
కొలంబియాలో జరుగుతున్న పూలసంబరాల ఫొటోలు ఇవి. ప్రపంచంలోనే అతిపెద్ద పూలసంబరాలు ఇవి. కొలంబియాలోని మెడలీన్ నగరంలో 1958 నుంచి ఏటా ఆగస్టులో ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. అంతకుముందు ఈ వేడుకలను మే నెలలో నిర్వహించేవారు. కొలంబియాలో బానిసత్వం రద్దయిన సందర్భానికి ప్రతీకగా పూలసంబరాలను ‘ఫెరియా డి లాస్ ఫ్లోరెస్’ పేరుతో నిర్వహించడం ప్రారంభించారు.
బానిసత్వం ఉన్నకాలంలో ఎత్తయిన ప్రదేశాలకు బానిసలు తమ వీపులపై మనుషులను మోసుకుపోయేవారు. పూల వేడుకల్లో మనుషులకు బదులుగా పూలబుట్టలను వీపులపై మోస్తూ ఊరేగింపు జరపడం ఆనవాయితీగా మారింది. ఈ సంబరాల్లో భాగంగా పాతకాలం కార్లను, బైకులను పూలతో అలంకరించి మెడలీన్ వీథుల్లో 11 కిలోమీటర్లు ఊరేగింపు సాగించారు.
ఈసారి జరిగిన పూలసంబరాల్లో పూల ప్రదర్శనలు, భారీ పూల అలంకరణలతో మెడలీన్ నగరం పూలవనాన్ని తలపించింది. ఈ వేడుకల్లో భాగంగా అందాల పోటీలు, పుష్పాలంకరణ పోటీలు, సంగీత, నృత్య ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి.. దేశ విదేశాల నుంచి దాదాపు పాతికలక్షల మంది పర్యాటకులు ఈ పూలప్రదర్శనను తిలకించారు.
(చదవండి: వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!)