Father-son
-
కంచె.. ప్రాణాలు తీసింది
చిన్నగూడూరు: కోతులు, అడవి పందుల నుంచి పంటకు రక్షణగా పెట్టిన విద్యుత్ వైర్ల కంచె తండ్రీకొడుకుల ప్రాణం తీసింది. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం దుమ్లాతండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ఆంగోత్ సీవీనాయక్(60), అమ్మీ దంపతుల కుమారుడు కిరణ్(30) మొక్క జొన్న పంట వేశారు. పంట కంకి పోయడంతో కోతులు, అడవి పందులు వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో చేను చుట్టూ విద్యుత్ వైర్ అమర్చారు. సాయంత్రం విద్యుత్ ఆన్‌చేసి, ఉదయాన్నే తీసివేసేవారు. కానీ మంగళవారం ఆఫ్ చేయడం మర్చిపోయారు. పంటకు నీరు కడుతుండగా కిరణ్ కాలుజారి విద్యుత్ సరఫరా అవుతున్న వైర్లకు తగిలి షాక్‌కు గురయ్యాడు. పక్కనే ఉన్న తండ్రి నాయక్ కుమారుడిని కాపాడేందుకు పట్టుకున్నాడు. గమనించిన తల్లి అమ్మీ కేకలకు పక్కనే ఉన్న రైతులు వచ్చి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కానీ అప్పటికే ఇద్దరూ మరణించారు. కళ్లముందే భర్త, కొడుకు షాక్‌తో విలవిల్లాడుతూ మరణించడంతో గుండలవిసేలా రోదించింది. చిన్నగూడూరు ఎస్సై రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డలతో సెల్ టవర్ ఎక్కిన తండ్రి
సాక్షి, చింతామణి: తన తండ్రి వద్ద భూమిని అక్రమంగా రాయించుకున్నారని గంగరాజు అనే వ్యక్తి తన ముగ్గురు బిడ్డలతో కలిసి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఘటన చింతామణి పట్టణంలోని కన్నంపల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. తాలూకాలోని మూగలమర్రి గ్రామానికి చెందిన దొడ్డ నరిసింహప్ప అనే వ్యక్తి సర్వే నంబర్ 72లో 8 ఎకరాల 30 గుంటల భూమిలో తనకు వచ్చిన రెండు ఎకరాల 30 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన వెంకట రెడ్డి, పల్లప్ప, నారాయణప్ప అనే వారికి రిజిస్టర్ చేయించారు. దీనికి సంబంధించి దొడ్డ నరసింహప్ప కుమారుడు గంగరాజు తన బిడ్డలు నిఖిల్, నితిన్, అంకిత, తన సంతకం లేకుండా భూమిని కొనుగోలు చేశారని, తనకు అన్యాయం జరిగిందని పోలీసు, రెవెన్యూ అధికారులకు విన్నవించాడు. ప్రయోజనం లేకపోవడంతో శనివారం ఉదయం గ్రామంలోని సెల్ టవర్‌ను తన ముగ్గురు బిడ్డలతో కలిసి ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు గంగరాజును, పిల్లలను సురక్షితంగా కిందకు దించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. (చదవండి: ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ చేయడమంటే ఇష్టం.. అలా ఢిల్లీ వ్యక్తితో వివాహిత పరార్) -
వాహనం ఢీకొనడంతో తండ్రి, కొడుకు మృతి
కరీంనగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తండ్రి, కొడుకులు మృతి చెందారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండలంలోని వెదిరి గ్రామానికి చెందిన లింగయ్య(40), తన కొడుకు శశాంక్(7) తో కలసి ఆస్పత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లింగయ్య రామడుగులోని కోళ్ల ఫారంలో కూలీగా పనిచేస్తాడు. అయితే శశాంక్‌కు అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం రాత్రి వీరు ఆస్పత్రికి వెళ్లేందుకు వెదిరి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై బస్సు కోసం ఎదురు చూశారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వీరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.