బదిలీల ఫీవర్ | Transfer of the Fever | Sakshi
Sakshi News home page

బదిలీల ఫీవర్

Published Tue, Nov 11 2014 12:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

బదిలీల ఫీవర్ - Sakshi

బదిలీల ఫీవర్

జన్మభూమి ముగియగానే ఉత్తర్వులు వస్తాయని ఊహాగానాలు
13 నుంచి ఓటర్ల జాబితా సవరణ
బీఎల్‌వోలను మినహాయించాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు
తహశీల్దార్లకూ లేనట్టే!
పరిమితంగానే బదిలీలు  చేయాలని ప్రభుత్వం ఆదేశం

 
మచిలీపట్నం : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. మంగళవారంతో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ముగియనుండటంతో ఇక బదిలీలు జరుగుతాయని ఉద్యోగులు భావిస్తున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో జరిగితే ఆ ప్రభావం పాఠశాలలు, తమ కుటుంబాలపై పడుతుందని భావించిన ఉపాధ్యాయులు ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రితో చర్చలు జరిపి ఇప్పట్లో బదిలీలు లేవని ప్రకటన చేయించుకున్నారు. ఈ వ్యవహారం నుంచి ఉపాధ్యాయులు బయటపడగా ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు బదిలీలు అనివార్యమనే వాదన ఇటీవల కాలం వరకు వినపడింది. అవసరమైన మేరకే ప్రభుత్వం ఉద్యోగులను బదిలీలు చేయాలని సూచనప్రాయంగా చెప్పింది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి ఉద్యోగుల బదిలీలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా తమ సొంత జాబితాలు సిద్ధం చేసుకున్నారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులను కొనసాగించేందుకు, తమ మాట వినరనే అభిప్రాయం ఉన్న అధికారులను పంపించేందుకు, వేరే ప్రాంతంలో ఉన్న తమకు అనుకూలమైన అధికారులను తమ ప్రాంతానికి రప్పించుకునేందుకు ఈ జాబితాలు రూపొందించారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వాటిని నేరుగా ముఖ్యమంత్రికే ఇచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీలో పనిచేస్తున్న అగ్ర నాయకుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జన్మభూమి కార్యక్రమం ముగిసిన వెంటనే ఉద్యోగుల బదిలీలు అనివార్యమనే వాదన వినపడుతోంది. జన్మభూమి కార్యక్రమం మంగళవారంతో ముగియనుండటంతో ఈ వ్యవహారం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తయారు చేసిన జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయా లేవా అని పలువురు ఆరా తీస్తున్నారు.

13 నుంచి ఓటర్ల జాబితా సవరణ

ఈ నెల 13 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2015 జనవరి వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఓటర్ల జాబితా సవరణలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు)గా వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో దీనిని మండల స్థాయిలో పర్యవేక్షించే  తహశీల్దార్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ ఉత్తర్వులలో గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో పనిచేసే బీఎల్‌వోలను కూడా బదిలీ చేయకూడదని ఉన్నట్లు పలువురు ఉద్యోగులు చెబుతున్నారు.

ఉద్యోగుల బదిలీల్లో పలు నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది. పంచాయతీ కార్యదర్శి అయితే సొంత గ్రామంలో, ఈవోపీఆర్డీ అయితే సొంత మండలంలో, ఎంపీడీవో, తహశీల్దారు స్థాయి అధికారులైతే వారి రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో ఉండకూడదనే నిబంధనలు తయారుచేసినట్లు సమాచారం. ఈ నిబంధనలు అధికారికంగా ఆమోదం పొందాల్సి ఉంది. ఓటర్ల జాబితా సవరణ నేపథ్యంలో తహశీల్దార్ల బదిలీలు జరగవనే ప్రచారం జరుగుతోంది. తహశీల్దార్లను బదిలీ చేయకుండా బీఎల్‌వోలను ఎలా బదిలీ చేస్తారని వీఆర్వోలు, పలువురు పంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతున్నా జిల్లాలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు మినహా 80 శాతం మంది బీఎల్‌వోలుగానే ఉన్నారని, వీరిని ఎన్నికల కమిషన్ నిబంధనలను పక్కనపెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇచ్చిన జాబితా ప్రకారం బదిలీలు చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. జన్మభూమి ముగియడానికి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కావడానికి మధ్య 12వ తేదీ మాత్రమే గడువు ఉంది. డీపీవోగా నాగరాజువర్మ బాధ్యతలు స్వీకరించటంతో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు 12వ తేదీనే జరుగుతాయనే వాదన పంచాయతీ కార్యదర్శుల నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు బీఎల్‌వోలను బదిలీ చేయవద్దని, ఈ అంశంపై కలెక్టర్ దృష్టిసారించాలని పలువురు పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement