నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టి20
రాత్రి గం.8:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
దాదాపు ఐదు నెలల క్రితం... టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ మ్యాచ్ తర్వాత ఇరు జట్లు మరోసారి ఇదే ఫార్మాట్‌లో పోరుకు సిద్ధమయ్యాయి. వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమికి ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో మ్యాచ్‌ను ప్రతీకార సమరంగా చూడలేం.
పైగా నాటి మ్యాచ్ ఆడిన టీమ్ నుంచి ఇరు జట్లలో పలు మార్పులు జరిగాయి. అయితే తర్వాతి టి20 వరల్డ్‌కప్ కోసం కొత్త జట్లను తయారు చేసే ప్రణాళికల్లో భాగంగా ఇరు జట్లూ సన్నద్ధమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ టి20 సమరానికి రంగం సిద్ధమైంది.
డర్బన్: స్వదేశంలో ఐదు రోజుల క్రితమే టెస్టు సిరీస్‌లో చిత్తయిన భారత్ ఇప్పుడు విదేశీ గడ్డపై టి20 ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు ‘సై’ అంటోంది. అయితే టెస్టు సిరీస్ ఆడిన వారిలో ఒక్క ఆటగాడు కూడా లేకుండా బరిలోకి దిగుతుండటంతో టీమిండియాపై ఈ ఓటమి భారం లేదు.
నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాను తొలి టి20 మ్యాచ్‌లో భారత్ ఎదుర్కోనుంది. సఫారీ జట్టు పరిస్థితి చూస్తే వరల్డ్‌కప్ ఓటమి నుంచి ఇంకా కోలుకున్నట్లుగా లేదు. ఆ తర్వాత టి20ల్లోనే విండీస్ చేతిలో 0–3తో ఓడిన జట్టు ఐర్లాండ్‌తో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఇప్పుడు స్వదేశంలోనైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చి సిరీస్ గెలుచుకోవాలని జట్టు ఆశిస్తోంది.
సుస్థిర స్థానం కోసం...
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను టి20 సిరీస్‌లో 3–0తో ఓడించిన భారత యువ జట్టు ఉత్సాహంతో ఉంది. సూర్యకుమార్ నాయకత్వంలో ఈ టీమ్ అన్ని విధాలా బలంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన సంజూ సామ్సన్ అదే జోరును ఇక్కడా కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. యశస్వి, గిల్‌వంటి రెగ్యులర్ ఓపెనర్లు మళ్లీ వచ్చినా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అతను భావిస్తున్నాడు.
రెండో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. జింబాబ్వేపై 36 బంతుల్లోనే శతకం బాదినా... మిగిలిన ఆరు ఇన్నింగ్స్‌లలో అతను ఒక్కసారి కూడా 20 పరుగులు దాటలేదు.
ఇటీవల ఎమర్జింగ్ కప్‌లో భారత టాప్‌స్కోరర్‌గా నిలిచిన అభిషేక్ ఇక్కడ రాణించడం అవసరం. సూర్య, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌లతో మన బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కూడా తనను తాను మళ్లీ నిరూపించుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు.
అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో మంచి ప్రదర్శనలే వచ్చినా... ఆ తర్వాత చోటు కోల్పోయి ఇటీవలే మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఎమర్జింగ్ కప్‌లో కెప్టెన్ హోదాలో ఆడిన తిలక్ 4 ఇన్నింగ్స్‌లలో 117 పరుగులే చేయగలిగాడు. మిడిలార్డర్‌లో పోటీ పెరిగిన నేపథ్యంలో రెగ్యులర్‌గా మారాలంటే తిలక్ మంచి స్కోర్లు సాధించాల్సి ఉంది.
దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డర్ అయిన రమణ్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మెరుపు ప్రదర్శనతో ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్, ఐపీఎల్‌లో కేకేఆర్ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను ఎమర్జింగ్ టోర్నీలోనూ రాణించాడు. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడైన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ను నడిపిస్తుండగా...అవేశ్‌కు రెండో పేసర్‌గా అవకాశం దక్కవచ్చు.
హిట్టర్లు వచ్చేశారు...
వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ మళ్లీ ఇప్పుడే మైదానంలోకి దిగుతున్నారు. వీరిద్దరి రాకతో పాటు మరో దూకుడైన ప్లేయర్ స్టబ్స్‌తో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ పటిష్టంగా మారింది. ప్రపంచకప్ ఆడిన డికాక్, రబడ, నోర్జే ఈ సిరీస్‌కు అందుబాటులో లేకపోయినా... గాయాల నుంచి కోలుకున్న జాన్సెన్, కొయెట్జీ పునరాగమనం చేయడంతో టీమ్ మెరుగ్గా కనిపిస్తోంది.
ఓపెనర్లుగా అనుభవజ్ఞుడైన హెన్‌డ్రిక్స్‌తో పాటు రికెల్టన్ శుభారంభం ఇవ్వాలని టీమ్ ఆశిస్తోంది. ఇద్దరు కొత్త ఆటగాళ్లు సిమ్‌లేన్, ఎన్‌ఖబయోమ్జి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టనున్నారు. అయితే కెప్టెన్ మార్క్‌రమ్ ఫామ్ టీమ్‌ను కలవరపరుస్తోంది. ఈ ఏడాది ఆడిన 14 ఇన్నింగ్స్‌లలో మార్క్‌రమ్ ఒకే ఒక్కసారి 25 పరుగుల స్కోరు దాటగలిగాడు.
ఈ సిరీస్ ద్వారా ఫామ్‌లోకి వస్తానని అతను చెబుతున్నాడు. ఐపీఎల్ వేలానికి ముందు భారత జట్టుపై రాణించడం ద్వారా తమ సత్తాను ప్రపంచానికి చూపించేందుకు సఫారీ ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం. ఒక్క క్లాసెన్ మినహా మిగతా వారందరూ వేలంలోకి రానున్నారు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, తిలక్, పాండ్యా, రింకూ, రమణ్‌దీప్, అక్షర్, అవేశ్, అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెపె్టన్), హెన్‌డ్రిక్స్, రికెల్టన్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సిమ్‌లేన్, ఎన్‌ఖబయోమ్జి, కేశవ్, బార్ట్‌మన్.
పిచ్, వాతావరణం
కింగ్స్‌మీడ్ మైదానం భారీ స్కోర్లకు వేదిక. మరోసారి అదే జరిగే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ రోజు వర్షసూచన ఉంది.
6: దక్షిణాఫ్రికా గడ్డపై ఇరు జట్ల మధ్య 9 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 6 మ్యాచ్‌ల్లో నెగ్గి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment