The financial sector
-
మౌలిక పరిశ్రమల దారుణ పతనం
ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్... ద్రవ్యలోటు... విదేశీ రుణ భారం... ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి సోమవారం వెలువడిన లెక్కలన్నీ ఆర్థిక విశ్లేషకులకు నిరాశ కలిగిస్తున్నాయి. ఆయా అంశాలను పరిశీలిస్తే... న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం గ్రూప్ ఆగస్టులో దారుణ పనితనాన్ని ప్రదర్శించింది. ఆగస్టులో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా –0.5 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలతో పోల్చి (సంబంధిత నెల్లో వృద్ధి 4.7 శాతం) ఈ గ్రూప్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా, క్షీణతలోకి జారిందన్నమాట. గడచిన మూడు సంవత్సరాల్లో (2015 నవంబర్‌లో –1.3 శాతం తరువాత) ఇలాంటి స్థితిని (క్షీణత) చూడ్డం ఇదే తొలిసారి. మొత్తం ఎనిమిది పరిశ్రమల్లో ఐదు క్షీణతను చూడ్డం మరో ప్రతికూలాంశం. సోమవారం విడుదలైన గణాంకాలను పరిశీలిస్తే.. బొగ్గు: 2.4%(2018 ఆగస్టు) వృద్ధి తాజా సమీక్షా నెలలో (2019 ఆగస్టు) –8.6%కి క్షీణించింది. క్రూడ్ ఆయిల్: మరింత క్షీణతలోకి జారింది. –3.7 శాతం నుంచి –5.4 శాతానికి పడింది. సహజ వాయువు: 1 శాతం వృద్ధి రేటు నుంచి –3.9 శాతం క్షీణతలోకి పడిపోయింది. సిమెంట్: ఈ రంగంలో ఆగస్టులో –4.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఇదే నెల్లో ఈ రంగం భారీగా 14.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. విద్యుత్: 7.6 శాతం వృద్ధి రేటు –2.9 శాతం క్షీణతలోకి పడిపోయింది. రిఫైనరీ ప్రొడక్టులు: ఈ రంగంలో వృద్ధి 2.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలల్లో ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది. స్టీల్: ఈ రంగంలో వృద్ధిరేటు 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. ఎరువులు: ఈ రంగంలో క్షీణ రేటు వృద్ధిలోకి మారడం గమనార్హం. 2019 ఆగస్టులో వృద్ధి రేటు 2.9% నమోదయ్యింది. అయితే 2018 ఇదే నెల్లో వృద్ధిలేకపోగా –5.3% క్షీణత నమోదయ్యింది. ఐదు నెలల్లోనూ పేలవమే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 2.4 శాతంగా ఉంది. అయితే 2018 ఇదే నెలలో ఈ వృద్ధిరేటు 5.7 శాతం. ఐఐపీపై ప్రభావం... పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల వాటా దాదాపు 38%. ఆగస్టులో ఐఐపీ గ్రూప్ పనితీరుపై తాజా ఎనిమిది పరిశ్రమల గ్రూప్ ఫలితాల ప్రతికూల ప్రభావం ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. అక్టోబర్ 2వ వారంలో ఐఐపీ ఆగస్టు ఫలితాలు వెల్లడికానున్నాయి. జూలైలో ఐఐపీ (4.3%) కొంత మెరుగైన ఫలితాన్ని ఇచి్చనప్పటికీ, ఇది రికవరీకి సంకేతం కాదని తాజా (ఆగస్టు మౌలిక రంగం గ్రూప్) గణాంకాలు సూచిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
వృద్ధి పరుగే ప్రధాన లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, డీమోనిటైజేషన్ (నోట్ల రద్దు) తాలూకు ప్రభావం ఆర్థిక రంగంపై లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు చెప్పారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎదురైన ప్రశ్నలకు ఆమె స్పందించారు. తయారీ రంగంలో కొంత క్షీణత ఉందని, అయితే, ఇది నోట్ల రద్దు వల్ల కాదన్నారు. ప్రభుత్వ ఎజెండాలో ఆర్థిక వృద్ధి ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందని చెప్పారు. జీడీపీ వృద్ధి పెంపు కోసం ఎన్నో రంగాల్లో సంస్కరణలను చేపట్టడం జరుగుతోందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మోస్తరుగా ఉండడానికి వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాణిజ్యం, హోటల్, రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్, ప్రసార సేవల రంగాల్లో వృద్ధి తక్కువగా ఉండడమేనని చెప్పారు. ‘‘ముఖ్యంగా కొన్ని రంగాల్లో తక్కువ వృద్ధి ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవల్లో ఈ పరిస్థితి నెలకొంది’’ అని మంత్రి వివరించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోయిందని, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలను కూడా అమల్లో పెట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో సభ్యుని ఆందోళనను అర్థం చేసుకోగలనన్నారు. అయినా కానీ, ఇప్పటికీ భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉన్నట్టు చెప్పారు. అమెరికా వృద్ధి రేటు 2016–2019 మధ్య 1.6 శాతం నుంచి 2.3 శాతం మధ్య ఉంటే, చైనా వృద్ధి 6.7 శాతం నుంచి 6.3 శాతానికి పడిపోయిందని, కానీ, దేశ వృద్ధి రేటు 7 శాతానికి పైనే ఉన్నట్టు చెప్పారు. రైతులందరికీ ఆదాయం... కిసాన్ సమ్మాన్ యోజన, పెన్షన్ యోజన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మోదీ సర్కారు రెండో విడత పాలనలో చేపట్టిన కీలక సంస్కరణ... పీఎం కిసాన్ యోజన కింద రైతులందరికీ రూ.6,000 చొప్పున ఆదాయం అందించనున్నట్టు చెప్పారు. గతంలో ఇది రెండు హెక్టార్ల రైతులకే పరిమితం చేశారు. దీనికి తోడు చిన్న, సన్నకారు రైతులు, చిన్న వర్తకులకు స్వచ్ఛంద పెన్షన్ పథకాన్ని కూడా తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. వృద్ధి విషయమై మరింత దృష్టి పెట్టేందుకు ప్రధాని అద్యక్షతన ఐదుగురు సభ్యులతో పెట్టుబడులు, వృద్ధిపై కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీఎస్టీ, ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం సహా పూర్వపు ఐదేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణలను కూడా మంత్రి గుర్తు చేశారు. నోట్ల రద్దుతో సానుకూల ఫలితాలు రూ.500, రూ.1,000 నోట్ల డీమోనిటైజేషన్ వల్ల సానుకూల ఫలితాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. అక్రమ ధనం ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధుల సాయంగా వెళ్లేదని, నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదుల వద్ద ఉన్న డబ్బంతా పనికిరాకుండా పోయిందన్నారు. అలాగే, డిజిటల్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయన్నారు. బ్యాంకు మోసాలు తగ్గాయి బ్యాంకుల్లో రూ.లక్ష., అంతకుమించిన మోసాలు 2018–19లో 6,735 తగ్గినట్టు మంత్రి చెప్పారు. ఈ మోసాల వల్ల పడిన ప్రభావం రూ.2,836 కోట్లుగా ఉంటుందన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2017–18లో 9,866 మోసం కేసులు (రూ.4,228 కోట్లు) నమోదైనట్టు తెలిపారు. -
6 నెలల్లో మరిన్ని సంస్కరణలు
న్యూఢిల్లీ: దేశం మళ్లీ అధిక వృద్ధిబాట పట్టే దిశగా వచ్చే ఆరు నెలల్లో క్యాపిటల్ మార్కెట్లు, ఆర్థిక రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. వచ్చే ఏడాది వృద్ధి రేటు 6 శాతానికి పెరగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను సరళీకరించడం, ప్రాజెక్టులకు ఆటంకాలను తొలగించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆర్థిక అంశాలపై శుక్రవారం జరిగిన ఒక సదస్సులో చిదంబరం తెలిపారు. ‘నేను చేయాల్సిన పనులకు సంబంధించి పెద్ద చిట్టా ఉంది. దాన్ని రోజూ ఫాలో చేస్తుంటాను. క్యాపిటల్ మార్కెట్లను, ఆర్థిక రంగాన్ని సరళీకరించాలి.. గ్యాస్, చమురు ధరల సమస్యలను పరిష్కరించాలి. మరింత బొగ్గు ఉత్పత్తి చేసే దిశగా బొగ్గు రంగంలో కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాం. నిల్చిపోయిన ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పెట్టుబడుల క్యాబినెట్ కమిటీ మరిన్ని సార్లు భేటీ కానుంది. ఇలా చేయాల్సినవి చాలా ఉన్నాయి.. వీటన్నింటినీ కచ్చితంగా చేస్తాం’ అంటూ ఆయన వివరించారు. ఒత్తిడి అధిగమించ గలం.. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల తరహాలోనే భారత ఎకానమీ కూడా ఒత్తిడిలో ఉందని, అయితే దీన్ని కచ్చితంగా అధిగమించగలమని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. 2014-15లో వృద్ధి రేటు 6 శాతానికి చేరువలో ఉండగలదని, రెండేళ్ల వ్యవధిలో మరింత మెరుగుపడి 8 శాతానికి పెరగగలదని పేర్కొన్నారు. 2012-13లో ఎకానమీ వృద్ధి పదేళ్ల కనిష్టమైన 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ వృద్ధి..నాలుగేళ్ల కనిష్టమైన 4.4 శాతంగా ఉండటాన్ని ప్రస్తావించిన చిదంబరం ఇది నిరాశపర్చిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పటడుగులు వేయకుండా ఆర్థిక క్రమశిక్షణ బాటలో ముందుకు సాగాల్సి ఉంటుందని చిదంబరం చెప్పారు. పెట్టుబడులపై నిర్ణయాలను వేగవంతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అధిక వృద్ధికి బాటలు వేయగలవని పేర్కొన్నారు. భారత్‌పై ఇన్వెస్టర్ల అభిప్రాయం క్రమంగా మారుతోందన్నారు. పరిశ్రమ వర్గాలు ఓపిక పట్టాలి.. ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం చివరి రోజు వరకూ పాటుపడతామని చిదంబరం చెప్పారు. సరైన నిర్ణయం తీసుకున్నామా లేదా అన్నది ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఫలితాలను చూసే దాకా పరిశ్రమ వర్గాలు ఓపిక పట్టాలని పేర్కొన్నారు.