ఆటకు సిద్ధం
బిజీ సిటీలైఫ్‌లో బతుకమ్మను పేర్చే తీరిక ఎవరికుంది. ఓపిక కూడదీసుకుని బతుకమ్మను తీర్చిదిద్దాలన్నా.. పెరిగిన ధరలతో ఆకాశంలో ఉన్న పూలను మధ్యతరగతి మగువలు అందుకోలేకపోతున్నారు. వీరి కోసమే.. వచ్చాయి రెడీమేడ్ బతుకమ్మలు. గంటలకు గంటలు కూర్చొని బతుకమ్మను తయారు చేసే పనిలేకుండా.. తీరొక్క రీతిగా ముస్తాబైన ఆర్టిఫిషియల్ బతుకమ్మలు అంగట్లో దొరుకుతున్నాయి.
పూల పండుగ బతుకమ్మను మధ్యతరగతి కుటుంబీకులు జోష్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. భగ్గుమంటున్న పూల ధరలు.. మిడిల్‌క్లాస్‌కు బతుకమ్మ సంబురాల్ని భారంగా మారుస్తున్నాయి. చటాక్ పూలకు రూ.70 వరకూ చెల్లించాల్సి వస్తుంది. అలాంటి వర్గానికి వరమే ఈ ఆర్టిఫిషియల్ బతుకమ్మ. దీనికి గంపలకొద్దీ పూలు అక్కర్లేదు. ఇంట్లో వృథాగా ఉన్న కార్డ్‌బోర్డ్, చవకగా దొరికే థర్మాకోల్, పేపర్ పూలు, వెజిటబుల్ కలర్స్‌తో తయారైన కాగితం పూలతో ఈ బతుకమ్మ తయారు చేయొచ్చు.
డిజైనర్ బతుకమ్మలు
ఈ మధ్య నగరవాసులు ప్రతీదానికి డిజైనర్ సెలెక్షన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. బతుకమ్మల విషయంలో కూడా అదే ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్టిఫిషియల్ మెథడ్‌తో అలాంటి డిజైనర్ బతుకమ్మల తయారీ వెరీ ఈజీ. ఖర్చు కేవలం 60 రూపాయలే. రోజుకో రకం తయారు చేసుకోవచ్చు. లేదంటే ఒకే బతుకమ్మను తొమ్మిది రోజులూ పెట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున సిటీలోని ప్రధాన కూడళ్లలో నిలువెత్తు రెడీమేడ్ బతుకమ్మలు కొలువుదీరి కనిపిస్తున్నాయి. షాిపింగ్ మాల్స్ దగ్గర్నుంచి ఆఫీసులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఎక్కడైనా.. ఈ రెడీమేడ్ బతుకమ్మలను అలంకరించుకోవచ్చు. వీటన్నిటికీ మించి ఈ పండుగ సందర్భంగా ఈ రెడీమేడ్ బతుకమ్మలను తయారుచేసే వందలాది మందికి ఉపాధి దొరుకుతోంది.
ప్రకృతికి నో ఫికర్
ఈ రెడీమేడ్ బతుకమ్మలతో పర్యావరణానికి ఎలాంటి చేటు ఉండదంటున్నారు ఎకో ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అరుణ్‌జ్యోతి ఎస్ లోఖండే. థర్మకోల్, కార్డ్‌బోర్డ్‌తో చేసిన ఈ బతుకమ్మలు నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదంటున్నారామె. తొమ్మిది రోజుల పండుగ అయిపోయాక ఈ రెడీమేడ్ బతుకమ్మను ఇంట్లోనే అలంకరించుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల ప్రకృతిని కాపాడినవారం అవుతామంటున్నారు అరుణ్‌జ్యోతి.
డబ్బుకి డబ్బు ఆదా..
‘పూల కాస్ట్ ఎక్కువైపోయింది. మూడు వందలు పెడితేకాని పావుకిలో పూలు రావట్లేదు. ఆ పూలతో బుజ్జి బతుకమ్మే తయారవుతోంది. పదిమందిలో ఆడేటప్పుడు కాస్త ఆకర్షణగా ఉండాలంటే కనీసం రూ.1,500 ఖర్చు చేయాల్సిందే. తొమ్మిది రోజులూ అంత డబ్బంటే మాటలుకాదు. అందుకే ఈ రెడీమేడ్ బతుకమ్మలను కొనుక్కుంటున్నాం. డబ్బుకి డబ్బు ఆదా.. శ్రమా అదా.. పండుగ చేసుకున్న భాగ్యమూ దక్కుతోంది’ అని చెప్పింది ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సరిత.
జ్ఞాపకంగా..
‘రేట్ లెక్కచేయకుండా పూలు కొని బతుకమ్మను పేర్చినా అందరూ వచ్చి ఆడేసరికి ఆ పూలు వాడిపోయినట్టు కనిపిస్తాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్ బతుకమ్మ ఎంత లేటయినా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. పండుగ అయిపోయినా ఓ జ్ఞాపకంగా షోకేస్‌లో దాచుకోవచ్చు’ అని వివరించింది అన్నానగర్ నివాసి మహేశ్వరి.