్ ఆగిపోయింది. తరువాత ఈ ప్రాంతానికి వచ్చిన గుంపులో ఓ గున్న ఏనుగు గతేడాది విద్యుదాఘాతంతో మృత్యువాతపడగా... ఈ ఏడాది జనవరిలో గుంపు నుంచి తప్పిపోయిన ఒక ఏనుగు నాగావళి నదిలో శవమై తేలింది. ఎలిఫెంట్ జోన్‌కు గిరిజనుల వ్యతిరేకం.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలిఫెంట్ జోన్లు ఏర్పాటుచేసి ఏనుగులకు అవసరమైన ఆహారం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలనే ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే అడవినే నమ్ముకుని బతుకుతున్న గిరి జనులు ఈ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గిరిజనుల భయాం దోళనలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేసే అంశాన్ని పక్కనపెట్టి ఏనుగుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించా రు. సాలూరు అటవీ రేంజ్ పరిధిలోని డోకశిల ప్రాంతాన్ని దీనికోసం ఎంపిక చేశారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణ అధికారి నళినీమోహన్ సోమవారం విజయనగరం జిల్లాకు వస్తున్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విజయనగరంలో జిల్లా అటవీ శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన డోకశిల ప్రాంతానికి వెళతారు. పునరావాసంతో తీరనున్న బెడద.. ఎన్ని ప్రయత్నాలు చేసినా జిల్లాలో ఏడాదిగా ఏనుగుల బెడద తొలగడం లేదు. రోజూ 40 మంది ఎలిఫెంట్ ట్రాకర్లు శ్రమిస్తుండటం వల్ల ప్రాణ నష్టం లేకుండా చేయగలుగుతున్నాం. ఈ నేపథ్యంలో డోకశిల ప్రాంతంలో ఏనుగుల పునరావాస కేంద్రాన్ని 1315 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రాంతం చుట్టూ ఏనుగుల సంచారానికి, నివాసానికి అనుకూల పరిస్థితులు కల్పిస్తాం. అలాగే అవి బయటకు రాకుండా తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తాం. ఇద్దరు వెటర్నరీ డాక్టర్లను నియమిస్తాం. గడ్డి విత్తనాలు జల్లి గడ్డి మొలిపిం చడంతో పాటు నీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతాం. దీనివల్ల స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగదు. – గంపా లక్ష్మణ్, డీఎఫ్ఓ (టెరిటోరియల్), విజయనగరం. -
అరణ్యరోదన
రామాయంపేట(మెదక్) : వేసవిలో తాగునీరు దొరక్క అడవిలోని జంతువులు అలమటిస్తున్నాయి. వాటికి నీటి వసతి కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నీటికోసం నిర్మించిన సాసర్పిట్లు నీరు లేక చెత్తాచెదారంతో నిండి దర్శనమిస్తున్నాయి. దీంతో జంతువులు దాహంతో గ్రామాల శివారులోని పంటచేల వద్దకు వస్తూ ప్రమాదాల బారీన పడుతున్నాయి. దంతేపల్లి, రాజ్‌పల్లి, పోచారం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో మూడు సోలార్ మోటార్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలోని జంతువులకు కొంత ఊరట లభిస్తుంది. కానీ మిగితా ప్రాంతంలో తాగు నీరు లేక వేసవితాపానికి మూగజీవాలు అనేకం మృత్యువాత పడుతున్నాయి. జిల్లా పరిధిలో 58 వేల హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. జంతువులకు తాగునీటి సదుపాయం కల్పించడానికి అటవీ ప్రాంతంతో మొత్తం 70 సాసర్పిట్లను ఏర్పాటు చేశారు. రామాయంపేట మండలం కాట్రియాల తండాను ఆనుకునే ఉన్న అటవీప్రాంతంలో సాసర్‌పిట్లతో పాటు ఎటువంటి సదుపాయాలు లేవు. దీంతో తాగునీరు లేక వందల సంఖ్యలో జంతువులు మృత్యువాతపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఈ సమస్య పరిష్కారం దిశగా అధికారులు ఆలోచించడం లేదు. మండల పరిధిలోని దంతేపల్లి, పర్వతాపూర్ అటవీప్రాంతంలో గతంలో నీరు నింపేవారు. కానీ ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటుతున్నా నీటి సదుపాయాలు మాత్రం మెరుగుపరచడం లేదు. దంతేపల్లి, రాజ్‌పల్లి, పోచారం పరిధిలోని అటవీప్రాంతాల్లో మూడు సోలార్ మోటార్లతో కొంతమేర ప్రయోజనం కలుగుతుంది. ఈ బోర్లు నిరంతరాయంగా నడుస్తుండటంతో సమీపంలోని కుంటలు నీటితో నిండి ఉంటున్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే సోలార్ పంపులు బిగించాలని ప్రజలు అటవీప్రాంత ప్రజలు కోరుతున్నారు. వేసవి ప్రారంభంలో ఈ సాసర్‌పిట్లతో నీరు నింపిన అధికారులు ఇప్పటివరకు ఆవైపుకు కన్నెత్తికూడా చూడటం లేదు. త్వరలో నీరు నింపిస్తాం ఈవేసవి ప్రారంభంలో అన్ని సాసర్పీట్లలో నీరు నింపిం చాం. తర్వాత కురిసిన వర్షాలకు అడవిలోని కుంటల్లో కొంతమేర నీరు నిలి చింది. అందుకే సాసర్పీట్లలో నీరు నింపలేదు. సమీపంలో తండాలనుంచి మేతకోసం వస్తున్న పశువులు సాసర్పిట్లలో నీరు తాగడంతో అవి ఖాళీ అవుతున్నాయి. త్వరలో మళ్లీ సాసర్పీట్లను నీటితో నింపుతాం. – పద్మజారాణి, జిల్లా అటవీ అధికారిణి -
మతలబేమిటో...!
భద్రాచలం: అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్న వాహనాన్ని ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే తిరిగి అప్పగించటం ఆ శాఖలో సర్వత్రా చర్చకు దారితీసింది. రెండు రోజులుగా డివిజన్ కార్యాలయంలో కలప లోడుతో ఉన్న బొలోరో వాహనం శుక్రవారం హడావుడిగా వాహనదారులకు అప్పగించటం వెనుక ఏం జరిగిందనే దానిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అటవీశాఖ వర్గాలు బాహ్యాటంగానే చర్చించుకుంటున్నారు. అటవీ సంపదకు పరిరక్షకులుగా ఉండాల్సిన సిబ్బంది ఇలా దొడ్డిదారి వ్యవహారాలకు పాల్పడుతండటంతో సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఏపీలోని విలీన మండలాల నుంచి వస్తున్న బొలోరో వాహనాన్ని స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది రెండు రోజులు క్రితం పట్టుకొని, భద్రాచలం డివిజన్ కార్యాలయానికి తరలించారు. బొలోరో వాహనంపై 18 టేకు దిమ్మెలు ఉండగా, భద్రాచలానికి తీసుకొస్తున్న సమయంలో వారి వద్ద సరైన ధ్రువీకరణ పత్రాలు లేక పోవడంతో స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది దానిని డివిజన్ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం వీటిని పరిశీలించిన అటవీశాఖ అధికారులు, పత్రాలన్నీ సవ్యంగానే ఉన్నాయని, అందులో నాలుగు టేకు మొద్దులు ఎక్కువగా ఉన్నందున వాటిని స్వాధీనం చేసుకొని, మిగతా టేకు కలపతో పాటు వాహనాన్ని కూడా విడిచిపెట్టారు. కలపతో వాహనాన్ని పట్టుకొని రెండు రోజులు కావొస్తుండగా, దీనిపై ఎందుకింత తాత్సారం చేశారనేది కూడా ఉన్నతాధికారుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. వాహనంపై అదనంగా తీసుకొస్తున్న నాలుగు టేకు మొద్దులను స్వాధీనం చేసుకొని, దానికి సుమారుగా రూ.35 వేలు జరిమానా విధించినట్లుగా భద్రాచలం అటవీశాఖ అధికారిణి సత్యవతి