శాస్త్రీయ శక్తి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్‌స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని; శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్‌కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్‌గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్‌ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్‌క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్‌గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా; ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్; మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ; క్యాన్సర్‌ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ; మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ; పుణె వైరాలజీ ల్యాబ్‌లో కోవిడ్ వైరస్‌ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం; అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్‌ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్‌ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్‌ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్‌ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్‌లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్‌లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం.