మోడర్న్ మదర్‌స్టార్స్
తెల్ల చీర.. ఓ కంట్లో కుండల కొద్దీ కన్నీళ్లు.. మొహంలో దయనీయత... కంపిస్తున్న జీవితం..టాలీవుడ్, బాలీవుడ్ అమ్మకు ప్రతిరూపం పదేళ్ల కిందటిదాకా! ఎప్పుడూ ఎవరో ఒకరు ఆదుకోవాలని చూసే సెల్ఫ్ పిటీతో కుంగిపోతూ ఉంటుంది ఆ అమ్మ. ఇప్పుడు పరిస్థితులు మారాయి కనీసం బాలీవుడ్లో. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యంతో ఆధునిక అమ్మ తెర మీద ధైర్యంగా అడుగులేస్తోంది. అంతకుముందు అమ్మంటే సినిమా కథ ఫార్ములాలో ఓ పాత్ర మాత్రమే. కానీ ఇప్పుడు అలా కాదు.. కథను నడిపించే ప్రధాన నాయిక. ఉదాహరణ.. నిల్ బత్తే సన్నాట! నిజానికి ఈ మార్పు ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా నుంచి మొదలైందని చెప్పొచ్చు. అందులో కథానాయిక కాజోల్‌కి తల్లిగా నటించిన ఫరిదా జలాల్ కొంచెం రివల్యూషనరీ మదర్‌గా కనిపించారు. ఆ తర్వాత నుంచి వచ్చిన చాలా సినిమాల్లో అమ్మ రూపురేఖలు.. వ్యక్తిత్వమూ మారిపోయాయి కొత్తగా... తల్లుల్లో ఉత్సాహాన్ని పెంచేలా!
ఆ సినిమాలు కొన్ని..
పైన నిల్ బత్తే సన్నాట ఊసెత్తాం కాబట్టి దాన్నే మొదట ఉదహరించుకుందాం. అందులో తల్లే ప్రధాన పాత్ర. స్వర భాస్కర్ పోషించింది. ఆమె ఓ పనిమనిషి. కూతురిని పెద్ద చదువులు చదివించాలని కలలు కంటూంటుంది. కానీ పనిమనిషి కూతురు ఇంకో పనిమనిషి కాక ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందా అనే నిస్పృహతో బతుకుతుంది. అంతే నిస్సత్తువగా బడికి వెళ్తూంటుంది. బిడ్డ ఆలోచనలు మార్చడానికి ఆ తల్లీ స్కూల్లో చేరుతుంది. కూతురితో కలిసి పదవ తరగతి పరీక్ష రాసి ఆమెలో పోటీని రగిలిస్తుంది. జీవితం పట్ల ఆశను రేపుతుంది. ఉత్తేజాన్ని నింపుతుంది. అచ్చంగా ఓ అమ్మను హీరోయిన్గా చూపించిన ఈ సినిమా.. తీరు మారిన బాలీవుడ్ తలపుకు మచ్చు తునక.
జానే తూ.. యా జానే నా..
ఫ్రెండ్లీ మదర్ కాన్సెప్ట్‌ను ప్రమోట్ చేసిన సినిమా జానే తూ.. యా జానే నా! ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్ సెల్యూలాయిడ్ ఫస్ట్ ఎంట్రీ ఈ మూవీ. అందులో అతనికి అమ్మగా రత్నా పాటక్ షా నటించింది. సర్కాస్టిక్ మదర్. విడో. భర్త పట్ల మిస్సింగ్ ఫీలింగ్‌నూ ఆ వ్యంగ్యంతోనే భర్తీ చేసుకుంటుంది. కొడుకుకు ఆప్తమిత్రురాలిలా మసలుకుంటుంది. బోలెడు ధైర్యాన్నిస్తుంది. అలా ‘జానే తూ యా జానే నా’ లో అమ్మను డేరింగ్ అండ్ డైనమిక్‌గా చిత్రీకరించారు. ఈ మధ్య వచ్చిన మంచి సినిమా కపూర్ అండ్ సన్స్‌లో కూడా రత్నా పాటక్ షా ఇన్స్పైరింగ్ మదర్‌లా నటించారు. భర్త వివాహేతర సంబంధం... కొడుకు గే అని తేలడం.. ఇలాంటి షాకింగ్ సందర్భాల్లో గట్టిగా అరుస్తూ కూలిపోకుండా.. సంయమనంగా డీల్ చేయగల స్త్రీగా అద్భుతంగా చిత్రీకరించిన పాత్ర అది. రత్నా పాటక్ షా ఒదిగిపోయి మహిళకు మరో నిర్వచనంగా నిలిచారు.
ఇంగ్లిష్ వింగ్లిష్..
‘‘నాకు కావాల్సింది ప్రేమ కాదు.. గౌరవం’’ అంటుంది ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలోని అమ్మ ‘శశి’. నిజమే.. వంటింటికే పరిమితమైన ఇల్లాలిని.. వంట తప్ప ఏమీ రాదని హేళన చేస్తే భర్త, ఇంగ్లిష్ రాకపోతే ఆ అమ్మకు ఏమీ తెలియదని.. ఒట్ట జడ్డని.. టీచర్, పేరెంట్ మీటింగ్‌కు ఆమెను అవాయిడ్ చేయాలని చూసే కూతురుంటే .. ఏ తల్లైనా ఆశ పడేది కాసింత గౌరవం పొందాలనే కదా! ఇంగ్లిష్ నేర్చుకొని అనర్గళంగా ఆ భాషలో స్పీచ్ కూడా ఇచ్చి ఆ గౌరవాన్ని దక్కించుకుంటుంది శశి. అమ్మ ఆత్మగౌరవం అనే ఓ సున్నితమైన అంశాన్నే ప్రధానం చేసుకొని మధ్య వయసు మహిళనే ముఖ్య భూమికగా పెట్టుకొని తీసిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ఎంత సూపర్ హిట్టో తెలియంది కాదు! అంటే అమ్మకు ప్రేమతో పాటు గౌరవాన్నీ ఇవ్వాలని మనమందరం కోరుకుంటున్నట్టేగా. మరెందుకు జాలి పాత్రలు? ఈ సినిమా శ్రీదేవికి రీ ఎంట్రీ. శశిగా ఆమె సింప్లీ సూపర్బ్.
పా..
ప్రిజేరియా ఉన్న కుర్రాడి సింగిల్ పేరెంట్ స్ట్రగులే ‘పా’. ఆ సింగిల్ పేరెంటే విద్యా బాలన్. అసాధారణ జబ్బున్న పిల్లాడికి తల్లిగా ఏ మాత్రం నిరాశకు లోనవకుండా.. ఆ కొడుకుని సాధారణ పిల్లల్లాగే పెంచగలిగే ఆత్మబలం ఉన్న అమ్మ ఆమె. అసలా కథను ఎంచుకున్నందుకు బాల్కీకి, నటించి మెప్పించిన విద్యాబాలన్‌కు హ్యాట్సాఫ్.
లిజన్ అమాయా..
భర్త మరణం భార్య కలలు, కలర్‌ఫుల్ లైఫ్‌కి ఫుల్స్టాప్ కానక్కర్లేదు. ఆయన జ్ఞాపకాలతో బతికే మొండితనమన్నా ఉండాలి.. లేదా కొత్త భాగస్వామిని ఎంచుకొని జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టే ధైర్యమన్నా కావాలి. రెండో కోవకు చెందినదే అమాయా తల్లి. తండ్రిని తప్ప ఇంకో వ్యక్తిని ఆ స్థానంలో ఊహిచంలేని కూతురికి ఇంకో భాగస్వామిని ఎంచుకున్నానని ఎలా చెప్పాలి? అని మథన పడుతుందే తప్ప బలహీనపడదు. తనకూ కొత్తగా జీవించే హక్కుందని బిడ్డకు చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఇలాంటి సంఘర్షణను కన్నీళ్లు.. దిగులు భావాలతో కాకుండా స్థిరమైన ఆలోచనలు, అభిప్రాయాలతో అధిగమిస్తుంది.
ఆ పాత్రలో దీప్తి నావల్ జీవించింది. ఇవి ట్రైలర్స్ మాత్రమే. గే కొడుకును యాక్సెప్ట్ చేసే అమ్మగా ‘దోస్తానా’లో కిరణ్ ఖేర్, ప్రత్యర్థి మూఠాను వణికించే తల్లిగా ‘రామ్‌లీలా’ లో సుప్రియా పాఠక్, సెరిబ్రల్ పాల్సీ ఉన్న కూతురిని సంబాళించే తల్లిగా ‘మార్గరిటా విత్ స్ట్రా’లో రేవతి, ‘మిత్ర్’లో శోభనా, పంజాబీ బ్యూటీషియన్ అండ్ చిల్ మదర్‌గా ‘విక్కీ డోనర్’లో డాలీ అహ్లువాలియా వీళ్లంతా ఆధునిక అమ్మ బలం చూపించారు.ఆమె గౌరవం పెంచారు. అనవసరమైన త్యాగాలు, ఔన్నత్యాలకు జీవితాన్ని అంకితం చేసుకునే బేలతనం లేదు వాళ్లకు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ.. పిల్లల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే అమ్మతనం వాళ్లది. సెల్యులాయిడ్ను మోడర్న్ యాంగిల్లో సెట్ చేస్తున్న మదర్ స్టార్స్‌కి వందనాలు!
నిల్ బత్తే సన్నాటలో..
‘పా’లో విద్యా, అభిషేక్