భద్రాచలం: అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్న వాహనాన్ని ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే తిరిగి అప్పగించటం ఆ శాఖలో సర్వత్రా చర్చకు దారితీసింది. రెండు రోజులుగా డివిజన్ కార్యాలయంలో కలప లోడుతో ఉన్న బొలోరో వాహనం శుక్రవారం హడావుడిగా వాహనదారులకు అప్పగించటం వెనుక ఏం జరిగిందనే దానిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అటవీశాఖ వర్గాలు బాహ్యాటంగానే చర్చించుకుంటున్నారు. అటవీ సంపదకు పరిరక్షకులుగా ఉండాల్సిన సిబ్బంది ఇలా దొడ్డిదారి వ్యవహారాలకు పాల్పడుతండటంతో సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఏపీలోని విలీన మండలాల నుంచి వస్తున్న బొలోరో వాహనాన్ని స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది రెండు రోజులు క్రితం పట్టుకొని, భద్రాచలం డివిజన్ కార్యాలయానికి తరలించారు. బొలోరో వాహనంపై 18 టేకు దిమ్మెలు ఉండగా, భద్రాచలానికి తీసుకొస్తున్న సమయంలో వారి వద్ద సరైన ధ్రువీకరణ పత్రాలు లేక పోవడంతో స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది దానిని డివిజన్ కార్యాలయానికి తరలించారు.
శుక్రవారం వీటిని పరిశీలించిన అటవీశాఖ అధికారులు, పత్రాలన్నీ సవ్యంగానే ఉన్నాయని, అందులో నాలుగు టేకు మొద్దులు ఎక్కువగా ఉన్నందున వాటిని స్వాధీనం చేసుకొని, మిగతా టేకు కలపతో పాటు వాహనాన్ని కూడా విడిచిపెట్టారు. కలపతో వాహనాన్ని పట్టుకొని రెండు రోజులు కావొస్తుండగా, దీనిపై ఎందుకింత తాత్సారం చేశారనేది కూడా ఉన్నతాధికారుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. వాహనంపై అదనంగా తీసుకొస్తున్న నాలుగు టేకు మొద్దులను స్వాధీనం చేసుకొని, దానికి సుమారుగా రూ.35 వేలు జరిమానా విధించినట్లుగా భద్రాచలం అటవీశాఖ అధికారిణి సత్యవతి అన్నారు. అదేవిధంగా ఏపీలో విలీనమైన మండలాల నుంచి మరో ఆటోలో తీసుకొస్తున్న టేకు దిమ్మెలను స్వాధీనం చేసుకొని, వాటికి కూడా రూ.40 వేలు జరిమానా విధించినట్లుగా ఆమె తెలిపారు.
ఉన్నతాధికారుల అనుమతులు అక్కర్లేదా..
అటవీశాఖ అధికారులు తగిన ధ్రువీకరణ పత్రాలు లేకుండా టేకు కలపతో తీసుకొచ్చే వాహనాలను అదుపులోకి తీసుకునే సమయంలో అటవీ చట్టాల మేరకు కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. చిన్నపాటి టేకు దిమ్మెలు దొరికితేనే వాహనాన్ని స్వాధీనం చేసుకొని, పట్టుకున్న కలపకు మూడు రెట్లు జరిమానా విధించే ఆ శాఖ అధికారులు తాజాగా పట్టుకున్న వాహనం విషయంలో ఉదారంగా వ్యహరించటంపై సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. ఆంధ్రా నుంచి టేకు కలప వాహనం ఎక్కడి నుంచి వస్తుందో..
కలప తీసుకొస్తున్న వాహనం ఎక్కడ నుంచి వస్తుందో..
వాటిని ఎక్కడి డిపోలో కొనుగోలు చేశారు..? ఎప్పుడు కొనుగోలు చేశారు.? ఇలా తగిన ఆధారాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇటువంటి సమయాల్లో వాహనాన్ని విడిచి పెట్టాలంటే ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. శుక్రవారం భద్రాచలం అటవీశాఖ అధికారులు నమోదు చేసిన కేసు విషయంలో ఏ మేరకు నిబంధనలు పాటించారనే దానిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ ఉద్యోగులే బాహ్యాటంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
సిబ్బంది ఇష్టారాజ్యం..
భద్రాచలం అటవీశాఖలోని కొంతమంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి వాహనాన్ని విడిచి పెట్టిన సంఘటన నిలువెత్తు నిదర్శనం. ఒకటీ, ఆరా టేకు దిమ్మెలు దొరికిగే భారీ జరిమానాలు విధించే ఆ శాఖ అధికారులు, తాజాగా జరిగిన కలప విషయంలో ఎందుకిలా వ్యవహరించారనేది తేలాల్సి ఉంది. కొంతమంది సిబ్బంది అధికారులను తప్పుదారి పట్టించటం వల్లనే ఇలా జరిగిందని అటవీశాఖ వర్గాల్లో చర్చసాగుతుంది. ఇటువంటి వారిపై ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.
సిబ్బందిపై ఎఫ్‌డీఓ ఆగ్రహం..
టేకు కలపతో దొరికిన వాహనాన్ని విడిచిపెట్టిన వ్యవహారంపై ఆ శాఖలో రచ్చ జరిగిన విషయం అటవీశాఖ డివిజన్ అధికారి బాబు దృష్టికి వెళ్లటంతో ఆయన దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై ఏం జరిగిందనే దానిపై ఆయన భద్రాచం రేంజ్ అధికారిణి సత్యవతి నుంచి వివరాలను తెలుసుకున్నారు. సిబ్బంది మధ్య సరైన సమన్వయం లేదని తెలుసుకున్న ఆయన, వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఇదే విషయమై ఆయనను ‘సాక్షి ’వివరణ కోరగా కలప పట్టుకొని, వదిలిపెట్టిన వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో వివరాలను తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
మతలబేమిటో...!
Published Sat, Jan 20 2018 6:45 PM | Last Updated on Sat, Jan 20 2018 6:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment