Feminist Prasad
-
గిల్గమెష్: ప్రపంచ ప్రాచీన పురాణం
‘సిధ్యురి’ మరొక స్త్రీ పాత్ర. ‘ఉట్నపిస్తిమ్’ నివసించే ప్రాంతానికి ఎలా చేరుకోవాలో గిల్గమెష్కు తెలియజేస్తుంది. అయితే అమరత్వం సాధించటం సాధ్యం కాదనీ, మనుషులు పరిశుద్ధంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనీ చెబుతుంది. వివాహం చేసుకొని భార్యను సుఖపెట్టటం, పిల్లల్ని రక్షించటం మగవాడి విధి అని తెలియజేస్తుంది. ప్రపంచ సాహిత్యం మొత్తంలో దీన్ని మించిన హితబోధ లేదనటం అతిశయోక్తి కాదేమో! ఏ పురాణాన్నైనా పుక్కిటి పురాణమని పూర్తిగా తీసిపారవెయ్యకూడదు. రామ రావణ యుద్ధం పురాణం; రావణుడి పొట్టలో అమృతభాండం ఉండటం పుక్కిటి పురాణం. పురాణాన్ని నమ్మటం విజ్ఞత; పుక్కిటి పురాణాన్ని నమ్మటం మూర్ఖత్వం. ఒక జాతి అనుభవసారాన్ని మతవిశ్వాస రూపంలో తెలియజేసేది పురాణం. ఒక పురాణగాథలో అనేక అభూత కల్పనలు ఉండవచ్చు; వాటి వెనకాల అంతర్లీనంగా ఒక సత్యం దాగి ఉంటుంది. ఆ సత్యాన్ని అర్థం చేసుకోవటం వల్ల చరిత్ర పూర్వకాలానికి చెందిన మనుషుల భౌతిక జీవితాన్నీ, విశ్వాసాలనూ, సామాజిక వ్యవస్థలనూ అంచనా వెయ్యవచ్చు. ప్రపంచ పురాణాలన్నింటిలో అత్యంత ప్రాచీనమైనదీ, మొట్టమొదట లిపిబద్ధం చేయబడినదీ సుమేరియన్ నాగరికతకు చెందిన ‘గిల్గమెష్ పురాణం’. సుమేరియన్ల అతి ప్రాచీన నగరాలలో ‘ఉరుక్’ఒకటి. క్రీ.పూ. 2800 కాలంలో ఉరుక్ నగరాన్ని ‘గిల్గమెష్’ పాలించాడు. అతను చేసిన వీరోచిత సాహస కృత్యాలకు గాను మరణానంతరం అతనికి దైవత్వం ఆపాదించబడింది. అతని వీరగాథలు పద్య రూపంలో మౌఖికంగా వాడుకలోకి వచ్చాయి. క్రీ.పూ. 2000 నాటికి లిఖిత రూపంలోకి వచ్చాయి. సుమేరియన్లను అకేడియన్లు ఓడించి సామ్రాజ్యాన్ని స్థాపించారు. గిల్గమెష్ గాథలు అకేడియన్ భాషలోకి మారాయి. ఆ తరువాత బాబిలోనియన్లు సామ్రాజ్యాన్ని స్థాపించారు. గిల్గమెష్ గాథలు బాబిలోనియన్ భాషలోనికీ వెళ్ళాయి. భాషలు వేరయినా సుమేరియన్లకూ, అకేడియన్లకూ, బాబిలోనియన్లకూ లిపి ఒక్కటే. అది సుమేరియన్ల ‘క్యూని ఫారం’ లిపి. గిల్గమెష్ గాథలన్నింటినీ క్రమబద్ధీకరించి ఒక సాధికార ప్రతిని తయారుచేసినవాడు సిన్– లిక్–యునిన్ని (క్రీ.పూ. 1200). సుమేరియన్ భాషలో గిల్గమెష్కు సంబంధించిన గా«థలు ఐదున్నాయి. బాబిలోనియన్ కాలానికి ఇవి (సాధికార ప్రతిలో) పన్నెండు భాగాలుగా వ్రాయబడ్డాయి. ఒక్కొక్కభాగం ఒక్కొక్క పెద్ద మట్టి ఫలకం (ఖ్చీbl్ఛ్ట) మీద వ్రాయబడి ఉంటుంది. అటువంటి ఫలకాలు సుమేరియన్ భాషలో, అకేడియన్ భాషలో వందల కొద్దీ దొరికాయి. వాటిలో ఏ ఒక్కటీ పూర్తిగా చెక్కు చెదరకుండా లభించలేదు. పురాణాలకు ఉండవలసిన ముఖ్యలక్షణాలన్నీ గిల్గమెష్ పురాణానికి ఉన్నాయి. చెడు మీద మంచి విజయం సాధించటమనేది దాదాపు అన్ని పురాణాల్లో కనిపించే ముఖ్య విషయం. కానీ ‘గిల్గమెష్ పురాణం’లో అటువంటిదేమీ ఉండదు. గిల్గమెష్ చేసిన సాహసకృత్యాలు, స్నేహానికి అతనిచ్చిన ప్రాముఖ్యత, అమరత్వం పొందటానికి చేసిన విఫల ప్రయత్నం ఇందులో కనిపిస్తాయి. దీన్ని ప్రపంచపు మొట్టమొదటి ఆటౌఝ్చnఛ్ఛి (అన్నదమ్ములు లేక స్నేహితులు కలసి చేసే సాహసకృత్యాలు) అనవచ్చు. (రామాయణాన్ని కూడా ఆటౌఝ్చnఛ్ఛి అనవచ్చు.) ఇందులో మొత్తం పది పాత్రలు ఉన్నాయి. నేప«థ్యంలో కొన్ని పాత్రల ప్రస్తా్తవన ఉంటుంది కానీ వాటికి కథతో సూటిగా సంబంధం ఉండదు. గిల్గమెష్ ఈ పురాణానికి కేంద్ర బిందువు. ‘ఉరుక్’నగరంలో ‘ఇష్తార్’ దేవతకూ, ఆమె తండ్రి ‘అను’కూ ఆలయాన్ని నిర్మించినవాడు. ‘ఉరుక్’ నగర రక్షణ కోసం యువకుల చేత గోడల నిర్మాణం చేయిస్తుంటాడు. యువకులు నిరంతరం పనిచేస్తుండటంతో యువతులకు వివాహం కావట్లేదని నగర పెద్దలు ‘అను’ దేవుడికి గిల్గమెష్ గురించి ఫిర్యాదు చేస్తారు. రెండవ ముఖ్య పాత్ర పేరు ‘ఎంకిడు’. సుమేరియన్ల గాథల్లో ఇతను గిల్గమెష్ సేవకుడిగా పేర్కొనబడ్డాడు. అకేడియన్, బాబిలోనియన్ గాథల్లో ఇతను ప్రత్యేకంగా సృష్టించబడినట్లు చెప్పబడింది. బల పరాక్రమాలలో ఇతను గిల్గమెష్కు సమవుజ్జీ. వీరిద్దరూ మంచి స్నేహితులవుతారు. కలసి రెండు గొప్ప సాహసకృత్యాలు చేస్తారు. అయితే ఎంకిడు మరణం గిల్గమెష్ను కృంగదీస్తుంది. ఎంకిడు లాగా తను మరణించ కూడదనీ, మరణాన్ని జయించాలనీ నిర్ణయించుకొంటాడు. అమరత్వాన్ని సాధించటానికి అతను చేసిన ప్రయత్నం అతన్ని ‘ఉట్నపిస్తిమ్’ వద్దకు తీసుకువెళ్తుంది. బైబిల్లోని ‘నోవా’లాగా, హిందువుల పురాణాలలోని ‘మను’ లాగా ఇతను ప్రాణి కోటిని జలప్రళయం నుండి రక్షించినవాడు. అందువల్ల అమరత్వం పొందినవాడు. అమరత్వ రహస్యం తెలుసుకోవటానికి గిల్గమెష్ ఇతని లోకానికి వెళతాడు. ఈ పురాణంలోని స్త్రీ పాత్రలు పైకి కనిపించేది చాలా కొద్దిసేపయినా ఆ కాలంలో చోటు చేసుకొంటున్న మార్పులను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయి. స్త్రీ పాత్రలలో ముఖ్యమైనది ‘ఇష్తార్’ దేవత. ‘ఉరుక్’ నగర ప్రధానదేవత (్క్చ్టటౌn జౌఛీఛ్ఛీటట). ‘హుంబబ’ అనే భయంకర మృగంతో యుద్ధం చెయ్యటానికి వెళ్ళేటప్పుడు సహాయం కోసం గిల్గమెష్ ఈమెను ప్రార్ధించడు. సూర్యదేవుడైన ‘షమాష్’ సహాయం కోరతాడు. విజయం సాధిస్తే ‘షమాష్’ మహిమల్ని కీర్తిస్తాననీ, సింహాసనమెక్కిస్తాననీ అంటాడు. ‘హుంబబ’ మృగాన్ని గిల్గమెష్ వధించాక తనను వివాహం చేసుకొమ్మని అడుగుతుంది ‘ఇష్తార్’. అతను నిరాకరిస్తాడు. ఆమె ఆగ్రహించి ‘ఉరుక్’ నగరాన్ని ధ్వంసం చెయ్యటానికి దైవ వృషభాన్ని పంపిస్తుంది. ఎంకిడు, గిల్గమెష్ కలసి దాన్ని వధిస్తారు. ‘ఇష్తార్’ దేవతను ‘ఎంకిడు’ అవమానిస్తాడు. ఆమె అతణ్ని శపిస్తుంది. ఆ తరువాత కొద్దికాలానికి ఎంకిడు వ్యాధిగ్రస్తుడై మరణిస్తాడు. తన నగరానికి ప్రధాన దేవత ఐన ‘ఇష్తార్’ను గిల్గమెష్ నిరాకరించటం ‘ఇష్తార్’ దేవతపైన ‘షమాష్’ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నంగా భావించాలి. అయితే ఆ ప్రయత్నం ఆ కాలంలో విఫలమైంది. ‘ఇష్తార్’ దేవతను నిరాకరించినప్పటి నుండి గిల్గమెష్ చేసిన పనులేవీ సఫలం కావు. ‘ఇష్తార్’ దేవత ఆలయ పూజారిణి లేక వేశ్య పేరు ‘షమ్హత్’. సుమేరియన్ భాషలో ఈమె పేరు ‘హరిమ్’. అడవిలో ఉంటూ జంతువులలో జంతువుగా సంచరించే అనాగరికుడైన ‘ఎంకిడు’ను నాగరికుడిగా తీర్చిదిద్ది ‘ఉరుక్’ నగరానికి తీసుకువచ్చిన యువతి ఈమె. మానవజాతిని అనాగరిక దశ నుండి నాగరిక దశకు తీసుకు వచ్చింది మాతృస్వామ్యమని దీనివల్ల అర్థమౌతుంది. వ్యవసాయం వల్ల, పశుపోషణ వల్ల ఆహారాన్ని నిలువ చేయటం నేర్పిన తరువాతనే పితృస్వామ్యం ప్రారంభమయింది. ఇతరుల సంపదను (ధాన్యం, పశువులు) దోచుకొనే దోపిడి వ్యవస్థ ప్రారంభమైంది. ‘సిధ్యురి’ మరొక ముఖ్య స్త్రీ పాత్ర. ‘ఉట్నపిస్తిమ్’ నివసించే ప్రాంతానికి ఎలా చేరుకోవాలో ఈమె గిల్గమెష్కు తెలియజేస్తుంది. అయితే దారి తెలియచేసే ముందు అమరత్వం సాధించటం సాధ్యం కాదనీ, మనుషులు పరిశుద్ధంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనీ చెబుతుంది. వివాహం చేసుకొని భార్యను సుఖపెట్టటం, పిల్లల్ని రక్షించటం మగవాడి విధి అని తెలియజేస్తుంది. ప్రపంచ సాహిత్యం మొత్తంలో దీన్ని మించిన హితబోధ లేదనటం అతిశయోక్తి కాదేమో! వివాహం చేసుకోవటం, సంతానాన్ని పొందటం మగవాడికి ముఖ్యమని గిల్గమెష్ తల్లి ‘నిన్సున్’ కూడా చెబుతుంది. కాని గిల్గమెష్ మాత్రం మరణించే వరకు వివాహం చేసుకోడు. గిల్గమెష్ కాలం నాటికి (క్రీ.పూ. 2800) పితృస్వామ్యం ప్రారంభమై బలపడుతున్నది. రాజకీయ, సామాజిక వ్యవహారాలలో పురుషులు పెత్తనం దొరకబుచ్చుకొన్నారు. కాని పితృస్వామ్యాన్ని బలపరిచే తాత్విక చింతన, దాని చుట్టూ అల్లబడే మతసిద్ధాంతాలు ఏర్పడలేదు. స్త్రీ తన సంతానంలో తన పునర్జన్మని చూసుకుంటుంది. అమరత్వం సాధించిన తృప్తి పొందుతుంది. పురుషుడికి అటువంటి అవకాశం లేదు. కనుక అతను అమరత్వం పొందటానికి వేరే మార్గాలు అన్వేషిస్తాడు. పరమాత్మ, జీవాత్మ, పునర్జ్జన్మ, పరలోకం, మోక్షం మొదలైనవన్నీ ఆ అన్వేషణలో అతను ఏర్పరచుకున్న భ్రమలు. ఈ భ్రమలు గిల్గమెష్ పురాణంలో మచ్చుకి కూడా కనపడవు. అంటే పితృస్వామ్యం ప్రారంభ దశలో ఉందని అర్థం. క్రైస్తవం, ఇస్లాం, హిందూ మతం, బౌద్ధం మొదలైనవన్నీ అసలు సిసలు పితృస్వామ్య మతాలు. ఇవన్నీ ఇహలోకానికి కాకుండా పరలోకానికి పెద్ద పీట వేస్తాయి (బౌద్ధం కాస్త మినహాయింపు). ఐదువేల సంవత్సరాలకు పూర్వం మాతృస్వామ్యం చెప్పిన సత్యాలు నిజమని ఇప్పుడు సైన్సు చెబుతున్నది. దైవసృష్టి సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం, పరలోకం మొదలైనవన్నీ భ్రమలని ఆధారాలతో అది నిరూపిస్తున్నది. అయినా మనం ఇంకా పితృస్వామ్య ప్రవచిత తప్పుడు భ్రమలనే పట్టుకు వ్రేళ్ళాడుతున్నాం. పురాణాలను కాకుండా పుక్కిటి పురాణాలను నమ్మే మేధావులం కదా మనం! ది ఫెమినిస్ట్ ప్రసాద్ 9849828797 -
ఫెమినిజం కాదు అస్తిత్వవాదం!
అభిప్రాయం అస్తిత్వవాదాల పరిధి పరిమితమైనది. అవి ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు, పరిమిత ప్రజా సమూహాలకు చెందినవి. ఫెమినిజం అలాంటిది కాదు. అది ప్రపంచంలోని స్త్రీలందరికీ సంబంధించినది. స్త్రీలకే కాదు పురుషులకు కూడా సంబంధించినది. ఫెమినిజం, దళితవాదం, ముస్లిం మైనారిటీవాదం మొదలైనవి తెలుగునాట అస్తిత్వవాదాలుగా చలామణి అవుతున్నాయి. వాస్తవానికి వీటిని అస్తిత్వ ఉద్యమాలు లేక గుర్తింపు రాజకీయాలు అని పిలవటం సరికాదని బాలగోపాల్ గారు తన ‘కొత్త ఉద్యమాలు పాత సిద్ధాంతాలు’ అనే వ్యాసంలో పేర్కొన్నారు. ఈ పేర్లు ఆ ఉద్యమాలు తమకుతాము పెట్టుకున్నవి కావనీ, విశ్లేషకులు పెట్టినవనీ చెప్పారు. ‘‘ఒక ప్రత్యేకమైన సాంఘిక సాంస్కృతిక స్వభావం గల ప్రజలు తమ ప్రత్యేకతను కాపాడుకోవటం కోసం చేసే ఉద్యమాలకు అ పేరు పెట్టవచ్చును. ఉదాహరణకు బ్రిటన్లోని ఐరిష్ ప్రజల పోరాటం, ఈశాన్య భారత ప్రాంతంలోని ‘నాగా’ తదితర జాతుల పోరాటాలకు, కశ్మీర్ పోరాటానికి కూడా ఈ పేరు చాలా వరకు సరిపోతుంది.’’ 1990, జనవరి-ఫిబ్రవరి ‘చూపు’ మాసపత్రికలో బాలగోపాల్ వ్యక్తపరచిన అభిప్రాయం ఇది. అయితే ఆ వ్యాసం పాఠకుల్ని గందరగోళానికి గురి చేస్తుంది. ఫెమినిజం, దళితవాదం, ముస్లిం మైనారిటీ వాదాల్ని అస్తిత్వ వాదాలని పిలవొచ్చా లేదా అనే స్పష్టత ఆ వ్యాసం కలిగించదు. దళితవాదం, ముస్లిం మైనారిటీవాదాల్ని పక్కన పెట్టి, ఫెమినిజాన్ని గురించి నేను చెప్పదలచుకొన్నాను. ఫెమినిజం అస్తిత్వవాదం కాదు. అస్తిత్వవాదాల పరిధి పరిమితమైనది. అవి ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు, పరిమిత ప్రజా సమూహాలకు చెందినవి. ఫెమినిజం అలాంటిది కాదు. అది ప్రపంచంలోని స్త్రీలందరికీ సంబంధించినది. స్త్రీలకే కాదు పురుషులకు కూడా సంబంధించినది. ఈ మాట ఎందుకంటున్నానంటే- స్త్రీ పురుషులు వేరు వేరు కాదు, వేరు వేరు జాతులకు (species) చెందినవారు కాదు. ఒకే జాతికి చెందిన పరస్పర పూరకాలు. ఒకరి కష్టాలు మరొకరు పంచుకొంటారు. ఒకరికి అన్యాయం జరుగుతుంటే అది తమకు