ప్రథమార్ధంలోనే రూ. 3.6 లక్షల కోటు
బాండ్లతో ప్రభుత్వం రుణ సమీకరణ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బాండ్ల ద్వారా దాదాపు రూ. 3.6 లక్షల కోట్ల రుణం సమీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 6 లక్షల కోట్లు సమీకరించాలంటూ ప్రభుత్వం నిర్దేశించుకున్న దాంట్లో ఇది దాదాపు 60 శాతం మొత్తం. వ్యయాల నిర్వహణ, గతంలో తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపునకు ఈ మొత్తం ఉపయోగపడగలదని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి చెప్పారు.
ఏప్రిల్లోనే రూ. 64,000 కోట్లు సమీకరించనున్నట్లు ఆయన వివరించారు. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రతి వారం రూ. 14,000-16,000 కోట్లు బాండ్ల ద్వారా ప్రభుత్వం సమకూర్చుకుంటుందని మహర్షి తెలిపారు. ఒకవైపు ప్రభుత్వమే భారీగా రుణాలు సమీకరిస్తుండటం.. కార్పొరేట్ డెట్ మార్కెట్ వృద్ధికి విఘాతం కలిగిస్తోందంటూ ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసిన రోజే కేంద్రం నిధుల సమీకరణ ప్రకటన వెలువడటం గమనార్హం.