breaking news
flower festival
-
పువ్వులా పరిమళిద్దాం.. సుద్దాల అశోక్ తేజ
‘‘ప్రతి మనిషి ఒక పువ్వులాంటివాడే. పువ్వు ఉన్నంతసేపు పరిమళాన్నిస్తుంది. మనిషి కూడా ఉన్నన్ని రోజులు ప్రపంచానికి, భూమికి, తన కుటుంబానికి, ఇరుగు పొరుగు వారికి ప్రేమగా, బాధ్యతగా ఉండాలన్నది మానవ జీవితం అయినప్పుడు.. పువ్వు కూడా అంతే. పూస్తుంది... పరిమళాలు పంచుతుంది.. వాడి పోయి రాలి పోతుంది. పూల జీవన తాత్పర్యం, జీవన తాత్వికత అదే. మనిషి కూడా మంచి చేయక పోయినా పర్వాలేదు కానీ, చెడు చేయకూడదు. ఇలా ఓ మంచి సందేశం ఇచ్చే పండుగ బతుకమ్మ’’ అని ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ చెప్పారు. నేడు ‘బతుకమ్మ’ పండుగ ఆరంభం సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.‘‘నాకు ఊహ తెలిసీ తెలియని వయసులోనే మా అమ్మ, అక్కతో పాటు మా నాన్న కూడా బతుకమ్మ కోసం పూలను తీసుకొచ్చేవారు. అలా ఈ పూల పండుగ అయిన బతుకమ్మకి ఇచ్చే ప్రాధాన్యం చిన్న వయసులో నాకు అర్థం అయింది. బతుకమ్మ అనే పేరు పెట్టడంలోనే ప్రజలు చాలా గొప్ప ప్రతిభ పాటించారనిపిస్తోంది. పూలతో అలంకరించి చేస్తారు కాబట్టి పూలమ్మ పండుగ అని కూడా అనొచ్చు కదా? కానీ, అనలేదు. గౌరమ్మ పండుగ, పార్వతీదేవి పండుగ, లక్ష్మీదేవమ్మ పండుగ అనలేదు. ఇవన్నీ పాటలు పాడుతుంటారు. కానీ, బతుకుకు సంబంధించిన ప్రకృతిని పూజించి, ప్రార్థించి, గౌరవించి, ఆరాధించేటటువంటి ఒక పండుగేమో అని అర్థం వచ్చేటట్లు బతుకమ్మ అని పేరు పెట్టారేమో అనిపిస్తుంది. మనిషి బతకాలంటే పంచభూతాలు బాగుండాలి. అది మన శరీరం కావొచ్చు, ఈ ప్రపంచం కావొచ్చు. అసలు మన పండుగలన్నీ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బతుకుతున్న ప్రజలు చేసుకునే పండుగలే. అది దసరా అయినా, సంక్రాంతి అయినా, ఉగాది అయినా. అందులో భాగంగా దసరాకి ముందు వచ్చేదే ఈ బతుకమ్మ పండుగ. → సామాన్యుల పండుగ బతుకమ్మ పండుగలో ఒక గమ్మత్తయిన ఆచారం ఉంది. ఖరీదైన పూలు బతుకమ్మలో వాడరు. పేదవాళ్లు తమ పొలాల్లో, పొలం గట్లల్లో, చెలకల్లో, ఆరు బయట ఊరు చివర ఉన్న ఎక్కడపడితే అక్కడ దొరికే గడ్డి పోగులను, పూలను మాత్రమే వాడతారు. ఈ పూలన్నింటినీ పేర్చినప్పటికీ.. గణపతిని నీళ్లల్లో నిమజ్జనం చేసినట్లు చేయరు. ఒక కార్తీక దీపంలాగా అలల మీద పెట్టి తోస్తారు. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరుకోమని. వాళ్ల బతుకులు కూడా ఒక గట్టు మీద నుంచి మరో గట్టుకి చేరడంలోనే జీవితానికి సార్థకత ఉందని భావించడానికే చెరువులో వేసి ‘ పోయిరా బతుకమ్మా..’ అంటుంటారు. ఇలా తమ బతుకులకు తామే ధైర్యం చెప్పుకుంటున్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ గట్టు అనేది పుట్టక అయితే ఆ గట్టు అనేది చివర. మధ్యలో అనేకమైన అల్లకల్లోలాలు, గాలులు, అలలు, తుఫానులు, అభ్యంతరాలు, ఆటంకాలు, ఆశాభంగా లు ఉంటాయి జీవితంలో. ఈ పండుగలో కూడా బతుకమ్మని పేర్చి, ఈ చివరి నుంచి అటు తోస్తే అది మెలమెల్లగా వెళుతూ మధ్యలో మునిగి పోతుందా? ఆ గట్టుకు చేరుకుంటుందా? అనేది మనకు తెలియదు కానీ, తమ జీవితాలను తామే ఒక సాంకేతికమైన మార్గంగా సృష్టించుకుని చేసుకుంటారేమో అనిపిస్తుంది నాలాంటివాళ్లకి. → మా ఇంట్లో మనవరాళ్ల దాకా... బతుకమ్మ అనేది ఆడపడుచుల పండుగ. అత్తగారింటికి వెళ్లిన ఆడబిడ్డలందరూ అమ్మగారింటికి వచ్చి బతుకమ్మ, దసరా పండుగ చూసుకుని వెళ్లి పోతుంటారు. ఈ పండుగ గురించి మాకు గుర్తొచ్చేది ఏంటంటే.. పూలను తీసుకురావాలి, పేర్చాలి.. అమ్మ ప్రసాదం చేస్తే తినాలి.. ఇరుగు పొరుగువారికి ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. ఈ సంప్రదాయం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకూ సాగుతూనే ఉంది. మా అమ్మ, అక్కలు, చెల్లెళ్లు్ల, కూతుళ్లు, కోడళ్లు... ఇప్పుడు నా మనవరాళ్ల దాకా వచ్చింది. → చప్పట్ల పండగ బతుకమ్మ అంటే చప్పట్ల పండుగ. ఈ పండుగనాడు సన్నాయిలు, వాయిద్యాలు, మృదంగాలు, డప్పులు కొడుతుంటే మహిళలు బతుకమ్మని చెరువుదాకా తీసుకెళ్లేవారు. కాలప్రవాహంలో మనం చూస్తున్న ఈ దాండియా, డీజేలు మన సంప్రదాయం కాదు. బతుకమ్మ పండుగలో కాలక్రమేణా వస్తున్న మార్పులు సంప్రదాయబద్ధంగా ఉంటే పర్వాలేదు. కానీ, అందులోకి ఈ ఐటెమ్ సాంగ్‌లను వాయించే వాయిద్యాలు చొరబడొద్దు.. అది కరెక్ట్కాదు..→ ఆ అనుభూతితో పాటలు రాశా! బతుకమ్మ పండుగపైన నేను కూడా చాలా పాటలు రాశాను. చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మ ఆడుతుంటే చూసినవాణ్ణి. అలాగే మా అక్కలు, చెల్లెళ్లు, కూతుళ్లు, మనవరాళ్లు ఆడుతుంటే చూసినప్పుడు ఒక అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతి, సంప్రదాయం, వారు పాడే పాటల్లోని జానపదం కలిపి ఆ పాట రాస్తున్నప్పుడు ఒక గొప్ప అనుభూతి కలిగింది. ఆ అనుభూతితోనే పాటలు రాశాను. → తాత్త్విక సందేశం ఇచ్చే పండుగబతుకమ్మ పండుగ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే... మన సంప్రదాయం, మన పూర్వీకులు ఆచరిస్తున్న పద్ధతులు, ప్రేమ, మానవ సంబంధాలు, రక్తసంబంధాలు, ఆడపడుచులు పుట్టింటికి రావడం, ఆ ప్రేమలు ఉన్నాయి. అదే విధంగా మనం పూలను గౌరవించాలి.. పూజించాలి.. పువ్వులకు నమస్కారం చేయాలి. పువ్వులు ఉండాలంటే చెరువులుండాలి.. చెరువులు ఉండాలంటే వానలు ఉండాలి.. వానలు ఉండాలంటే చెట్లు ఉండాలి. చెట్లు పిలిస్తే వాన–వాన కురిస్తే చెట్టు అయినప్పుడు ఈ రెండూ లేకుండా బతుకమ్మ పండుగ లేదు. ప్రకృతి, పర్యావరణం బాగుంటేనే బతుకమ్మ బాగుంటుంది.. బతుకమ్మ బాగుంది అంటే బతుకులు బాగున్నట్టు లెక్క. ఇలా ఓ మంచి సందేశం ఇచ్చే పండుగ బతుకమ్మ. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, గండాలు, సుడిగుండాలు ఉంటాయి.. వాటన్నింటినీ తప్పించుకుంటూ, అధిగమించుకుంటూ మనుషుల్లో అందరం బాగుండడం.. అందులో మనం కూడా ఉండటం అనే తాత్త్విక సందేశం ఇచ్చేదే బతుకమ్మ. → ఆ సంబరం... ఆ సందడి బతుకమ్మ పండుగప్పుడు గతంలో మా అక్కలు, చెల్లెళ్లు ఇంటికొచ్చేవారు. ఇప్పుడైతే నా కూతురు వస్తుంది.. మనవరాళ్లు వస్తారు. మా కోడళ్లు కుదిరితే తల్లిగారి ఇంటికి వెళతారు.. లేదంటే మా ఇంట్లోనే ఉంటారు. నా భార్య కూడా బతుకమ్మ పేర్చడం, ఇరుగు పొరుగువారితో బతుకమ్మ ఆడటం, మా కాలనీలో తాత్కాలిక నీటి కొలను ఏర్పాటు చేసుకుని అందులో బతుకమ్మని వేయడం జరుగుతుంటుంది. లేదా అవకాశం ఉంటే ఎవరితోనైనా పంపించి, నదిలోనో, చెరువుల్లోనో వేయిస్తాం. మా ఊరు సుద్దాలకి వెళ్లి బతుకమ్మ చేసుకుంటే మాత్రం పక్కాగా బతుకమ్మ కుంటలో వేస్తాం. పిత్రమాస నాడు కుంటలో వేస్తాం, సద్దుల బతుకమ్మనాడు చెరువు వద్దకు అందరూ వెళతారు. ఆట పాటల్లో మహిళలు మాత్రమే పాల్గొంటారు. కానీ, పురుషులు మాత్రం వారి వెంట వెళతారు. బతుకమ్మలను అవసరమైతే చెరువు మధ్యలోకి వెళ్లి వదలాల్సి వచ్చినప్పుడు పురుషులు వెళ్లి వదిలే సంప్రదాయం మాత్రం ఉంది.. వాటన్నింటిలో మేము పాల్గొన్నాం. ఇప్పుడైతే మా అబ్బాయిలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు.. వాళ్లు చూసుకుంటారు కానీ, నేను పాల్గొనటం లేదు. నాకు ఐదుగురు మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నారు. వీరందరూ బతుకమ్మ పండగకి తప్పకుండా వస్తారు. అది పిత్రమాస రోజు అయినా లేదంటే సద్దుల బతుకమ్మనాడు అయినా వస్తుంటారు. ఆ సంబురం, ఆ సందడి వేరుగా ఉంటుంది. అది బతుకమ్మలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే నా దృష్టిలో అమ్మాయిలు లేని బతుకమ్మ పండుగ చంద్రుడు లేనటువంటి పౌర్ణమిలాంటిది’’ అని చెప్పారు సుద్దాల అశోక్ తేజ. – డేరంగుల జగన్ మోహన్ -
లులు మాల్లో ఫ్లవర్ ఫెస్టివల్ ప్రారంభించిన బిగ్ బాస్ దివి (ఫోటోలు)
-
ప్రపంచంలోనే అతిపెద్ద పూల సంబరం!