అన్నారు. అదేవిధంగా ఏపీలో విలీనమైన మండలాల నుంచి మరో ఆటోలో తీసుకొస్తున్న టేకు దిమ్మెలను స్వాధీనం చేసుకొని, వాటికి కూడా రూ.40 వేలు జరిమానా విధించినట్లుగా ఆమె తెలిపారు. ఉన్నతాధికారుల అనుమతులు అక్కర్లేదా.. అటవీశాఖ అధికారులు తగిన ధ్రువీకరణ పత్రాలు లేకుండా టేకు కలపతో తీసుకొచ్చే వాహనాలను అదుపులోకి తీసుకునే సమయంలో అటవీ చట్టాల మేరకు కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. చిన్నపాటి టేకు దిమ్మెలు దొరికితేనే వాహనాన్ని స్వాధీనం చేసుకొని, పట్టుకున్న కలపకు మూడు రెట్లు జరిమానా విధించే ఆ శాఖ అధికారులు తాజాగా పట్టుకున్న వాహనం విషయంలో ఉదారంగా వ్యహరించటంపై సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. ఆంధ్రా నుంచి టేకు కలప వాహనం ఎక్కడి నుంచి వస్తుందో.. కలప తీసుకొస్తున్న వాహనం ఎక్కడ నుంచి వస్తుందో.. వాటిని ఎక్కడి డిపోలో కొనుగోలు చేశారు..? ఎప్పుడు కొనుగోలు చేశారు.? ఇలా తగిన ఆధారాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇటువంటి సమయాల్లో వాహనాన్ని విడిచి పెట్టాలంటే ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. శుక్రవారం భద్రాచలం అటవీశాఖ అధికారులు నమోదు చేసిన కేసు విషయంలో ఏ మేరకు నిబంధనలు పాటించారనే దానిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ ఉద్యోగులే బాహ్యాటంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. సిబ్బంది ఇష్టారాజ్యం.. భద్రాచలం అటవీశాఖలోని కొంతమంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి వాహనాన్ని విడిచి పెట్టిన సంఘటన నిలువెత్తు నిదర్శనం. ఒకటీ, ఆరా టేకు దిమ్మెలు దొరికిగే భారీ జరిమానాలు విధించే ఆ శాఖ అధికారులు, తాజాగా జరిగిన కలప విషయంలో ఎందుకిలా వ్యవహరించారనేది తేలాల్సి ఉంది. కొంతమంది సిబ్బంది అధికారులను తప్పుదారి పట్టించటం వల్లనే ఇలా జరిగిందని అటవీశాఖ వర్గాల్లో చర్చసాగుతుంది. ఇటువంటి వారిపై ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. సిబ్బందిపై ఎఫ్డీఓ ఆగ్రహం.. టేకు కలపతో దొరికిన వాహనాన్ని విడిచిపెట్టిన వ్యవహారంపై ఆ శాఖలో రచ్చ జరిగిన విషయం అటవీశాఖ డివిజన్ అధికారి బాబు దృష్టికి వెళ్లటంతో ఆయన దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై ఏం జరిగిందనే దానిపై ఆయన భద్రాచం రేంజ్ అధికారిణి సత్యవతి నుంచి వివరాలను తెలుసుకున్నారు. సిబ్బంది మధ్య సరైన సమన్వయం లేదని తెలుసుకున్న ఆయన, వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఇదే విషయమై ఆయనను ‘సాక్షి ’వివరణ కోరగా కలప పట్టుకొని, వదిలిపెట్టిన వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో వివరాలను తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇద్దరు బీట్ గార్డ్స్ దారుణ హత్య
బొల్లపల్లి: అటవీ శాఖ విధులు నిర్వర్తిస్తున్న బీట్ గార్డ్స్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం అనుమల చెరువు పంచాయతి పరిధిలోని పునుగులకుంట అటవీ ప్రాంతంలో శనివారం వెలుగు చూసింది. మృతి చెందిన వారిని లాజర్, షేక్ బాజిగా గుర్తించారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చే రుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.