Federal Investigation Agency
-
షాకింగ్: 560 మంది శరీర భాగాలను అమ్ముకున్న తల్లీకూతుళ్లు!
వాషింగ్టన్: అమెరికాలోని కొలొరాడో రాష్ట్రంలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. శ్మశన వాటిక మాజీ ఓనర్ అయిన ఓ 46 ఏళ్ల మహిళకు ఫెడరల్ కోర్టు మంగళవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంత్యక్రియల కోసం తీసుకొచ్చిన 560 మృతదేహాలకు చెందిన వివిధ అవయవాలను బంధువులకు తెలియకుండానే అమ్ముకున్నట్లు నేరం నిరూపణ అయిన క్రమంలో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మృతుల బంధువులను మోసం చేసి ఫోర్జరీ డోనార్ పత్రాల సాయంతో ‘మేగన్ హెస్’ అనే మహిళ శరీర భాగాలను విక్రయించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. గత జులై నెలలో తను చేసిన నేరాన్ని అంగీకరించిందని, ఈ క్రమంలోనే కోర్టు 20 ఏళ్ల శిక్ష విధించినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఆమెకు సహకరించిన తల్లి షిర్లే కొచ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడినట్లు తెలిపింది. ఇదీ జరిగింది.. కొలొరాడో రాష్ట్రంలోని మోంట్రోస్‌లో ‘సన్‌సెట్ మెసా’ అనే శశ్మాన వాటిక, అవయవదాన సేవలను నిర్వహించేది మేగన్ హెస్. 69 ఏళ్ల తల్లి షిర్లే కొచ్ ఆమెకు ఈ కార్యక్రమాల్లో సహకరించేది. ఈ క్రమంలోనే ఇరువురు అక్రమంగా మృతదేహాల అవయవాలను విక్రయిస్తూ డబ్బులు సంపాదించటం మొదలు పెట్టారు. బంధువులే అవయవాలను దానం చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి తమ చీకటి కార్యాన్ని నిర్విగ్నంగా కొనసాగించారు. ఇలా 560 మంది శరీర భాగాలను విక్రయించారు. 2016-2018 మధ్య అమెరికాలో అవయవాల విక్రయాలపై రాయిటర్స్ పరిశోధనాత్మక కథనాలు వెలువడిన క్రమంలో మేగన్ హెస్, ఆమె తల్లి షిర్లే చేసిన దందా బయటపడింది. తల్లీకూతుళ్ల విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)కి రాయిటర్స్ సమాచారం అందించడంతో వారి బిజినెస్ కేంద్రాలపై దాడులు చేసింది. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసుగా పోలీసులు అభివర్ణించారు. ఇరువురిని అరెస్ట్ చేసి విచారించగా గత జులై నెలలో నేరం అంగీకరించారు. ఈ క్రమంలోనే మేగన్ హెస్కు 20 ఏళ్లు, ఆమె తల్లి షిర్లే కొచ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఫెడరల్ కోర్టు. నిందితురాలి తల్లి షిర్లే ప్రధానంగా అవయవాలను శరీరం నుంచి వేరు చేసి భద్రపరిచే పనిలో సహకరించేదని తేల్చింది. తల్లీకూతుళ్ల ఆపరేషన్‌కు 200లకుపైగా కుటుంబాలు బాధితులుగా మారినట్లు తెలిసింది. మరోవైపు.. హెస్ చేసిన చర్యలను సమర్థించారు ఆమె న్యాయవాది. నిందితురాలికి 18 ఏళ్ల వయసులో మెదడు దెబ్బతిన్నదని అందుకే ఇలా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. కోర్టులో సాక్ష్యం చెప్పిన ఓ బాధితుడు వారి నేరాలపై కీలక విషయాలు బయటపెట్టాడు. తన తల్లికి చెందిన భుజాలు, మోకాళ్లు, పాదాలు విక్రయించారని ఆరోపించారు. అమెరికాలో అవయవాల మార్పిడి కోసం గుండె, కిడ్నీలు వంటి వాటిని విక్రయించడం నేరం. వాటిని ఎవరైనా దానం చేస్తేనే మార్పిడికి ఉపయోగించాలి. చట్టం పరిధిలో లేని తల, భుజాలు, వెన్నెముఖలను సైతం వారు విక్రయించేవారని తేలింది. ఇదీ చదవండి: దేశం విడిచి వెళ్లమని బెదిరింపులు.. నెలకి రూ.1కోటి ఆఫర్: మహిళా కోచ్ -
పక్కనే ఉన్నా పసిగట్టలేకపోయారు..
న్యూయార్క్ : తాలిబన్ వ్యవస్ధాపకుడు ముల్లా మహ్మద్ ఒమర్ అలియాస్ ముల్లా ఒమర్ అమెరికా సైనిక శిబిరాలకు అత్యంత చేరువలోని రహస్య గదిలో ఉన్నా అమెరికన్ దళాలు గుర్తించలేదని ఇటీవల విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది. ఆప్ఘనిస్తాన్‌లోని అమెరికా శిబిరాలకు నడక దూరంలోనే ముల్లా ఒమర్ ఏళ్ల తరబడి నివసిస్తున్నారని ఈ పుస్తకం అమెరికన్ ఇంటెలిజెన్స్ ఘోరవైఫల్యాన్ని ఎత్తిచూపింది. గతంలో ముల్లా తలదాచుకున్న ఈ ఇంటిపై అమెరికా దళాలు సోదాలు చేపట్టినా ఇందులో ఆయన కోసం నిర్మించిన రహస్య గదిని అవి పసిగట్టలేకపోయాయని పుస్తకంలోని అంశాలను ప్రచురించిన గార్డియన్, వాల్‌స్ర్టీట్ జర్నల్ కథనాలు వెల్లడించాయి. అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడి అనంతరం ఒమర్ తలపై అగ్రదేశం కోటి డాలర్ల రివార్డును ప్రకటించింది. కాగా అల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ మాదిరిగానే ఒమర్ సైతం పాకిస్తాన్లో తలదాచుకున్నాడని అమెరికా భావిస్తోంది. 2006 నుంచి ఆప్ఘనిస్తాన్ కేంద్రంగా వార్తలు అందిస్తున్న డచ్ జర్నలిస్ట్ బెటే డామ్ ప్రచురించిన ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలు దుమారం రేపుతున్నాయి. -
'ముంబై దాడికి మా దేశంలోనే కుట్ర'
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడి ఘటనకు పాకిస్థాన్‌లోనే పథకం రచించి.. పాక్ గడ్డపై నుంచే ఉగ్రవాదులు ముంబైకి వచ్చి మారణహోమం సృష్టించారు. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాజీ డీజీ తారిఖ్ ఖోసా ఈ విషయాలను వెల్లడించారు. ముంబై ఉగ్రవాది దాడి గురించి తారిఖ్ రాసిన వ్యాసం పాకిస్థాన్ పత్రిక డాన్లో ప్రచురితమైంది. 'ముంబై మారణహోమానికి పాక్‌లో పథకం రచించి, ఈ గడ్డపై నుంచే బయలుదేరారు. ఈ దాడిలో పాల్గొన్న పాక్ జాతీయుడు కసబ్, లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాదులు సింధ్‌లోని తట్టాలో శిక్షణ పొందారు. ఇక్కడి నుంచి బయల్దేరి సముద్ర మార్గం ద్వారా ముంబై చేరుకున్నారు. సింధ్ లోని ఉగ్రవాద శిబిరాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ముంబై దాడిలో ఉగ్రవాదులు వాడిన పేలుడు పదార్థాల కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు' అని తారిఖ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులు ముంబైకి వచ్చిన తీరు, పాకిస్థాన్ నుంచి వారికి నిర్దేశం చేయడం, ముంబై దాడి తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణ పరిస్థితుల గురించి తారిఖ్ ఈ వ్యాసంలో వెల్లడించారు. 2008 నవంబర్‌లో జరిగిన ముంబై ఉగ్రవాది దాడిలో 166 మంది మరణించారు. వీరిలో పోలీసులు, పౌరులతో పాటు విదేశీయులు ఉన్నారు. పాకిస్థాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు అరేబియా సముద్రం నుంచి ముంబైలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. భారత భద్రత బలగాలు తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చగా, బందీగా పట్టుకున్న అజ్మల్ కసబ్‌ను ఆ తర్వాత ఉరి తీశారు. ఈ ఘటనతో సంబంధం లేదని తొలుత పాక్ ప్రకటించినా, కసబ్, ఇతర ఉగ్రవాదులు పాక్ జాతీయులనేని అంగీకరించింది.