కొలంబియాలో జరుగుతున్న పూలసంబరాల ఫొటోలు ఇవి. ప్రపంచంలోనే అతిపెద్ద పూలసంబరాలు ఇవి. కొలంబియాలోని మెడలీన్ నగరంలో 1958 నుంచి ఏటా ఆగస్టులో ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. అంతకుముందు ఈ వేడుకలను మే నెలలో నిర్వహించేవారు. కొలంబియాలో బానిసత్వం రద్దయిన సందర్భానికి ప్రతీకగా పూలసంబరాలను ‘ఫెరియా డి లాస్ ఫ్లోరెస్’ పేరుతో నిర్వహించడం ప్రారంభించారు. బానిసత్వం ఉన్నకాలంలో ఎత్తయిన ప్రదేశాలకు బానిసలు తమ వీపులపై మనుషులను మోసుకుపోయేవారు. పూల వేడుకల్లో మనుషులకు బదులుగా పూలబుట్టలను వీపులపై మోస్తూ ఊరేగింపు జరపడం ఆనవాయితీగా మారింది. ఈ సంబరాల్లో భాగంగా పాతకాలం కార్లను, బైకులను పూలతో అలంకరించి మెడలీన్ వీథుల్లో 11 కిలోమీటర్లు ఊరేగింపు సాగించారు. ఈసారి జరిగిన పూలసంబరాల్లో పూల ప్రదర్శనలు, భారీ పూల అలంకరణలతో మెడలీన్ నగరం పూలవనాన్ని తలపించింది. ఈ వేడుకల్లో భాగంగా అందాల పోటీలు, పుష్పాలంకరణ పోటీలు, సంగీత, నృత్య ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి.. దేశ విదేశాల నుంచి దాదాపు పాతికలక్షల మంది పర్యాటకులు ఈ పూలప్రదర్శనను తిలకించారు. (చదవండి: వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!) -
Bathukamma: పూలకి పండగ
బతుకమ్మ పండుగ పకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు ‘బొడ్డెమ్మ‘ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది. బాలారిష్టాలు, కలరా, మలేరియా, ప్లేగు వంటి మహమ్మారి రోగాల నుండి పిల్లా పాపలను, కరువు కాటకాల నుండి ప్రజలను కాపాడి బతుకును ఈయమ్మా అని ప్రజలు ప్రకృతి గౌరీని తమ సాధారణ ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ. తెలంగాణ పల్లెల్లోని ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ బతుకమ్మ పండుగ యువతులు, ముత్తైదువులు సాంప్రదాయం ఉట్టిపడేలా తయారయ్యి ఊరంతా ఒకటయ్యి తమలో బీదా గొప్పా వర్ణం వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే పల్లె ప్రజల సాంస్కృతిక పండుగ ఇది. అయితే నేటి కాలంలో బతుకమ్మ పండుగ గొప్పతనం ఎల్లలు దాటి దేశ విదేశాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మంచి వర్షాలతో వరుణ దేవుడు అనుగ్రహించి అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతు జీవితం కళకళలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూనే యువతులు ముత్తైదువులు రంగు రంగు పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్ది అందులో గౌరమ్మను పెట్టి పూజించి ఊరంతా ఒక్క చోట గుమిగూడి పల్లె ప్రజల జీవితాలను కష్ట సుఖాలను పాటల రూపంలో ప్రకృతి గౌరికి విన్నవించుకుంటారు. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. -
ఆటకు సిద్ధం
బిజీ సిటీలైఫ్‌లో బతుకమ్మను పేర్చే తీరిక ఎవరికుంది. ఓపిక కూడదీసుకుని బతుకమ్మను తీర్చిదిద్దాలన్నా.. పెరిగిన ధరలతో ఆకాశంలో ఉన్న పూలను మధ్యతరగతి మగువలు అందుకోలేకపోతున్నారు. వీరి కోసమే.. వచ్చాయి రెడీమేడ్ బతుకమ్మలు. గంటలకు గంటలు కూర్చొని బతుకమ్మను తయారు చేసే పనిలేకుండా.. తీరొక్క రీతిగా ముస్తాబైన ఆర్టిఫిషియల్ బతుకమ్మలు అంగట్లో దొరుకుతున్నాయి. పూల పండుగ బతుకమ్మను మధ్యతరగతి కుటుంబీకులు జోష్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. భగ్గుమంటున్న పూల ధరలు.. మిడిల్‌క్లాస్‌కు బతుకమ్మ సంబురాల్ని భారంగా మారుస్తున్నాయి. చటాక్ పూలకు రూ.70 వరకూ చెల్లించాల్సి వస్తుంది. అలాంటి వర్గానికి వరమే ఈ ఆర్టిఫిషియల్ బతుకమ్మ. దీనికి గంపలకొద్దీ పూలు అక్కర్లేదు. ఇంట్లో వృథాగా ఉన్న కార్డ్బోర్డ్, చవకగా దొరికే థర్మాకోల్, పేపర్ పూలు, వెజిటబుల్ కలర్స్‌తో తయారైన కాగితం పూలతో ఈ బతుకమ్మ తయారు చేయొచ్చు. డిజైనర్ బతుకమ్మలు ఈ మధ్య నగరవాసులు ప్రతీదానికి డిజైనర్ సెలెక్షన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. బతుకమ్మల విషయంలో కూడా అదే ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్టిఫిషియల్ మెథడ్‌తో అలాంటి డిజైనర్ బతుకమ్మల తయారీ వెరీ ఈజీ. ఖర్చు కేవలం 60 రూపాయలే. రోజుకో రకం తయారు చేసుకోవచ్చు. లేదంటే ఒకే బతుకమ్మను తొమ్మిది రోజులూ పెట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున సిటీలోని ప్రధాన కూడళ్లలో నిలువెత్తు రెడీమేడ్ బతుకమ్మలు కొలువుదీరి కనిపిస్తున్నాయి. షాిపింగ్ మాల్స్ దగ్గర్నుంచి ఆఫీసులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఎక్కడైనా.. ఈ రెడీమేడ్ బతుకమ్మలను అలంకరించుకోవచ్చు. వీటన్నిటికీ మించి ఈ పండుగ సందర్భంగా ఈ రెడీమేడ్ బతుకమ్మలను తయారుచేసే వందలాది మందికి ఉపాధి దొరుకుతోంది. ప్రకృతికి నో ఫికర్ ఈ రెడీమేడ్ బతుకమ్మలతో పర్యావరణానికి ఎలాంటి చేటు ఉండదంటున్నారు ఎకో ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అరుణ్‌జ్యోతి ఎస్ లోఖండే. థర్మకోల్, కార్డ్‌బోర్డ్‌తో చేసిన ఈ బతుకమ్మలు నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదంటున్నారామె. తొమ్మిది రోజుల పండుగ అయిపోయాక ఈ రెడీమేడ్ బతుకమ్మను ఇంట్లోనే అలంకరించుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల ప్రకృతిని కాపాడినవారం అవుతామంటున్నారు అరుణ్‌జ్యోతి. డబ్బుకి డబ్బు ఆదా.. ‘పూల కాస్ట్ ఎక్కువైపోయింది. మూడు వందలు పెడితేకాని పావుకిలో పూలు రావట్లేదు. ఆ పూలతో బుజ్జి బతుకమ్మే తయారవుతోంది. పదిమందిలో ఆడేటప్పుడు కాస్త ఆకర్షణగా ఉండాలంటే కనీసం రూ.1,500 ఖర్చు చేయాల్సిందే. తొమ్మిది రోజులూ అంత డబ్బంటే మాటలుకాదు. అందుకే ఈ రెడీమేడ్ బతుకమ్మలను కొనుక్కుంటున్నాం. డబ్బుకి డబ్బు ఆదా.. శ్రమా అదా.. పండుగ చేసుకున్న భాగ్యమూ దక్కుతోంది’ అని చెప్పింది ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సరిత. జ్ఞాపకంగా.. ‘రేట్ లెక్కచేయకుండా పూలు కొని బతుకమ్మను పేర్చినా అందరూ వచ్చి ఆడేసరికి ఆ పూలు వాడిపోయినట్టు కనిపిస్తాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్ బతుకమ్మ ఎంత లేటయినా కలర్ఫుల్గా కనిపిస్తుంది. పండుగ అయిపోయినా ఓ జ్ఞాపకంగా షోకేస్‌లో దాచుకోవచ్చు’ అని వివరించింది అన్నానగర్ నివాసి మహేశ్వరి.