Floor price
-
వినియోగదారులకు షాక్, డేటా ఛార్జీలు పెరగనున్నాయా?!
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం రంగం గట్టెక్కాలంటే కనీస ధరలు (ఫ్లోర్ ప్రైస్) నిర్ణయించడం అత్యంత కీలకమని టెల్కోల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. తాత్కాలికంగా రెండేళ్ల పాటు అయినా కేవలం డేటాకు ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించాలని, వాయిస్ కాల్స్‌కు మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చని తెలిపింది. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఒక ప్రకటనలో ఈ విషయాలు పేర్కొన్నారు. మహమ్మారి కాలంలో ఆర్థికంగా సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రజలకు నిరంతరాయంగా నెట్వర్క్ కనెక్టివిటీ అందించేందుకు టెలికం సంస్థలు గణనీయంగా పెట్టుబడులు పెట్టడం కొనసాగించాయని కొచర్ తెలిపారు. డేటా టారిఫ్‌ల తగ్గింపు ధోరణుల వల్ల టెల్కోలు భారీగా నష్టపోయిన సంగతి గుర్తించాలని, కంపెనీలు ఆర్థికంగా కోలుకోవాలంటే ఆదాయాన్ని పెంచుకోవడం అత్యంత కీలకంగా మారిందని ఆయన వివరించారు. కనీస ధరలను నిర్ణయించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి సీవోఏఐ పలుమార్లు విజ్ఞప్తి చేసిందని, దీనిపై చర్చలు కూడా జరిగాయని కొచర్ పేర్కొన్నారు. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలకు సీవోఏఐలో సభ్యత్వం ఉంది. పెరిగే అవకాశం? మరోవైపు, టెలికం రంగంలో తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో టారిఫ్‌లు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఇటీవలే వ్యాఖ్యానించారు. అటు వొడాఫోన్ ఐడియా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతోంది. ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, మారటోరియంపై స్పష్టతనిస్తే తప్ప ఇన్వెస్ట్ చేసేందుకు మదుపరులెవరూ ముందుకు వచ్చేలా లేరంటూ కంపెనీ జూన్ 7న కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఏజీఆర్ బాకీల కింద వొడాఫోన్ ఐడియా రూ. 58,254 కోట్ల మేర బాకీపడింది. ఇందులో రూ. 7,854 కోట్లు కట్టగా మరో రూ.50,399 కోట్లు కట్టాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాల్ ఛార్జీల సంగతేమోగానీ.. డేటా ఛార్జీలు మాత్రం గణనీయంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ధర రూ. 12
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)కు ఫ్లోర్ ధరను రూ. 12గా నిర్ణయించింది. ఇది గురువారం ముగింపు ధర రూ. 26.6తో పోలిస్తే 55 శాతం తక్కువ కావడం గమనార్హం! ఎఫ్‌పీవో ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. తద్వారా రూ. 15,000 కోట్లవరకూ సమీకరించాలని యస్ బ్యాంక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమై రూ. 25 వద్ద ట్రేడవుతోంది. రూ. 1 డిస్కౌంట్ అర్హతగల ఉద్యోగులకు యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ధరలో రూ.1 డిస్కౌంట్ ప్రకటించింది. ఎఫ్‌పీవోలో భాగంగా 1,000 షేర్లను ఒకలాట్‌గా కేటాయించనుంది. దీంతో ఇన్వెస్టర్లు కనీసం 1,000 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వెరసి రూ. 12,000 కనీస పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. యస్ బ్యాంకులో అతిపెద్ద వాటాదారు ఎస్బీఐ రూ. 1760 కోట్లవరకూ ఈ ఎఫ్‌పీవోలో ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకు ఎస్బీఐ బోర్డు గ్రీన్సిగ్నల్ఇచ్చిన విషయం విదితమే. ఈ బాటలో ఇతర సంస్థలు టిల్డెన్ పార్క్, ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితరాలు సైతం ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. -
