టెలికం సర్వీసులకు ఫ్లోర్ ప్రైస్!
న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమలో ఉచిత ఆఫర్లు ఎక్కువౌతోన్న నేపథ్యంలో టెల్కోలు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చాయి. ఇవి వాయిస్, డేటా సేవలపై ఫ్లోర్ ప్రైస్‌ను అమలుచేయాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్‌ను కోరాయి. ఫ్లోర్ ప్రైస్ విధానంలో ఒక ఆపరేటర్ నిర్దేశించిన ధరకు తక్కువగా వాయిస్, డేటా సర్వీసులను కస్టమర్లకు ఆఫర్ చేయకూడదు.
ఏడు ప్రధాన టెలికం కంపెనీలకు చెందిన ప్రతినిధులు గురువారం ట్రాయ్ చైర్మన్‌తో సమావేశమయ్యారు. టెల్కోలు ఫ్లోర్ ప్రైస్ అంశం గురించి తమతో చర్చించాయని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. ‘ఫ్లోర్ ప్రైస్ అనేది టెక్నాలజీ, నెట్‌వర్క్ వినియోగం, పరిమాణం వంటి చాలా అంశాలపై ఆధారపడుతుంది.ఇది క్లిష్టమైనది. దీనిపై చాలా స్పష్టత రావాల్సి ఉంది’ అని వివరించారు. అయితే దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో మాత్రం చెప్పలేదు.