కిరణ్(ఫైల్), నాయక్(ఫైల్)
చిన్నగూడూరు: కోతులు, అడవి పందుల నుంచి పంటకు రక్షణగా పెట్టిన విద్యుత్ వైర్ల కంచె తండ్రీకొడుకుల ప్రాణం తీసింది. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం దుమ్లాతండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ఆంగోత్ సీవీనాయక్(60), అమ్మీ దంపతుల కుమారుడు కిరణ్(30) మొక్క జొన్న పంట వేశారు. పంట కంకి పోయడంతో కోతులు, అడవి పందులు వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి.
దీంతో చేను చుట్టూ విద్యుత్ వైర్ అమర్చారు. సాయంత్రం విద్యుత్ ఆన్‌చేసి, ఉదయాన్నే తీసివేసేవారు. కానీ మంగళవారం ఆఫ్ చేయడం మర్చిపోయారు. పంటకు నీరు కడుతుండగా కిరణ్ కాలుజారి విద్యుత్ సరఫరా అవుతున్న వైర్లకు తగిలి షాక్‌కు గురయ్యాడు. పక్కనే ఉన్న తండ్రి నాయక్ కుమారుడిని కాపాడేందుకు పట్టుకున్నాడు.
గమనించిన తల్లి అమ్మీ కేకలకు పక్కనే ఉన్న రైతులు వచ్చి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కానీ అప్పటికే ఇద్దరూ మరణించారు. కళ్లముందే భర్త, కొడుకు షాక్‌తో విలవిల్లాడుతూ మరణించడంతో గుండలవిసేలా రోదించింది. చిన్నగూడూరు ఎస్సై రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment