దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో ఓటమి చవిచూసిన టీమిండియా తిరిగి పుంజుకుంది. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.
దీంతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత జట్టు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(107 నాటౌట్) ఆజేయ సెంచరీతో చెలరేగగా.. అభిషేక్(50) హాఫ్ సెంచరీతో మెరిశాడు.
అనంతరం లక్ష్య చేధనలో ఆతిథ్య సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగల్గింది. అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు సాధించాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
"మళ్లీ విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమ్ మీటింగ్‌లో మేము చాలా విషయాలు చర్చించుకున్నాము. మా బ్రాండ్ క్రికెట్‌ను కొనసాగించాలనుకున్నాము. సెంచూరియన్‌లో అదే చేసి చూపించాము.
జట్టులో ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఓ క్లారిటీ ఉంది. మా కుర్రాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. నెట్స్‌లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు దూకుడుగా ఆడి నా పనిని సులువు చేస్తున్నారు. అన్నీ సానుకూలంగా జరుగుతుండటం చాలా అనందంగా ఉంది. మైదానంలోనూ ఆరేడు నిమిషాలు ముందే ఉన్నాం.
మేము సరైన దిశలో వెళ్తున్నామని భావిస్తున్నాను. ఇక తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20 అనంతరం తిలక్ నా గదికి వచ్చి మూడో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశమివ్వండి అని అడిగాడు.
అందుకు నేను సరే అని పూర్తి స్వేచ్ఛగా ఆడమని చెప్పాను. తను చెప్పినట్లే తిలక్ అదరగొట్టాడు. తొలి సెంచరీ సాధించడంతో అతడి కుటంబ సభ్యులు ఆనందపడి ఉంటారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.
చదవండి: ఆ నలుగురు మావాడి కెరీర్‌ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి
Comments
Please login to add a commentAdd a comment