సంబంధించినది కాదని రెండవవారు ఊరుకోరు. అలా ఊరుకొనే వారైతే రాజా రామమోహనరాయ్,కందుకూరి, గురజాడ, చలం పేర్లు చరిత్రలో నిలిచేవి కావు. ఫెమినిజంలో చాలా రకాలున్నాయి. వాటిలో Existentialist Feminism ఒకటి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫెమినిజాన్ని అస్తిత్వవాదంగా పరిగణించకూడదు. ఎగ్జిస్టెన్షియల్ ఫెమినిజం సృష్టికర్త సిమోన్ డి బావర్ (Simon de beauvoir), ఝపాల్ సార్త్ర యొక్క అస్తిత్వవాదంతో ప్రభావితురాలై 1949లో ‘ద సెకండ్ సెక్స్’ రాసింది. రెండవ తరం ఫెమినిస్టులకు ఈ పుస్తకం మంచి స్ఫూర్తినిచ్చింది. స్త్రీలకు జండర్ అవగాహన కలిగించిన మొదటి రచనగా దీన్ని భావిస్తారు. కానీ దీంట్లో వివాహ వ్యవస్థనీ, మాతృత్వాన్నీ బావర్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీని ప్రభావం వలన రాడికల్ ఫెమినిస్టులు కొందరు పురుష ద్వేషానికి లోనై ఫెమినిస్ట్ ఉద్యమానికి నష్టం కలిగించారు. పైగా 1972 వరకూ బావర్ తను ఫెమినిస్టునని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. అందువలన ఎగ్జిస్టెన్షియల్ ఫెమినిజాన్ని సాధారణంగా ఫెమినిజం యొక్క ప్రధాన స్రవంతిలో భాగంగా ఫెమినిస్టులు గుర్తించరు. ఫెమినిజంలో అనేక రకాలున్నట్లే కొన్ని దశలు (W aves) కూడా ఉన్నాయి. ఇప్పుడు నడుస్తున్న దశ వరకు ఫెమినిస్టులు చేసిన కృషి, ప్రపంచానికి అందించిన నూతన జ్ఞానం చాలా విశిష్టమైనవి. ఉదాహరణకు ఆడవాళ్ళు ఓటు హక్కు కలిగి ఉండటం, చదువుకోవటం ఈ రోజు అతి సాధారణ విషయం. కానీ ఇంత సాధారణ విషయాలను సాధించుకోవటానికి పశ్చిమ దేశాల స్త్రీలు ఎన్ని ఆలోచనలు చెయ్యాల్సి వచ్చింది! ఎన్ని పోరాటాలు చెయ్యాల్సి వచ్చింది! మగవాళ్ళ నుండి ఎంత వ్యతిరేకత! అదే, మన దేశంలో స్త్రీలు ఓటు హక్కు కోసం ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం లేక పోయింది. స్వతంత్రోద్యమంలోనూ, సంస్కరణోద్యమంలోనూ అవి భాగాలైనాయి. స్వాతంత్య్రం రావటంతో హక్కులుగా అవి రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. అయినప్పటికీ ఆ రాజ్యాంగ హక్కులను స్త్రీలు అనుభవించేట్లు చెయ్యటానికి నానా తంటాలు పడ్డాం. ఇంకా పడుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా- ముఖ్యంగా పశ్చిమ దేశాలలో- స్త్రీలు విద్యావంతులవుతున్న కొద్దీ ఆర్థిక, రాజకీయ, సామాజిక విషయాలపట్ల వారి అవగాహన పెరిగింది. 1960ల నుంచి ఫెమినిజం ప్రపంచంలోని అన్ని దేశాలకూ వ్యాపించింది. స్త్రీలు తాము జండర్ వివక్షతకు గురవుతున్నామనీ, జండర్ అనేది పుట్టుకతో సహజంగా వచ్చేది కాదనీ గ్రహించటం మొదలుపెట్టారు. స్త్రీలు ఇప్పుడున్న విధంగా తయారు కావటానికి కారణం పితృస్వామ్య మతాలు, సంస్కృతి, రాజకీయ, ఆర్థిక, కుటుంబ వ్యవస్థలని గుర్తించారు. వీటి గురంచి విస్తృతంగా అధ్యయనం, పరిశోధన చేస్తున్నారు. ఇంత విస్తృత పునాది, స్థాయి కలిగిన ఫెమినిజాన్ని అస్తిత్వవాదంగా భావించడం సరికాదు. భారతదేశంలో, అందులోనూ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫెమినిజాన్ని దృష్టిలో పెట్టుకుని దాని పని అయిపోయిందని సాధారణీకరించటం సరికాదు. 1990 నుండి ఫెమినిజం ప్రభావం తగ్గింది. కాని అంతరించిపోలేదు. ఆలోచనా విధానంలో ఆధునికాంతర వాదం, ఆర్థిక విధానాలలో సరళీకృత ఆర్థిక విధానాలు ఫెమినిస్ట్ ప్రభావాన్ని కాస్త మసకబార్చాయి. గతంలో అనేక కష్ట నష్టాల కోర్చి స్త్రీలు చేసిన పోరాటాల ఫలితంగా ఈ దశలో స్త్రీలు ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత ఉద్యోగాలు చేపట్ట గలిగారు. కొత్తగా వచ్చిన ఆర్థిక, సామాజిక స్వేచ్ఛ, ఇంటర్నెట్ వల్ల కలిగిన భావ ప్రకటన సౌలభ్యం మూడవ తరానికి (Third w ave) చెందిన ఆడపిల్లల్ని తమ మూలాలు మర్చిపోయేట్లు చేశాయి. మొదటి తరం, రెండవ తరం ఫెమినిస్టులు ఏ విలువలనైతే విమర్శిస్తూ వచ్చారో (ఉదాహరణకు విశ్వసుందరి పోటీలు) వాటిని వీళ్ళు సమర్థించారు. ఆడవాళ్ళు ఎట్లా ఉండాలో, ఎట్లా ఆలోచించాలో ఫెమినిస్టులు చెప్పనక్కర్లేదనీ, జండర్ సమానత్వం సాధించబడింది కనుక స్త్రీల హక్కుల గురించి చర్చ అవసరం లేదనీ వాదించారు. ఇటువంటి వాదనలకు మీడియా అధిక ప్రాధాన్యతనిచ్చి దీన్ని పోస్టు ఫెమినిజంగా ప్రచారం చేసింది. కార్పొరేట్ శక్తులు, మీడియా ఎంత ప్రయత్నించినా ఫెమినిజాన్ని అణచివేయటం సాధ్యం కాలేదు. తాత్కాలికంగా ఉద్యమ బాట నుండి జండర్ లేక విమెన్స్ స్టడీస్ పేరుతో ఎకాడమీ బాట పట్టింది. అక్కడ అన్ని రకాల సామాజిక, జీవ, మనస్తత్వ శాస్త్రాల పరిధి నుండి మానవ జీవితాన్ని అధ్యయనం చేస్తున్నది. ఆర్థిక, సామాజిక అసమానతలన్నింటినీ గుర్తిస్తున్నది. వాటిని రూపు మాపే విధానాలను అన్వేషిస్తున్నది. పరిశోధనకు అంతగా ప్రాముఖ్యతనివ్వని మనదేశంలాంటి చోట్ల మాత్రం ఫెమినిజం సాహిత్యానికీ, సాహిత్య విమర్శకూ పరిమితమైంది. ఎకాడమీలో బలం పుంజుకొని నాలుగవ తరం (Fouth w ave) ఫెమినిజంగా ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమవుతోంది ఫెమినిజం. ఫెమినిస్ట్ ఐక్యత(Fem inist solidarity) దిశగా అడుగులు వేస్తూ మరింత బలంగా ముందుకు వస్తోంది. ఉప్పెనలా ఈ ప్రపంచాన్ని ముంచి, పితృస్వామ్య మురికిని సమూలంగా వదలగొట్టి, కొత్త రూపుతో సుందరమైన నూతన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. అటువంటి ప్రపంచం కోసం స్త్రీ పురుషులందరూ కృషి చెయ్యాలి. రచయిత: ఫెమినిస్ట్ ప్రసాద్ 9849828797