'అమ్మాయిల రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేయొద్దు'
న్యూఢిల్లీ: భారత భద్రతాదళాల కీలక సమాచారాన్ని తస్కరించడానికి పొరుగు దేశాల గుఢాచార సంస్థలతో పాటూ పలు తీవ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ క్రిష్ణ చౌదరి వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో పనిచేస్తున్న అధికారులు, జవాన్లు మొబైల్ యాప్‌ల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పాకిస్తాన్, చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు కొన్ని యాప్‌ల ద్వారా మొబైల్లోని సమాచారాన్ని తస్కరించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అంతే కాకుండా ఎవరైనా తెలియని వారి నుంచి ముఖ్యంగా అమ్మాయిల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దని హెచ్చరించారు.
గూగుల్ ప్లే స్టోర్ లోని వీచాట్(WeChat), స్మెష్(Smesh), లైన్(Line)వంటి యాప్ లను అధికారులు, జవాన్లు వాడకూడదని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. జవాన్లు వాడే స్మార్ట్ ఫోన్ల నుంచే విదేశాలకు చెందిన గూఢచార సంస్థలు ఆన్లైన్ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించగలిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
వీరే కాకుండా పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, తీవ్రవాద సంస్థలకు చెందిన హ్యాకర్లు కూడా భారత రహస్య సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరు ముఖ్యంగా జవాన్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందమైన అమ్మాయిల ప్రొఫైల్ పిక్ల తో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాట్ చేయడానికి మరో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు. అనంతరం సదరు యాప్ ఇన్స్టాల్ అవ్వగానే వారు మొబైల్లోని కీలక సమాచారాన్ని(కాంటాక్ట్స్, మెసేజ్‌లు, వీడియోలు, జీపీఎస్ లొకేషన్) హ్యాక్ చేయగలుగుతున్నారు.
కాగా ఈ యాప్‌ల ద్వారా ఎదురయ్యే దారుణమైన పరిణామాల గురించి తెలియని వారు ఇంకా వీటిని వాడుతున్నారని, ఏమౌతుందిలే అని వ్యవహరిస్తే చాలా ప్రమాదకరమైన సంఘటనలు ఎదుర్కోవలసి వస్తుందని క్రిష్ణ చౌదరి హెచ్చరించారు.