First T-20 match
-
South Africa vs India: సఫారీ గడ్డపై సమరానికి సై
దాదాపు ఐదు నెలల క్రితం... టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ మ్యాచ్ తర్వాత ఇరు జట్లు మరోసారి ఇదే ఫార్మాట్లో పోరుకు సిద్ధమయ్యాయి. వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమికి ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో మ్యాచ్‌ను ప్రతీకార సమరంగా చూడలేం. పైగా నాటి మ్యాచ్ ఆడిన టీమ్ నుంచి ఇరు జట్లలో పలు మార్పులు జరిగాయి. అయితే తర్వాతి టి20 వరల్డ్‌కప్ కోసం కొత్త జట్లను తయారు చేసే ప్రణాళికల్లో భాగంగా ఇరు జట్లూ సన్నద్ధమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ టి20 సమరానికి రంగం సిద్ధమైంది. డర్బన్: స్వదేశంలో ఐదు రోజుల క్రితమే టెస్టు సిరీస్‌లో చిత్తయిన భారత్ ఇప్పుడు విదేశీ గడ్డపై టి20 ఫార్మాట్లో సత్తా చాటేందుకు ‘సై’ అంటోంది. అయితే టెస్టు సిరీస్ ఆడిన వారిలో ఒక్క ఆటగాడు కూడా లేకుండా బరిలోకి దిగుతుండటంతో టీమిండియాపై ఈ ఓటమి భారం లేదు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాను తొలి టి20 మ్యాచ్‌లో భారత్ ఎదుర్కోనుంది. సఫారీ జట్టు పరిస్థితి చూస్తే వరల్డ్‌కప్ ఓటమి నుంచి ఇంకా కోలుకున్నట్లుగా లేదు. ఆ తర్వాత టి20ల్లోనే విండీస్ చేతిలో 0–3తో ఓడిన జట్టు ఐర్లాండ్‌తో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఇప్పుడు స్వదేశంలోనైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చి సిరీస్ గెలుచుకోవాలని జట్టు ఆశిస్తోంది. సుస్థిర స్థానం కోసం... సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను టి20 సిరీస్‌లో 3–0తో ఓడించిన భారత యువ జట్టు ఉత్సాహంతో ఉంది. సూర్యకుమార్ నాయకత్వంలో ఈ టీమ్ అన్ని విధాలా బలంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన సంజూ సామ్సన్ అదే జోరును ఇక్కడా కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. యశస్వి, గిల్వంటి రెగ్యులర్ ఓపెనర్లు మళ్లీ వచ్చినా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అతను భావిస్తున్నాడు. రెండో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. జింబాబ్వేపై 36 బంతుల్లోనే శతకం బాదినా... మిగిలిన ఆరు ఇన్నింగ్స్‌లలో అతను ఒక్కసారి కూడా 20 పరుగులు దాటలేదు. ఇటీవల ఎమర్జింగ్ కప్‌లో భారత టాప్‌స్కోరర్‌గా నిలిచిన అభిషేక్ ఇక్కడ రాణించడం అవసరం. సూర్య, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌లతో మన బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కూడా తనను తాను మళ్లీ నిరూపించుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో మంచి ప్రదర్శనలే వచ్చినా... ఆ తర్వాత చోటు కోల్పోయి ఇటీవలే మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఎమర్జింగ్ కప్‌లో కెప్టెన్ హోదాలో ఆడిన తిలక్ 4 ఇన్నింగ్స్‌లలో 117 పరుగులే చేయగలిగాడు. మిడిలార్డర్లో పోటీ పెరిగిన నేపథ్యంలో రెగ్యులర్‌గా మారాలంటే తిలక్ మంచి స్కోర్లు సాధించాల్సి ఉంది. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డర్ అయిన రమణ్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మెరుపు ప్రదర్శనతో ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్, ఐపీఎల్లో కేకేఆర్ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను ఎమర్జింగ్ టోర్నీలోనూ రాణించాడు. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడైన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ను నడిపిస్తుండగా...అవేశ్‌కు రెండో పేసర్‌గా అవకాశం దక్కవచ్చు. హిట్టర్లు వచ్చేశారు... వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ మళ్లీ ఇప్పుడే మైదానంలోకి దిగుతున్నారు. వీరిద్దరి రాకతో పాటు మరో దూకుడైన ప్లేయర్ స్టబ్స్‌తో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ పటిష్టంగా మారింది. ప్రపంచకప్ ఆడిన డికాక్, రబడ, నోర్జే ఈ సిరీస్‌కు అందుబాటులో లేకపోయినా... గాయాల నుంచి కోలుకున్న జాన్సెన్, కొయెట్జీ పునరాగమనం చేయడంతో టీమ్ మెరుగ్గా కనిపిస్తోంది. ఓపెనర్లుగా అనుభవజ్ఞుడైన హెన్డ్రిక్స్తో పాటు రికెల్టన్ శుభారంభం ఇవ్వాలని టీమ్ ఆశిస్తోంది. ఇద్దరు కొత్త ఆటగాళ్లు సిమ్‌లేన్, ఎన్ఖబయోమ్జి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టనున్నారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ టీమ్‌ను కలవరపరుస్తోంది. ఈ ఏడాది ఆడిన 14 ఇన్నింగ్స్‌లలో మార్క్రమ్ ఒకే ఒక్కసారి 25 పరుగుల స్కోరు దాటగలిగాడు. ఈ సిరీస్ ద్వారా ఫామ్‌లోకి వస్తానని అతను చెబుతున్నాడు. ఐపీఎల్ వేలానికి ముందు భారత జట్టుపై రాణించడం ద్వారా తమ సత్తాను ప్రపంచానికి చూపించేందుకు సఫారీ ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం. ఒక్క క్లాసెన్ మినహా మిగతా వారందరూ వేలంలోకి రానున్నారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, తిలక్, పాండ్యా, రింకూ, రమణ్‌దీప్, అక్షర్, అవేశ్, అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెపె్టన్), హెన్డ్రిక్స్, రికెల్టన్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సిమ్‌లేన్, ఎన్ఖబయోమ్జి, కేశవ్, బార్ట్‌మన్.పిచ్, వాతావరణం కింగ్స్‌మీడ్ మైదానం భారీ స్కోర్లకు వేదిక. మరోసారి అదే జరిగే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ రోజు వర్షసూచన ఉంది.6: దక్షిణాఫ్రికా గడ్డపై ఇరు జట్ల మధ్య 9 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 6 మ్యాచ్‌ల్లో నెగ్గి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. -
అగర్ హ్యాట్రిక్
జొహన్నెస్‌బర్గ్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ పరాభవాన్ని మూటగట్టుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సఫారీ జట్టు 107 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దాంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు పరుగుల పరంగా టి20ల్లో ఇదే అతిపెద్ద ఓటమి. అంతేకాకుండా సఫారీ జట్టుకు టి20ల్లో ఇదే అత్యల్ప స్కోరు. తొలుత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. స్మిత్ (45; 5 ఫోర్లు, సిక్స్), ఫించ్ (42; 6 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికాను ఆసీస్ స్పిన్నర్ అగర్ (5/24) ‘హ్యాట్రిక్’తో తిప్పేయడంతో... 14.3 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. సఫారీ జట్టు ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ చివరి మూడు బంతుల్లో డు ప్లెసిస్, ఫెలుక్వాయో (0), స్టెయిన్ (0)లను అవుట్ చేసిన అగర్ హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో ఇది 13వ హ్యాట్రిక్కాగా... ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ అగర్. -
రోహిత్ ఫిట్: బీసీసీఐ
న్యూఢిల్లీ: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌గానే ఉన్నాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. శుక్రవారం ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఉదర భాగంలో బంతి బలంగా తాకింది. దీంతో కాసేపు విలవిలలాడిన రోహిత్ ప్రాక్టీస్ ఆపేసి అక్కడినుంచి నిష్క్రమించాడు. జట్టు ఫిజియో, వైద్యులు అతనికి చికిత్స అందజేశారు. అనంతరం వైద్యులు అతనికి అయిన గాయం సాధారణమైందేనని తేల్చారు. దీంతో తొలి టి20 మ్యాచ్‌లో అతను బరిలోకి దిగుతాడని బీసీసీఐ వెల్లడించింది. ప్రాక్టీస్ సెషన్లో సంజూ సామ్సన్ పాల్గొనలేదు. రిషభ్ పంత్ చాలాసేపు చెమటోడ్చాడు. దీంతో తుదిజట్టులో పంత్‌కే అవకాశం దక్కనుంది. ముంబై ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు ప్రాక్టీస్ సందర్భంగా హెడ్ కోచ్ రవిశాస్త్రి సలహాలిచ్చారు. -
ఢిల్లీలోనే తొలి టి20
కోల్‌కతా: ఢిల్లీ నగరాన్ని కాలుష్యం పీడిస్తున్నప్పటికీ షెడ్యూలు ప్రకారం తొలి టి20 అక్కడే జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. అయితే భవిష్యత్తులో దీపావళి తర్వాత ఢిల్లీ వేదికపై మ్యాచ్‌లు జరగకుండా చూసుకుంటామని చెప్పాడు. ఈ నెల 3న న్యూఢిల్లీలో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య మొదటి టి20 జరుగనున్న సంగతి తెలిసిందే. ‘అంతా పూర్తయ్యాక ఆఖర్లో మార్పులంటే కుదరదు. ఇప్పటికే ఢిల్లీ మ్యాచ్ కోసం టికెట్ల విక్రయం, నిర్వహణ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. కాబట్టి మ్యాచ్‌ను రద్దు చేయడం అసాధ్యం. అయితే భవిష్యత్తులో ఉత్తర భారత వేదికలపై దీపావళి తర్వాత మ్యాచ్‌లు లేకుండా చూసుకుంటాం. దీనిపై మరింత కసరత్తు చేస్తాం. ఢిల్లీతో పాటు హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని వేదికలకు మ్యాచ్‌లు కేటాయించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం’ అని గంగూలీ అన్నాడు. దీపావళి తర్వాత ఉత్తర భారత్‌లో ఎప్పుడూ ఎదురయ్యే సమస్యే ఇదని... అయితే మ్యాచ్ రోజుకల్లా పరిస్థితుల్లో మార్పు ఉంటుందని ఆశిస్తున్నట్లు దాదా చెప్పాడు. భారత తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ విపరీతమైన వాయు కాలుష్యంతో తనకెలాంటి సమస్య లేదన్నాడు. గురువారం బంగ్లా ఆటగాళ్లు మాస్క్ ధరించి నెట్ ప్రాక్టీస్ చేశారు. లిటన్ దాస్ కాసేపు మాస్క్‌తో కనిపించినప్పటికీ తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో మాత్రం మాస్క్ తీసి ఆడాడు. -
భారత్, ఆస్ట్రేలియా టి20 : విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
'కోట్లా'లో కొట్టేశారు
భారత జట్టు అద్భుత ప్రదర్శనతో చెలరేగింది. వన్డే ఫామ్‌ను టి20లకూ కొనసాగిస్తూ భారీ విజయాన్ని అందుకుంది. పదేళ్లలో ఐదుసార్లు తలపడితే ప్రతీ సారి న్యూజిలాండ్ ముందు తలవంచిన టీమిండియా ఇప్పుడు కివీస్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. జొహన్నెస్‌బర్గ్ నుంచి మొదలు పెడితే నాగపూర్ వరకు దక్కని విజయం భారత్ న్యూఢిల్లీలో అందుకుంది. బ్యాటింగ్‌లో ధావన్, రోహిత్ ద్వయం భారత్ తరఫున టి20ల్లో అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేసి తిరుగులేని స్కోరును అందిస్తే... ఆ తర్వాత మన బౌలర్లు ప్రత్యర్థి పని పట్టారు. సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో విజయాన్ని అందించి సహచరులు సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు ఘనమైన వీడ్కోలు అందించారు. మరోవైపు భారత్ విజయంతో ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ను రెండో స్థానానికి నెట్టి పాకిస్తాన్ జట్టు తొలిసారి నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన భారత జట్టు న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో బోణీ చేసింది. బుధవారం ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శిఖర్ ధావన్ (52 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (55 బంతుల్లో 80; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో చెలరేగారు. తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించిన వీరిద్దరు భారత్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. చివర్లో కోహ్లి (11 బంతుల్లో 26 నాటౌట్; 3 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడాడు. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. లాథమ్ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. భారత బౌలర్లలో అక్షర్, చహల్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నెహ్రా... తన ఆఖరి ఇన్నింగ్స్‌లో వికెట్ తీయకుండానే నిష్క్రమించాడు. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టి20 శనివారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. రికార్డు ఆరంభం... వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ జోడీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ద్వయం తొలిసారి టి20ల్లో కూడా భారీ భాగస్వామ్యంతో సత్తా చాటింది. ధావన్ ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడగా... ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రోహిత్, ఆ తర్వాత భారీ షాట్లు కొట్టాడు. మంచు కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డ న్యూజిలాండ్ ఫీల్డర్లు వీరిద్దరి క్యాచ్‌లు వదిలేయడం కూడా భారత ఓపెనర్లకు కలిసొచ్చింది. ముందుగా బౌల్ట్ బౌలింగ్‌లో 8 పరుగుల వద్ద సాన్‌ట్నర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ధావన్, ఆ తర్వాత బౌల్ట్ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి నాలుగు ఫోర్లు బాదాడు. ముఖ్యంగా స్వీప్ షాట్‌ను సమర్థంగా ఆడిన అతను పరుగులు రాబట్టాడు. మరోవైపు 16 పరుగుల వద్ద సౌతీ సునాయాస క్యాచ్ వదిలేయడంతో రెండో అవకాశం దక్కించుకున్న రోహిత్, వెంటనే మున్రో ఓవర్లో ఫోర్, సిక్స్‌తో చెలరేగాడు. సోధి బౌలింగ్‌లో వరుసగా 4, 6 కొట్టిన ధావన్ 37 బంతుల్లో కెరీర్లో మూడో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సాన్‌ట్నర్ ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన రోహిత్ 42 బంతుల్లో కెరీర్లో 12వ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. చివరకు రికార్డు భాగస్వామ్యం తర్వాత ధావన్‌ను అవుట్ చేసి... ఈ జంటను విడగొట్టిన సోధి, తర్వాతి బంతికే పాండ్యా (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రోహిత్ కూడా అవుటైనా... కోహ్లి భారీ సిక్సర్ల జోరు భారత్ స్కోరు 200 పరుగులు దాటేలా చేసింది. అంతకుముందు 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి క్యాచ్ కూడా వదిలేసి కివీస్ ఉపకారం చేసింది. తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేసిన భారత్, తర్వాత పది ఓవర్లలో ఏకంగా 122 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌తో శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. టపటపా... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ దశలోనూ న్యూజిలాండ్ కావాల్సిన పట్టుదలను ప్రదర్శించలేకపోయింది. రెండో ఓవర్లోనే స్పిన్నర్‌ను దించి భారత్ ఫలితం సాధించింది. చహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గప్టిల్ (4) హార్దిక్ పాండ్యా అత్యద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత భువనేశ్వర్ సూపర్ యార్కర్‌కు మున్రో (7) వెనుదిరిగాడు. అనంతరం విలియమ్సన్ (24 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) ఆదుకునే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. ఒక ఎండ్‌లో లాథమ్ నిలబడ్డా... మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. 16 పరుగుల వ్యవధిలో నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఇక కోలుకోలేకపోయింది. చివర్లో సాన్‌ట్నర్ (14 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడినా కివీస్ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. ఒక అవుట్... రెండు రివ్యూలు బౌల్ట్ వేసిన 19వ ఓవర్ చివరి బంతిని రోహిత్ ఆడే ప్రయత్నం చేయగా, బంతి వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. దాంతో కివీస్ అప్పీల్‌పై అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. అయితే బ్యాట్‌కు తగిలిన తర్వాత బంతి నేలను తాకి వెళ్లిందా అనేదానిపై స్పష్టత లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సహాయం కోరారు. అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి అసలు విషయం చెప్పకుండా ‘బ్యాట్ నేలకు తాకిన శబ్దం’ మాత్రమే అంటూ భారీ స్క్రీన్‌పై నాటౌట్ అని ప్రకటించేశారు కూడా. దాంతో ఆశ్చర్యపోయిన న్యూజిలాండ్ మళ్లీ ‘రివ్యూ’ కోరింది. ఈ సారి అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తగిలిందని స్పష్టంగా కనిపించడంతో రోహిత్ వెనుదిరగాల్సి వచ్చింది. -
తొలి టి20లో పాక్ గెలుపు
బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆరు వికెట్లతో గెలిచింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే 18 ఏళ్ల పాక్ యువ లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ (3/7) అదరగొట్టాడు. మొదట వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 111 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం పాకిస్తాన్ జట్టు 17.1 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసి గెలిచింది. షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
తొలి టి20లో బంగ్లాదేశ్ విజయం
ఢాకా: జింబాబ్వేతో శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 38 పరుగులకే నాలుగు వికెట్లు పడిన దశలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాలర్ (31 బంతుల్లో 68; 4 ఫోర్లు; 6 సిక్సర్లు) వేగంగా ఆడి స్కోరును ఉరకలెత్తించాడు. 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన తను జింబాబ్వే తరఫున టి20ల్లో వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన ఆటగాడయ్యాడు. మొర్తజా, అమిన్, ముస్తఫిజుర్, జుబేర్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (28 బంతుల్లో 31; 3 ఫోర్లు), మహ్ముదుల్లా (31 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. క్రెమెర్‌కు మూడు, కిసోరోకు రెండు వికెట్లు దక్కాయి.