జియోకు ఊరట: ఉచిత ఆఫర్లకు నో ఢోకా
టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్, రిలయన్స్ జియోకు పెద్ద ఊరటనిచ్చింది. ఎన్నిరోజులైనా జియో ఉచిత ఆఫర్లలో మార్కెట్లో సంచలనాలు సృష్టించవచ్చు. ఎందుకంటే టెలికాం దిగ్గజాలు ఎప్పటి నుంచో కోరుతున్న 'మినిమమ్ ఫ్లోర్ ప్రైస్'పై ట్రాయ్ శుక్రవారం తేల్చేసింది. టెలికాం సర్వీసులకు ఇప్పుడేమీ ఫ్లోర్ ప్రైస్‌ను అవసరం లేదని ట్రాయ్ చెప్పింది. దీంతో టెలికాం దిగ్గజాలకు మరో షాక్ ఎదురైనట్టైంది. మినిమమ్ ఫ్లోర్ ధరలతో జియో ఉచిత ఆఫర్లకు చెక్ పెట్టాలని ఈ కంపెనీలు భావించాయి. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ, శుక్రవారం అన్ని టెలికాం ప్రొవైడర్ల ప్రతినిధులతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించాలనేది సరియైన ఆలోచన కాదని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఈ ధరలేమీ అవసరం లేదన్నారు. ఇక దీనిపై మరోసారి చర్చించేది లేదని కూడా చెప్పేశారు. డేటా ,వాయిస్ కాల్స్ రెండింటికీ కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించాలని కోరుతూ కొన్ని టెలికాం ఆపరేటర్లు ట్రాయ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒకవేళ మినిమమ్ ఫ్లోర్ ధరను నిర్ణయిస్తే, మార్కెట్లో ఉచిత ఆఫర్లకు కళ్లెం పడుతోంది. ప్రస్తుతం రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లలో టెలికాం కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ట్రాయ్ చైర్మన్ నిర్వహించిన సమావేశంలో మినిమమ్ ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించాలనే దానిపై ఐడియా దాదాపు గంటపాటు ప్రజెంటేషన్ ఇచ్చింది. అయినప్పటికీ ట్రాయ్ ఈ విషయంపై సముఖత వ్యక్తంచేయలేదు. ఇప్పట్లో ఈ ధరలు అవసరం లేదనే పేర్కొంది. -
ఫ్రీ డేటా, వాయిస్ ఆఫర్లకు ఇక రాం రాం?
న్యూఢిల్లీ: టెలికాం సెక్టార్లో ఎదురవుతున్న ఆర్థిక ఒత్తడి, నష్టాల నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఒకవైపు జియో చెక్ చెప్పడంతోపాటు, కష్టాల గట్టెక్కేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీస ధరలను ఫిక్స్ చేయాల్సిందిగా టెలికం ఆపరేటర్లు మార్కెట్ రెగ్యులేటరీని ఆశ్రయించాయి. డేటా ,వాయిస్ కాల్స్ రెండింటికీ కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించాలని కోరతూ కొన్ని టెలికాం ఆపరేటర్లు భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ను ఆశ్రయించాయి. దీంతో ట్రాయ్ జూలై 21 న 'కనీస ఫ్లోర్ ధర' అంశంపై అన్ని సర్వీసు ప్రొవైడర్ల అభిప్రాయాలు, వాదనలు కోరనుంది. దీంతో ఉచితడేటా, వాయిస్ సేవలకు త్వరలోనే ముగింపు పడనుందా అనే ఊహాగానాలు పరిశ్రమ వర్గాల్లో నెలకొన్నాయి. పరిశ్రమ ఆర్థిక నష్టాలను, పెరుగుతున్న ఆర్ధిక ఒత్తిడిని నొక్కి చెప్పిన ఐడియా గత నెలలో రెగ్యులేటర్ ఇండస్ట్రీ పరిశ్రమలు, అంతర్ మంత్రిత్వ గ్రూపు (ఐఎంజీ) భేటీ సందర్భంగా ఫ్లోర్ ధర నిర్ణయం డిమాండ్‌ను ప్రస్తావించింది. కాగా టెలికాం సెక్టార్ లోకి రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన మొత్తం ఆర్థిక పరిస్థితినే మార్చి వేసింది. ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చని ఇతర దిగ్గజ కంపెనీలను పలు ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వాటి లాభాలను, ఆదాయాలను భారీగా ప్రభావితం చేసింది. అంతేకాదు ఆయా కంపెనీల మొత్తం టారిఫ్ ప్లాన్లలో పెను మార్పులకు నాంది పలికింది. ప్రధానంగా టెలికాం మేజర్‌ను భారతీఎయిర్‌టెల్‌ను బాగా దెబ్బ కొట్టింది. ఐడియా, వోడాఫోన్, ఆర్‌కామ్ ఇదే వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. -
టెలికం సర్వీసులకు ఫ్లోర్ ప్రైస్!
న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమలో ఉచిత ఆఫర్లు ఎక్కువౌతోన్న నేపథ్యంలో టెల్కోలు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చాయి. ఇవి వాయిస్, డేటా సేవలపై ఫ్లోర్ ప్రైస్‌ను అమలుచేయాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్‌ను కోరాయి. ఫ్లోర్ ప్రైస్ విధానంలో ఒక ఆపరేటర్ నిర్దేశించిన ధరకు తక్కువగా వాయిస్, డేటా సర్వీసులను కస్టమర్లకు ఆఫర్ చేయకూడదు. ఏడు ప్రధాన టెలికం కంపెనీలకు చెందిన ప్రతినిధులు గురువారం ట్రాయ్ చైర్మన్‌తో సమావేశమయ్యారు. టెల్కోలు ఫ్లోర్ ప్రైస్ అంశం గురించి తమతో చర్చించాయని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. ‘ఫ్లోర్ ప్రైస్ అనేది టెక్నాలజీ, నెట్వర్క్ వినియోగం, పరిమాణం వంటి చాలా అంశాలపై ఆధారపడుతుంది.ఇది క్లిష్టమైనది. దీనిపై చాలా స్పష్టత రావాల్సి ఉంది’ అని వివరించారు. అయితే దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో మాత్రం చెప్పలేదు. -
కోల్ ఇండియా ఆఫర్ ధర రూ. 358
నేడు ఓఎఫ్ఎస్ ద్వారా 10% వరకూ వాటా విక్రయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో వాటా విక్రయానికి కనీస షేరు ధరను(ఫ్లోర్ ప్రైస్) ప్రభుత్వం రూ.358గా నిర్ణయించింది. శుక్రవారం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో కేంద్రం 10 శాతం వరకూ వాటాను విక్రయించనుంది. గురువారం బీఎస్ఈలో కోల్ ఇండియా షేరు ముగింపు ధర రూ.375.15తో పోలిస్తే ప్రభుత్వం ప్రకటించిన కనీస షేరు ధర దాదాపు 5% తక్కువ కావడం గమనార్హం. ఈ ఫ్లోర్ ప్రైస్ ప్రకారం చూస్తే.. 10% వాటా విక్రయం ద్వారా ఖజానాకు రూ.22,600 కోట్లు లభించే అవకాశాలున్నాయి. కాగా, ఈ వాటా అమ్మకానికి వ్యతిరేకంగా గురువారం సంస్థ కార్మిక యూనియన్లు సమ్మె హెచ్చరికలు చేసినా.. ప్రభుత్వం మాత్రం వెనక్కితగ్గకపోవడం గమనార్హం. నేడు బైటాయింపులతో నిరసన వ్యక్తం చేయనున్నట్లు కార్మిక యూనియన్లు తెలిపాయి. దేశీ స్టాక్ మార్కెట్లలో ఇప్పటిదాకా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ(2010 అక్టోబర్‌లో ఐపీఓ ద్వారా రూ.15,199 కోట్ల సమీకరణ) కోల్ ఇండియాదే. ఇప్పుడు ఓఎఫ్ఎస్తో వాటా విక్రయం చేపడుతున్న కోల్ ఇండియా మరో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూతో కొత్త రికార్డును నెలకొల్పనుంది. రిటైలర్లకు 5 శాతం డిస్కౌంట్... మొత్తం విక్రయానికి ఉంచనున్న 63.17 కోట్ల షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్లకు 20 శాతాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాకుండా రిటైలర్లకు బిడ్డింగ్ ధరలో 5 శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది. ప్రస్తుతం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 89.65 శాతం వాటా ఉంది. ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో రూ.43,425 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి మరో రెండు నెలలే గడువు మిగలగా.. ఇప్పటిదాకా రూ.1,715 కోట్లే(సెయిల్‌లో గతేడాది డిసెంబర్లో 5 శాతం వాటా అమ్మకం ద్వారా) లభించాయి.