రేణిగుంటలో ఆమరణదీక్ష భగ్నం
చిత్తూరు: రేణిగుంటలో సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు చేపట్టిన ఆమరణదీక్షను భగ్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించిన రోజు నుంచి చిత్తూరు జిల్లాలో ఉధ్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఈ రోజు 11వ రోజు కూడా జిల్లాలో బస్సులను తిరగనివ్వడంలేదు.
తిరుపతిలో సమైక్యవాదులు బంద్‌లు, రాస్తారోకో, వాహనాలు తగులబెట్టడం, దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం లాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓరియంటల్ కాలేజీ ఎదుట సకల జనుల సామూహిక దీక్షలు చేపట్టారు. ప్రజావేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో వక్తలు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి వెనుక అందరి కృషి ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ను విడగొడితే భవిష్యత్ తరాలవారికి ఏం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం ఆలోచించాలని ఓ మహిళ విజ్ఞప్తి చేశారు.