ఇంజిన్ ఫెయిలై.. ఆ విమానం సముద్రంలో కూలింది!
అకస్మాత్తుగా అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్370 ప్రమాదానికి సంబంధించి తాజాగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కీలక వివరాలు వెల్లడించారు. 2014 మార్చ్ 8న అదృశ్యమైన ఈ విమానం సిగ్నల్స్‌ను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలోని హిందూ మహా సముద్రంలో అత్యంత వేగంగా కుప్పకూలిందని తెలిపారు.
ఇంజిన్‌లో పవర్ వైఫల్యంతో విమానం కుప్పకూలి ఉంటుందని, పవర్ ఆగిపోవడం వల్ల ఒక్కసారిగా నిమిషానికి 20వేల అడుగుల వేగంతో ఆ విమానం ఆకాశం నుంచి సముద్రంలోకి రాలిపోయిందని శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. కూలిన బోయింగ్ 777 విమానం తయారీ తీరుతెన్నులు, ఇతరత్రా సమాచారాన్ని బేరీజు వేసిన శాస్త్రవేత్తలు ఈమేరకు నిర్ధారణకు వచ్చారు.
సాధారణంగా విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కానీ, కూలిపోయే సమయంలో కానీ నిమిషానికి రెండువేల అడుగుల వేగంతో కిందకు దిగుతుంది. గతంలో సముద్రం లోపల ఈ విమానం ల్యాండ్ అయి ఉంటుందని, అది ఆకాశంలో కూలిపోలేదని పలు ఊహాగానాలు వచ్చాయి. ఈ ఊహాగానాలను శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. విమానం కూలిపోయే ముందు పైలట్లు ఆరుసార్లు 'హ్యాండ్‌షేక్' సిగ్నల్స్‌ను శాటిలైట్‌కు పంపారని, పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ సమీపంలో ఈ సిగ్నల్స్ అనుసంధానం అయ్యాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.