మరుగుదొడ్డి నిర్మించకపోతే కాపురం చేయకండి
నిర్మాణానికి రాష్ట్ర ప్రజలంతా ఆర్థికంగా తోడ్పాటునందించాలి జన్మభూమి సభల్లో సీఎం చంద్రబాబు
బ్యాంకుకు వెళ్లలేని వృద్ధులకు ఇంటి వద్దే పింఛను చెల్లింపు
వయసుతో నిమిత్తం లేకుండా చదువుకునే వారందరికీ ఫీజులు
మరుగుదొడ్ల నిర్మాణంతోనే స్వచ్చ భారత్
మిగులు విద్యుత్ తెలంగాణకు ఇస్తాం
కేసీఆర్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
గుంటూరు: ‘గుంటూరు జిల్లాలో నే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిద్దాం. రాష్ట్రంలోని 4.93 కోట్ల ప్రజలు ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరూ ఆర్థికం గా తోడ్పాటునందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారైనా మూడు గంటల్లో రాజధానికి చేరుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే మరోమారు జిల్లాకు వస్తానని, ఇక్కడివారి సహకారం, సలహాలు తీసుకుంటానని తెలిపా రు. బుధవారం గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం, శావల్యాపురం మండలంలో ఏర్పాటు చేసిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. వినుకొండ ప్రభుత్వ జూని యర్ కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి కా ర్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శివయ్య స్థూపం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్‌ఎస్‌పీ కాలనీలో ఎన్టీర్ సుజల స్రవం తి పథకాన్ని ప్రారంభించారు. శావల్యాపురం మండలంలోని 121 డ్వాక్రా సంఘాలకు రూ.5 కోట్ల చెక్కు అందజేశారు. ముత్తుపల్లిలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సీఎం మాట్లాడారు. రైతులు, పేదలు తనకు రెండు కళ్లని, వారి అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. తాను అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు, డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తున్నానని చెప్పారు.
వెనుకబడిన వర్గాల మహిళల ఆర్థిక పురోభివృద్ధికి రూ. 8 వేల కోట్లు వెచ్చించడం ప్రపంచంలో మరెక్కడా జరగలేదన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తామని చెప్పారు. జనధన్ బీమా పథకం ద్వారా బ్యాంకు ఖాతాను పొందిన ప్రతి ఒక్కరికీ రూ.5 వేలు ఓవర్ డ్రాఫ్ట్, లక్ష రూపాయల బీమా సౌకర్చాన్ని కల్పించామన్నారు. ప్రతి గ్రామానికీ స్వచ్చమైన నీరు, విద్యుత్, తారురోడ్ల సౌకర్యాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. ప్రతి ఇంటికీ రెండు ఎల్‌ఈడీ లైట్లు ఇస్తామని, వీటి ద్వారా 500 మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేయొచ్చని చెప్పారు.కేంద్రం సహకారంతో రాష్ట్రంలో 100 రోజుల్లోనే నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యపడిందని చెప్పారు. ఈ కార్యక్రమా ల్లో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్యేలు జి.వి.ఆంజనేయులు, అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, కె.ఎస్.లక్ష్మణరావు, జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్ తదితరులు పాల్గొన్నారు.
మరుగుదొడ్డి నిర్మించకపోతే కాపురం చేయకండి
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. మరుగుదొడ్డి వాడని వాడు మనిషే కాదని అన్నారు. మరుగుదొడ్డి నిర్మించకపోతే మహిళలు కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లాలని సూచించారు. మరుగుదొడ్ల వినియోగం వల్ల 20 శాతం వ్యాధులను దూరం చేయవచ్చని, వీటి నిర్మాణం ద్వారా స్వచ్చ ఆంధ్రప్రదేశ్ స్థాపనకు మార్గం ఏర్పడుతుందని చెప్పారు.