కవిత్వమే ఊపిరిగా బతికిన ప్రజాకవి
నేడు ‘అద్దేపల్లి’ ప్రథమ వర్ధంతి ∙
22న ‘అల్లూరి వీరగాథ’ ఆవిష్కరణ
కాకినాడ కల్చరల్ (కాకినాడ సిటీ):
కవిత్వమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి అద్దేపల్లి రామ్మోహనరావు. తన సుదీర్ఘ సాహిత్య ప్రస్థానంలో అభ్యుదయ భావాలకు పట్టం కట్టిన ఆయన గత ఏడాది జనవరి 13న తుదిశ్వాస విడిచారు. చివరిగా ఆయన చేతినుంచి జాలువారిన ‘అల్లూరి సీతారామరాజు వీరగాథ’ కావ్యం(వచన కవిత)ను ఈనెల 22న స్థానిక రోటరీ క్లబ్లో జరగనున్న అద్దేపల్లి ప్రథమ వర్ధంతి సభలో ఆవిష్కరించనున్నారు. ‘నిరంతర సాహితీ సంచారి’గా పేరొందిన అద్దేపల్లి 1936లో సెప్టెంబరు 6న మచిలీపట్నంలో అద్దేపల్లి సుందరరావు, రాజరాజేశ్వరి దంపతులకు జన్మించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు చదివి, మచిలీ పట్నం, నందిగామలలో అధ్యాపకునిగా పనిచేసారు. తదుపరి 1972లో కాకినాడలోని మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీస్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా చేరిన ఆయనకు ఈ నగరమే శాశ్వత నివాసం అయింది. కవిగా, విమర్శకునిగా, వక్తగా, కవిత్వ కార్యకర్తగా రాష్ట్రం అంతా పర్యటించి వందలాది యువకవుల్ని తయారు చేశారు. ‘మధుజ్వాల, అంతరŠాజ్వల, రక్తసంధ్య, అయినా ధైర్యంగానే, పొగచూరిన ఆకాశం, గోదావరి నా ప్రతిబింబం’ మొదలైన ఎన్నో కవితా సంకలనాలు వెలువరించారు. నిరంతరం ముఖంలో చెదరని చిరునవ్వు, వినూత్నమైన హెయిర్ స్టైల్, ఇ¯ŒSషర్ట్లతో కనిపించే ఆయన సాహితీ లోకానికి సుపరిచితుడు. సాహిత్య లోకానికి ఆయన ఒక సంచార గ్రంథాలయం. మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’పై అద్దేపల్లి రాసిన విమర్మనాగ్రంథం సంచలనం సృష్టించింది. తెలుగు సాహిత్యంలో వచ్చిన అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాదం, ప్రపంచీకరణ మొదలైన అన్ని అంశాల మీదా, నాటి సమకాలీన పరిస్థితులపైనా విమర్శకునిగా వందలాది వ్యాసాలను రచించారు. కవిత్వంలో ప్రతిష్టాత్మకమైన చిన్నప్పరెడ్డి పురస్కారం, నాగభైరవ అవార్డు లాంటి ఎన్నో గౌరవాలు అందుకున్నారు. దాదాపు వెయ్యిమంది నూతన కవుల సంకలనాలకు ముందుమాటలు రాసి ప్రోత్సహించారు. నిరంతరం రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో జరిగే సాహిత్య సభలలో సైతం పాల్గొని కవిత్వాన్ని ప్రచారం చేశారు.