Fatherland-our town
-
బదిలీల ఫీవర్
జన్మభూమి ముగియగానే ఉత్తర్వులు వస్తాయని ఊహాగానాలు 13 నుంచి ఓటర్ల జాబితా సవరణ బీఎల్వోలను మినహాయించాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు తహశీల్దార్లకూ లేనట్టే! పరిమితంగానే బదిలీలు చేయాలని ప్రభుత్వం ఆదేశం మచిలీపట్నం : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. మంగళవారంతో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ముగియనుండటంతో ఇక బదిలీలు జరుగుతాయని ఉద్యోగులు భావిస్తున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో జరిగితే ఆ ప్రభావం పాఠశాలలు, తమ కుటుంబాలపై పడుతుందని భావించిన ఉపాధ్యాయులు ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రితో చర్చలు జరిపి ఇప్పట్లో బదిలీలు లేవని ప్రకటన చేయించుకున్నారు. ఈ వ్యవహారం నుంచి ఉపాధ్యాయులు బయటపడగా ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు బదిలీలు అనివార్యమనే వాదన ఇటీవల కాలం వరకు వినపడింది. అవసరమైన మేరకే ప్రభుత్వం ఉద్యోగులను బదిలీలు చేయాలని సూచనప్రాయంగా చెప్పింది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి ఉద్యోగుల బదిలీలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా తమ సొంత జాబితాలు సిద్ధం చేసుకున్నారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులను కొనసాగించేందుకు, తమ మాట వినరనే అభిప్రాయం ఉన్న అధికారులను పంపించేందుకు, వేరే ప్రాంతంలో ఉన్న తమకు అనుకూలమైన అధికారులను తమ ప్రాంతానికి రప్పించుకునేందుకు ఈ జాబితాలు రూపొందించారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వాటిని నేరుగా ముఖ్యమంత్రికే ఇచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీలో పనిచేస్తున్న అగ్ర నాయకుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జన్మభూమి కార్యక్రమం ముగిసిన వెంటనే ఉద్యోగుల బదిలీలు అనివార్యమనే వాదన వినపడుతోంది. జన్మభూమి కార్యక్రమం మంగళవారంతో ముగియనుండటంతో ఈ వ్యవహారం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తయారు చేసిన జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయా లేవా అని పలువురు ఆరా తీస్తున్నారు. 13 నుంచి ఓటర్ల జాబితా సవరణ ఈ నెల 13 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2015 జనవరి వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఓటర్ల జాబితా సవరణలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు)గా వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో దీనిని మండల స్థాయిలో పర్యవేక్షించే తహశీల్దార్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ ఉత్తర్వులలో గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో పనిచేసే బీఎల్వోలను కూడా బదిలీ చేయకూడదని ఉన్నట్లు పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగుల బదిలీల్లో పలు నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది. పంచాయతీ కార్యదర్శి అయితే సొంత గ్రామంలో, ఈవోపీఆర్డీ అయితే సొంత మండలంలో, ఎంపీడీవో, తహశీల్దారు స్థాయి అధికారులైతే వారి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉండకూడదనే నిబంధనలు తయారుచేసినట్లు సమాచారం. ఈ నిబంధనలు అధికారికంగా ఆమోదం పొందాల్సి ఉంది. ఓటర్ల జాబితా సవరణ నేపథ్యంలో తహశీల్దార్ల బదిలీలు జరగవనే ప్రచారం జరుగుతోంది. తహశీల్దార్లను బదిలీ చేయకుండా బీఎల్వోలను ఎలా బదిలీ చేస్తారని వీఆర్వోలు, పలువురు పంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతున్నా జిల్లాలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు మినహా 80 శాతం మంది బీఎల్వోలుగానే ఉన్నారని, వీరిని ఎన్నికల కమిషన్ నిబంధనలను పక్కనపెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇచ్చిన జాబితా ప్రకారం బదిలీలు చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. జన్మభూమి ముగియడానికి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కావడానికి మధ్య 12వ తేదీ మాత్రమే గడువు ఉంది. డీపీవోగా నాగరాజువర్మ బాధ్యతలు స్వీకరించటంతో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు 12వ తేదీనే జరుగుతాయనే వాదన పంచాయతీ కార్యదర్శుల నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు బీఎల్వోలను బదిలీ చేయవద్దని, ఈ అంశంపై కలెక్టర్ దృష్టిసారించాలని పలువురు పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. -
జన్మభూమి రసాభాస
ఈదులగూడెం (ఆగిరిపల్లి): మండలంలోని ఈదులగూడెం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామసభ రసాభాసగా మారింది. నూజివీడు టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మాట్లాడుతుండగా సర్పంచి భర్త, వైఎస్సార్ సీపీ నాయకుడు ఈలప్రోలు వెంకటసుబ్బయ్య, ఎంపీటీసీ భర్త, వైఎస్సార్ సీపీ నాయకుడు నండూరి భాస్కరప్రసాద్లు గ్రామస్తుల తరఫున పింఛన్ల పంపిణీపై ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ గ్రామంలో 23 మంది పింఛన్లు ఎందుకు ఆపేశారో బహిరంగంగా చెప్పాలన్నారు. సెంటు భూమిలేనివారికి ఐదెకరాలున్నట్లు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. దీంతో టీడీపీ నేత చిట్నేని శివరామకృష్ణ ఉద్రేకంగా మాట్లాడుతూ తాము కమిటీకి సిఫార్సు చేయలేదని, కేవలం రేషన్‌కార్డుల్లో పొరబాట్లవల్ల పింఛన్లు ఆగిపోయాయని తెలిపారు. ఎంపీడీవో కర్రా బసవారావు మాట్లాడుతూ ఆగిన పింఛన్లపై పునఃపరిశీలిస్తున్నట్లు తెలిపారు. జన్మభూమిసభ సక్రమంగా జరగడానికి సహకరించాలని కోరారు. హామీ ఇవ్వకుంటే ధర్నా: వైఎస్సార్ సీపీ ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్సార్ సీపీ నేత మధ్యనువ్వానేనా అన్నట్లు వాగ్యుద్ధం జరడంతో ఎస్ఐ వి.రాజేంద్రప్రసాద్ రెండు వర్గాలను అక్కడినుంచి పంపేశారు. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పింఛన్లు ఆగిపోయినవారికి వచ్చేనెలలో తప్పకుండా ఇస్తామని హామీ ఇవ్వాలని లేకుంటే ఎంపీడీవో కార్యాలయం ముందు బాధితులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం మళ్లీ ముద్దరబోయిన మాట్లాడుతూ జన్మభూమిలో వ్యక్తిగత సమస్యలు మాని గ్రామసమస్యలను ప్రస్తావించాలని చెప్పి వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ రెండుపార్టీల నాయకుల మధ్య ఏమి జరుగుతుందోనని ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూశారు. ఈలోపు ఎంపీడీవో పింఛన్ల పంపిణీకి పిలుపునివ్వడంతో లబ్ధిదారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సర్పంచి ఈలప్రోలు మల్లీశ్వరి, ఎంపీపీ లింగవరపు రామకోటమ్మ, ఎంపీటీసీ నండూరి మంజుల పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలోని సమస్యలపై ఎంపీడీవోకు సర్పంచి వినతిపత్రాన్ని అందజేశారు. తహశీల్దార్ సీహెచ్.ఉమామహేశ్వరరావు, ఎంఈవో ప్రసాద్, ఐసీడీఎస్ సీడీపీవో మంగమ్మ, ఇతరశాఖల మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ నాయకుల హడావుడి ఉందనటానికి ఈ కార్యక్రమమే ఉదాహరణ. పింఛన్లు సరే.. రుణమాఫీ ఏదీ నూజివీడు రూరల్: రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మందాడ నాగేశ్వరరావు ఎంపీపీ టీ శ్రీనివాసరావును ప్రశ్నించారు. మండలంలోని బత్తులవారిగూడెం, అన్నవరం గ్రామాల్లో సోమవారం జన్మభూమి-మా ఊరు గ్రామసభలు నిర్వహించారు. బత్తులవారిగూడెంలో ఎంపీపీ తొమండ్రు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెబుతుండగా మందాడ నాగేశ్వరరావు అడ్డుపడ్డారు. కొందరు వృద్ధులకు మాత్రమే లబ్ధిచేకూరే పింఛన్ల గురించి కాకుండా రుణమాఫీపై మాట్లాడాలని కోరారు. రైతులు, మహిళలు కోరకపోయినా అలవిగాని హామీలను చంద్రబాబే ఇచ్చారని మందాడ గుర్తుచేశారు. ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చి అధికారం దక్కించుకుని ఇప్పుడు 20 శాతం మాఫీ అంటూ పొంతనలేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన మాటలు నమ్మి ఓటేసిన రైతులు, మహిళలు ఎదురుచూసి చివరకు బ్యాంకులకు వడ్డీతోపాటు అపరాధరుసుము కూడా చెల్లించాల్సిన దుస్థితిలో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని ఎంపీపీని కోరడంతో ఆ విషయం తమస్థాయిలోది కాదని ఏదైనా చెప్పాలంటే రాతపూర్వకంగా ఇస్తే ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పి సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తహశీల్దార్ షేక్ ఇంత్యాజ్పాషా మాట్లాడుతూ రుణమాఫీని ప్రభుత్వం పరిశీలిస్తుందని, అధికారులుగా తాము కేవలం ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే అమలు చేయగలమని చెప్పారు. అధికారులు పలు పథకాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయగా ప్రజలు పట్టించుకోకపోవడంతో గ్రామసభలో భోజన విరామాన్ని ప్రకటించారు. జెడ్పీటీసీ సభ్యుడు బాణావతు రాజు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. హామీలన్నీ నెరవేరుస్తాం చాట్రాయి : ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందని టీడీనీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని జనార్దనవరంలో జన్మభూమి - మా ఊరు గ్రామ సభ జరిగింది. దీనిలో పాల్గొన్న ముద్దరబోయిన మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనుల్లో సీఎం బిజీగా ఉండడంవల్ల ఇచ్చిన హామీల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. దీనికోసం ప్రతిపక్షాలు ధర్నాలు చేయటం సబబు కాదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, నివేశన స్థలాలు మంజూరు కావడంలేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీపీ పరసా రమాదేవి, చాట్రాయి జెడ్పీటీసీ సభ్యుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి, గ్రామసర్పంచ్ పి. దుర్గారావు, ఎంపీటీసీ బాణావతు పుష్పావతి, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ నవీన్, ఏపీవో మున్నీ తదితరులు పాల్గొన్నారు. ఆరుగొలనుపేటలో మండలంలోని ఆరుగొలనుపేటలో సోమవారం అధికారులు జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. జెడ్పీటీసీ సభ్యుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. అనంతరం శ్రీ నాగవజ్ర జ్యోత్స్న చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 25 మంది గర్భిణులకు ఎంపీటీసీ మాజీ సభ్యురాలు పుచ్చకాయల శ్రీదేవి సీమంతం నిర్వహించారు. చీరలు పంపిణీ చేశారు. గ్రామసర్పంచ్ ఏకశిరి పద్మ, మాజీ సర్పంచ్ ఇజ్జగాని వెంకటేశ్వరరావు, తహశీల్దారు పి తిరుమలరావు, ఈవోపీఆర్డీ ప్రభాకరరావు, ఎంఈవో వి. మారుతీవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జన్మభూమితో సూక్ష్మప్రణాళికలు ముసునూరు : ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జన్మభూమి ప్రత్యేక అధికారి అజయ్‌కుమార్ నాయక్ అన్నారు. మండలంలోని చిల్లబోయినపల్లిలో సర్పంచ్ బళ్లా శాంతి, జెడ్పీటీసీ చిలుకూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సోమవారం జరిగిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభల ద్వారా గ్రామాల్లో ఏమి అవసరమో గుర్తించి వాటిపై సూక్ష్మప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. వీటిద్వారా విడతల వారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జన్మభూమిలో వచ్చిన అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఐసీడీయస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఎంపీడీవో జి.రాణి, తహశీల్దార్ డి. వనజాక్షి, ఎంపీటీసీ కాండూరు శ్రీరామచంద్ర, ఈవోపీఆర్డీ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
పార్టీలకతీతంగా అభివృద్ధి
అనంతపురం రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పార్టీలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి పరిటాల సునీత అన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా రూరల్ మండల పరిధిలోని తాటిచెర్ల గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తాటిచెర్ల గ్రామంలో తాగు నీటికి ఇబ్బంది లేదని, సాగు నీటి సమస్య ఉందన్నారు. చెరువుకు తప్పకుండా నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద గ్రామంలో ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రైల్వే గేట్ ద్వారా రాకపోకలకు అంతరాయం కల్గుతోందని, ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. అందుకు ప్రభుత్వం రూ 12వేలు మంజూరు చేస్తోందన్నారు. ఆడవారు కాలకృత్యాల కోసం ఆరుబయటకెళ్లడం సరైంది కాదన్నారు. సెల్‌ఫోన్ కన్నా మరుగుదొడ్డే ముఖ్యమన్నారు. అధైర్య పడాల్సిన పనిలేదు : రైతులు, డ్వాక్రా మహిళలు అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా రుణాల మాఫీ జరుగుతుందన్నారు. పింఛన్లు అందని వారికి ఈ నెల 25లోపు అందుతాయని భరోసా ఇచ్చారు. జెడ్పీచైర్మన్ చమన్ మాట్లాడుతూ పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ప్రభావతి అనే వికలాంగురాలికి మంత్రి పింఛ న్ను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నేగంటి మాధవి, వైస్ ఎంపీపీ శిల్ప, జెడ్పీటీసీ వేణుగోపాల్, టీడీపీ నేతలు చంటి, పరిటాల మహేంద్ర, తాటిచెర్ల సర్పంచ్ రామాంజినేయులు, ఎంపీడీఓ లక్ష్మినరసింహశర్మ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నర్సనాయినకుంటలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలి: మంత్రిని కోరిన సీపీఎం : 2013 ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని, ఈ ఏడాది కరువు మండలంగా రూరల్ ప్రాంతాన్ని ప్రకటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ను మంజూరు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి టీ రామాంజినేయులు మంత్రి పరిటాల సునీతను కోరారు. రూ 8 లక్షలతో గ్రామానికి బోరు: మన్నీల గ్రామంలో రూ 8 లక్షలతో బోరు వేయించామని ఎంపీ కన్నేగంటి మాధవి, వైస్ ఎంపీపీ శిల్ప అన్నారు. శుక్రవారం మన్నీలలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెడ్పీటీసీ వేణుగోపాల్, మన్నీల సర్పంచ్ ఆదిశేషయ్య, టీడీపీ నేత చంటి, తహశీల్దార్ షేక్‌మహబూబ్ బాష, టెక్నికల్ ఇంజనీర్ లక్ష్మిదేవి, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మరుగుదొడ్డి నిర్మించకపోతే కాపురం చేయకండి
నిర్మాణానికి రాష్ట్ర ప్రజలంతా ఆర్థికంగా తోడ్పాటునందించాలి జన్మభూమి సభల్లో సీఎం చంద్రబాబు బ్యాంకుకు వెళ్లలేని వృద్ధులకు ఇంటి వద్దే పింఛను చెల్లింపు వయసుతో నిమిత్తం లేకుండా చదువుకునే వారందరికీ ఫీజులు మరుగుదొడ్ల నిర్మాణంతోనే స్వచ్చ భారత్ మిగులు విద్యుత్ తెలంగాణకు ఇస్తాం కేసీఆర్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు గుంటూరు: ‘గుంటూరు జిల్లాలో నే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిద్దాం. రాష్ట్రంలోని 4.93 కోట్ల ప్రజలు ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరూ ఆర్థికం గా తోడ్పాటునందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారైనా మూడు గంటల్లో రాజధానికి చేరుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే మరోమారు జిల్లాకు వస్తానని, ఇక్కడివారి సహకారం, సలహాలు తీసుకుంటానని తెలిపా రు. బుధవారం గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం, శావల్యాపురం మండలంలో ఏర్పాటు చేసిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. వినుకొండ ప్రభుత్వ జూని యర్ కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి కా ర్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శివయ్య స్థూపం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్ఎస్పీ కాలనీలో ఎన్టీర్ సుజల స్రవం తి పథకాన్ని ప్రారంభించారు. శావల్యాపురం మండలంలోని 121 డ్వాక్రా సంఘాలకు రూ.5 కోట్ల చెక్కు అందజేశారు. ముత్తుపల్లిలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సీఎం మాట్లాడారు. రైతులు, పేదలు తనకు రెండు కళ్లని, వారి అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. తాను అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు, డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తున్నానని చెప్పారు. వెనుకబడిన వర్గాల మహిళల ఆర్థిక పురోభివృద్ధికి రూ. 8 వేల కోట్లు వెచ్చించడం ప్రపంచంలో మరెక్కడా జరగలేదన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తామని చెప్పారు. జనధన్ బీమా పథకం ద్వారా బ్యాంకు ఖాతాను పొందిన ప్రతి ఒక్కరికీ రూ.5 వేలు ఓవర్ డ్రాఫ్ట్, లక్ష రూపాయల బీమా సౌకర్చాన్ని కల్పించామన్నారు. ప్రతి గ్రామానికీ స్వచ్చమైన నీరు, విద్యుత్, తారురోడ్ల సౌకర్యాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. ప్రతి ఇంటికీ రెండు ఎల్ఈడీ లైట్లు ఇస్తామని, వీటి ద్వారా 500 మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేయొచ్చని చెప్పారు.కేంద్రం సహకారంతో రాష్ట్రంలో 100 రోజుల్లోనే నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యపడిందని చెప్పారు. ఈ కార్యక్రమా ల్లో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్యేలు జి.వి.ఆంజనేయులు, అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, కె.ఎస్.లక్ష్మణరావు, జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్ తదితరులు పాల్గొన్నారు. మరుగుదొడ్డి నిర్మించకపోతే కాపురం చేయకండి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. మరుగుదొడ్డి వాడని వాడు మనిషే కాదని అన్నారు. మరుగుదొడ్డి నిర్మించకపోతే మహిళలు కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లాలని సూచించారు. మరుగుదొడ్ల వినియోగం వల్ల 20 శాతం వ్యాధులను దూరం చేయవచ్చని, వీటి నిర్మాణం ద్వారా స్వచ్చ ఆంధ్రప్రదేశ్ స్థాపనకు మార్గం ఏర్పడుతుందని చెప్పారు.