పోస్టుల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి
– పశుసంవర్ధకశాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
కర్నూలు(అగ్రికల్చర్): పశువైద్యశాలల్లో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్లు, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.నాగేష్‌బాబు అన్నారు. బుధవారం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కె.రాజగోపాల్‌తో కలిసి జిల్లా పశుసంవర్థక శాఖ అధికారుల సంఘ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో 50 శాతంపైగా పోస్టులు ఖాళీగా ఉండటంతో పశువైద్యం భారమవుతోందన్నారు. మంజూరు చేసిన కొత్త పోస్టులను పదోన్నతులతో భర్తీ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పశువుల ఆసుపత్రుల నిర్వహణకు మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేడీ సుదర్శన్‌కుమార్, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని ఏడీలు సీవీ రమణయ్య, జీవీ రమణ, వెంకటేశ్వర్లు, పి.రమణయ్య, గొర్రెల విభాగం ఏడీ చంద్రశేఖర్, ఏడీలు విజేయుడు, హమీర్‌పాషా, వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు.