జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఆఖరి టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.
తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజూ శాంసన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని సూర్య చెప్పుకొచ్చాడు.
వారిద్దరూ అద్బుతం: సూర్య
"పరిస్థితులకు అనుగుణంగా మారి ఆడటంలో ఎటువంటి రహస్యం లేదు. మేము డర్బన్‌లో అడుగుపెట్టిన వెంటనే మా ప్రణాళికలను సిద్దం చేసుకున్నాము. మేము గతంలో దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడు ఎలా ఆడామో ఈ సారి కూడా అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాము.
ఫలితాలు గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇద్దరిలో ఎవరిది గొప్ప నాక్ అని ఎంచుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. వారిద్దరితో పాటు అభిషేక్ కూడా తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.
ఉష్ణోగ్రత తగ్గిన అనంతరం బౌలింగ్‌కు అనుకూలిస్తుందని భావించాం. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చని మా బౌలర్లకు చెప్పారు. అందుకు తగ్గట్టే వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము ఇక్కడే మా తదుపరి టీ20 వరల్డ్‌కప్‌ను ఆడనున్నాము.
దక్షిణాఫ్రికా వంటి పరిస్థితుల్లో విజయాలు సాధించడం అంత ఈజీ కాదు. కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకమైన విజయం. కోచింగ్ స్టాప్ కూడా మాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. ఈ సిరీస్ మొదటి రోజే మాకు ఓ క్లారిటీ ఇచ్చేశారు. మీకు నచ్చిన విధంగా ఆడడండి, మేము కూర్చోని మీ ప్రదర్శనను ఎంజాయ్ చేస్తాము అని మాతో చెప్పారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.
చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా
Comments
Please login to add a commentAdd a comment