'కోట్లా'లో కొట్టేశారు | india beat new zealand first t-20 match | Sakshi
Sakshi News home page

'కోట్లా'లో కొట్టేశారు

Published Thu, Nov 2 2017 12:29 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

india beat new zealand first t-20 match - Sakshi

భారత జట్టు అద్భుత ప్రదర్శనతో చెలరేగింది. వన్డే ఫామ్‌ను టి20లకూ కొనసాగిస్తూ భారీ విజయాన్ని అందుకుంది. పదేళ్లలో ఐదుసార్లు తలపడితే ప్రతీ సారి న్యూజిలాండ్‌ ముందు తలవంచిన టీమిండియా ఇప్పుడు కివీస్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. జొహన్నెస్‌బర్గ్‌ నుంచి మొదలు పెడితే నాగపూర్‌ వరకు దక్కని విజయం భారత్‌ న్యూఢిల్లీలో అందుకుంది. బ్యాటింగ్‌లో ధావన్, రోహిత్‌ ద్వయం భారత్‌ తరఫున టి20ల్లో అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేసి తిరుగులేని స్కోరును అందిస్తే... ఆ తర్వాత మన బౌలర్లు ప్రత్యర్థి పని పట్టారు. సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో విజయాన్ని అందించి సహచరులు సీనియర్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రాకు ఘనమైన వీడ్కోలు అందించారు. మరోవైపు భారత్‌ విజయంతో ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ను రెండో స్థానానికి నెట్టి పాకిస్తాన్‌ జట్టు తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంకును సొంతం చేసుకుంది.

న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన భారత జట్టు న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో బోణీ చేసింది. బుధవారం ఇక్కడి ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ శిఖర్‌ ధావన్‌ (52 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (55 బంతుల్లో 80; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో చెలరేగారు. తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించిన వీరిద్దరు భారత్‌ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. చివర్లో కోహ్లి (11 బంతుల్లో 26 నాటౌట్‌; 3 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడాడు. అనంతరం న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. లాథమ్‌ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. భారత బౌలర్లలో అక్షర్, చహల్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నెహ్రా... తన ఆఖరి ఇన్నింగ్స్‌లో వికెట్‌ తీయకుండానే నిష్క్రమించాడు. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టి20 శనివారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది.  

రికార్డు ఆరంభం...
వన్డేల్లో భారత్‌ తరఫున అత్యుత్తమ జోడీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ ద్వయం తొలిసారి టి20ల్లో కూడా భారీ భాగస్వామ్యంతో సత్తా చాటింది. ధావన్‌ ఇన్నింగ్స్‌ ఆసాంతం దూకుడుగా ఆడగా... ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రోహిత్, ఆ తర్వాత భారీ షాట్లు కొట్టాడు. మంచు కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డ న్యూజిలాండ్‌ ఫీల్డర్లు వీరిద్దరి క్యాచ్‌లు వదిలేయడం కూడా భారత ఓపెనర్లకు కలిసొచ్చింది. ముందుగా బౌల్ట్‌ బౌలింగ్‌లో 8 పరుగుల వద్ద సాన్‌ట్నర్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన ధావన్, ఆ తర్వాత బౌల్ట్‌ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి నాలుగు ఫోర్లు బాదాడు. ముఖ్యంగా స్వీప్‌ షాట్‌ను సమర్థంగా ఆడిన అతను పరుగులు రాబట్టాడు. మరోవైపు 16 పరుగుల వద్ద సౌతీ సునాయాస క్యాచ్‌ వదిలేయడంతో రెండో అవకాశం దక్కించుకున్న రోహిత్, వెంటనే మున్రో ఓవర్లో ఫోర్, సిక్స్‌తో చెలరేగాడు. సోధి బౌలింగ్‌లో వరుసగా 4, 6 కొట్టిన ధావన్‌ 37 బంతుల్లో కెరీర్లో మూడో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సాన్‌ట్నర్‌ ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన రోహిత్‌ 42 బంతుల్లో కెరీర్‌లో 12వ హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. చివరకు రికార్డు భాగస్వామ్యం తర్వాత ధావన్‌ను అవుట్‌ చేసి... ఈ జంటను విడగొట్టిన సోధి, తర్వాతి బంతికే పాండ్యా (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రోహిత్‌ కూడా అవుటైనా... కోహ్లి భారీ సిక్సర్ల జోరు భారత్‌ స్కోరు 200 పరుగులు దాటేలా చేసింది. అంతకుముందు 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి క్యాచ్‌ కూడా వదిలేసి కివీస్‌ ఉపకారం చేసింది. తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేసిన భారత్, తర్వాత పది ఓవర్లలో ఏకంగా 122 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.  

టపటపా...
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ దశలోనూ న్యూజిలాండ్‌ కావాల్సిన పట్టుదలను ప్రదర్శించలేకపోయింది. రెండో ఓవర్లోనే స్పిన్నర్‌ను దించి భారత్‌ ఫలితం సాధించింది. చహల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గప్టిల్‌ (4) హార్దిక్‌ పాండ్యా అత్యద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత భువనేశ్వర్‌ సూపర్‌ యార్కర్‌కు మున్రో (7) వెనుదిరిగాడు. అనంతరం విలియమ్సన్‌ (24 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్‌) ఆదుకునే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. ఒక ఎండ్‌లో లాథమ్‌ నిలబడ్డా... మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. 16 పరుగుల వ్యవధిలో నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ ఇక కోలుకోలేకపోయింది. చివర్లో సాన్‌ట్నర్‌ (14 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడినా కివీస్‌ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది.  

ఒక అవుట్‌... రెండు రివ్యూలు
బౌల్ట్‌ వేసిన 19వ ఓవర్‌ చివరి బంతిని రోహిత్‌ ఆడే ప్రయత్నం చేయగా, బంతి వెళ్లి కీపర్‌ చేతుల్లో పడింది. దాంతో కివీస్‌ అప్పీల్‌పై అంపైర్‌ అవుట్‌గా ప్రకటించారు. అయితే బ్యాట్‌కు తగిలిన తర్వాత బంతి నేలను తాకి వెళ్లిందా అనేదానిపై స్పష్టత లేకపోవడంతో ఫీల్డ్‌ అంపైర్లు థర్డ్‌ అంపైర్‌ సహాయం కోరారు. అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన థర్డ్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరి అసలు విషయం చెప్పకుండా ‘బ్యాట్‌ నేలకు తాకిన శబ్దం’ మాత్రమే అంటూ భారీ స్క్రీన్‌పై నాటౌట్‌ అని ప్రకటించేశారు కూడా. దాంతో ఆశ్చర్యపోయిన న్యూజిలాండ్‌ మళ్లీ ‘రివ్యూ’ కోరింది. ఈ సారి అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తగిలిందని స్పష్టంగా కనిపించడంతో రోహిత్‌ వెనుదిరగాల్సి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement