నెత్తుటి ముద్దల రక్త నినాదం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేకం
మహారాష్ట్రలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి పక్కన మురికి కాలువలో19 ఆడశిశువుల పిండాలు బయటపడడంతో దేశం దిగ్భ్రాంతికి గురైంది.
మేం రక్తపు ముద్దలుగా కూడా మిగలకూడదు. మెత్తటి పురిటి గుడ్డులమైన మా నోట్లో వడ్ల గింజ కరుకుదనాన్ని సైతం తట్టుకొని ఇంకా బతుకుతామేమోననే మీకు భయం. చెత్తకుప్పలో విసిరిన మా దేహాలు తిరిగి ప్రాణం పోసుకుంటాయేమోనని భయం. ఎన్నటికైనా మీ హత్యాకాండకు బలైన బాలికల లెక్కలు కడతారేమోనని భయం. గొంతునులిమి చంపేస్తే గొంతు పెగలని గోడల్ని సైతం బద్దలు కొట్టుకొని ఎపుడో ఒకపుడు నిజాలు బయటపడతాయేమోనని అంతులేని భయం. అందుకే మా రక్తపు ముద్దల్ని చిదిమేసి డ్రైనేజీల్లో కలిపేసారు. మురికినీటి కాల్వలే ఆడబిడ్డల నెత్తుటి ప్రవాహాలయ్యాయిప్పుడు. ఇంత జరుగుతున్నా ఎందుకీ నిశ్శబ్దం? మా ఉనికే ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?
ప్రతి యేటా లక్షలాది మంది కనులైనా తెరవకుండానే కాటికి చేరుతున్న నెత్తుటి ముద్దల రక్తనినాదం ఇది. ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నా కొత్త లోకపు చిన్ని తల్లుల్ని కోల్పోతున్న దౌర్భాగ్యం ఇది. మహారాష్ట్రలో... ఒక ప్రైవేటు ఆసుపత్రికి సమీపంలోని మురికి నీటి కాల్వలో రెండు రోజుల క్రితం 19 ఆడ శిశు పిండాలు పైకి తేలాయి! మొత్తం దేశమంతా ఉలిక్కిపడింది. నిజానికి ఇది ఒక్క ఆసుపత్రే. మొత్తం దేశంలోనైతే ప్రతి ఏటా రెండు కోట్ల మంది స్త్రీలు అత్యంత ప్రమాదకరమైన ‘అన్‌సేఫ్ అబార్షన్స్’ పాలిటపడుతున్నారని లెక్కలు తేలాయి. అవన్నీ కచ్చితంగా చిన్నితల్లుల దేహాలేనని చెప్పక తప్పదు. అలాగని స్త్రీల పునరుత్పత్తి హక్కులను కాలరాసే మూలాలను వెతక్కండి. ఆ పాపం అమ్మది కాదు. కానేరదు. చిన్నారుల చిర్నవ్వుల్ని చిత్రవధ చేసి చంపేస్తుంటే మీరెవ్వరూ అడక్కండి. ఎందుకంటే కోటి ఆశల కలలతో పుట్టే బిడ్డకోసం వేయికళ్లతో ఎదురుచూసే అమ్మకు ఈ సమాజాన్ని ప్రశ్నించే అవకాశమే లేదు.
అడిగే హక్కు అంతకన్నాలేదు. అమ్మ ప్రమేయమే లేకుండా హతమౌతోన్న ఆడబిడ్డల ఆర్తనాదాలు తరాలుగా అమ్మ గుండెల్ని చీల్చేస్తున్నాయి. పురిటినొప్పులను పంటిబిగువున అదిమిపట్టి, చిన్నితల్లిని కొత్తలోకంలోకి ఆహ్వనించే అమ్మ అంగీకారమిక్కడెవ్వరికీ అక్కరలేదు. చివరకు ఆమె ప్రమేయమే లేకుండానే, ఆమెనుంచి వేరుచేసి పుట్టకుండానే నెత్తుటి గడ్డలైన పసిగుడ్లను డ్రైనేజీల్లోనూ, టాయ్‌లñ ట్ తూముల్లోనూ తోసేస్తోన్న సమాజాన్ని ప్రశ్నించడం మనం ఎప్పుడో మర్చిపోవడం అత్యంత విషాదం. తాజాగా పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మైసల్ గ్రామంలో భారతి అనే ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు ఆడపిల్లల భ్రూణహత్యలకు పాల్పడి దేశం యావత్తు సిగ్గుతో తల వంచుకునేలా చేసాడు! డాక్టర్ కిడ్రాపూరే, ఆయన భార్యతో కలిసి ఇటువంటి ఘాతుకాలకు పాల్పడినట్టు పోలీసుల పరిశోధనలో తేలింది. 26 సంవత్సరాల వయస్సు కలిగిన స్వాతి అనే మహిళ మరణంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిజానికి డాక్టర్ పూరే నిపుణుడైన డాక్టర్ కాదు. ఆపరేషన్లు చేసే అర్హతే ఆయనకు లేదు. కేవలం హోమియోపతి బ్యాచులర్ డిగ్రీ మాత్రమే అతని అర్హత. పుట్టబోయేది ఆడబిడ్డేనని తెలిసి స్వాతి భర్త, అత్తమామలతో కలిసి ఈ బలవంతమైన అబార్షన్‌కి పూనుకోవడంతో స్వాతి ప్రాణాలు కోల్పోయింది. స్వాతి తల్లిదండ్రులు, బంధువులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆలస్యంగానైనా స్పందించి విచారణ చేపట్టారు.
ఆ ఆసుపత్రి వెనకనే ఉన్న మురికి కాల్వలో మరికొన్ని (పైన చెప్పుకున్న 19) ఆడపిల్లల పిండాలు బయటపడటంతో అక్కడ జరుగుతోన్న ఘాతుకం ప్రపంచానికి తెలిసింది. మహారాష్ట్రలోని మరో ప్రాంతమైన బీడ్‌లో కూడా ఇలాంటిదే ఘాతుకం వెలుగుచూసింది. లేక్ లడ్కీ అభియాన్ అనే సంస్థ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా డాక్టర్ సుధాం ముండే, డాక్టర్ సరస్వతీ ముండే చేసిన పరిశోధనల ఈ ఆడపిల్లల భ్రూణ హత్యల ఘోరాలు వెలుగులోనికి వచ్చాయి. రాజస్థాన్‌లో కూడా ఇటువంటి అబార్షన్ రాకెట్ ఒకటి ఇటీవలే బయటపడింది. రాజస్థాన్‌కి చెందిన డాక్టర్ మహమ్మద్ నియాజ్ ఇటువంటి అక్రమమైన అబార్షన్ల కేసులో అరెస్టయ్యాడు. ప్రతి అబార్షన్‌కు దాదాపు 60 వేల రూపాయల చొప్పున అక్కడి డాక్టర్లు వసూలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ సంఘటనలు కేవలం ఈ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, బీహార్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను కూడా కుదిపేసాయి. అమెరికాలోని గుట్టుమచార్ ఇనిస్టిట్యూట్ జరిపిన సర్వేలో భారతదేశంలో దాదాపు ప్రతియేడాది 12 లక్షల 40 వేల అబార్షన్లు జరుగుతున్నట్టు తేలింది.
రక్షణలేని(అన్‌సేఫ్) అబార్షన్లన్నీ కేవలం ఆడపిల్లల భ్రూణహత్యలేనన్న నిజాన్ని సాంగ్లీ ఘటనతో సహా చాలా సందర్భాల్లో తేలింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి భ్రూణ హత్యలు జరిగినట్టు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తేల్చాయి. అదేవిధంగా ఆడపిల్లల భ్రూణ హత్యలను నివారించే (పిసిపిఎన్డిటి) ప్రికన్సెప్షన్ అండ్ ప్రినాటల్ డైగ్నోస్టిక్ టెక్నిక్స్ (ప్రొబేషన్ ఆఫ్ సెక్స్ సెలక్షన్)యాక్ట్ ఉన్నా లేనట్టేనా అనే అనుమానం కలుగుతోంది. పాలకుల నిర్లక్ష్యం, వైద్యుల ధనదాహం, మొత్తంగా పురుషాధిపత్య భావజాలం ఆడపిల్లల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది.
– అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, ‘సాక్షి