flying drones
-
ఎగిరే కెమెరా.. అదిరిందయ్యా
కెమెరా గాల్లో ఎగురుతూ మన చుట్టూ తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీస్తుంటే ఎలా ఉంటుంది? వారెవా.. భలే ఉంటుంది అంటారు కదా. అచ్చం ఇలాంటి ప్రత్యేకతలతోనే స్నాప్ చాట్ కంపెనీ ఓ ఎగిరే కెమెరాను విడుదల చేసింది. ఎలాంటి సెటప్ అవసరం లేకుండా దానంతట అదే పని చేసే ఈ కెమెరాకు ‘పిక్సీ’ అని పేరు పెట్టింది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉండదు. వెళ్లాల్సిన 4 మార్గాలు ముందే ఇందులో నిర్దేశించి ఉంటాయి. మనకు కావాల్సిన మార్గాన్ని ఎంచుకొని బటన్ నొక్కితే గాల్లో తేలియాడుతుంది. మనతో పాటు కదులుతుంది. ఫొటోలు, వీడియోలు తీస్తుంది. అంతా అయిపోయాక మన అరచేయిని కింద పెడితే వచ్చి వాలిపోతుంది. దీన్ని ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్‌లలో అందుబాటులోకి తెచ్చారు. ధర రూ. 17,600. దీని బరువు 101 గ్రాములు. ఇందులో 12 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 2.7కె వీడియోలు తీస్తుంది. 16జీబీ డేటాను నిల్వ చేసుకుంటుంది. అంటే దాదాపు వెయ్యి ఫొటోలు, వంద వీడియోల వరకు తీస్తుంది. పిక్సీ బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో కంపెనీ చెప్పలేదు. అయితే ఫుల్‌గా చార్జ్ చేస్తే దాదాపు 5 నుంచి 8 సార్లు ఎగురుతుందని చెబుతున్నారు. ఒక్కసారి ఎగిరితే దాదాపు 10 నుంచి 20 సెకన్లు గాల్లో ఉంటుంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
మామూలు రోబో కాదు.. పండ్లు కోసుకొచ్చి, బుట్టలో పడేస్తుంది
చిటారు కొమ్మన ఉన్న పండును కోసుకు రావాలంటే, ఇకపై చెట్టెక్కాల్సిన పనిలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం దగ్గర ఉంటే, ఎంత ఎత్తయిన చెట్టు నుంచైనా ఇట్టే పండ్లు కోసుకొచ్చి, బుట్టలో పడేస్తుంది. పెద్ద పెద్ద తోటల్లో వినియోగించుకోవడానికి అనువుగా రూపొందించిన ఈ పరికరం పేరు ‘టెవెల్ ఎఫ్ఏఆర్ ద్రోన్’. ఇది ద్రోన్ మాత్రమే కాదు, రోబో కూడా. ఫ్లయింగ్ ఆటానమస్ రోబో (ఎఫ్ఏఆర్). అమెరికాకు చెందిన ‘టెవెల్ టెక్’ స్టార్టప్ కంపెనీకి చెందిన డిజైనర్లు దీనికి రూపకల్పన చేశారు. త్వరలోనే దీని పనితీరును అమెరికా, స్పెయిన్ దేశాల్లో ఎంపిక చేసుకున్న కొన్ని తోటల్లో పరిశీలించనున్నారు. పండ్లు కోసే ఈ రోబో ద్రోన్లను పెద్దసంఖ్యలో తయారు చేసేందుకు ‘టెవెల్ టెక్’ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతోంది. -
డిసెంబర్ 1 నుంచి వాణిజ్య డ్రోన్లు
న్యూఢిల్లీ: భారత్‌లో డ్రోన్ల వాణిజ్య వినియోగానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయం, ఆరోగ్యం, ప్రకృతి విపత్తుల సందర్భంగా సహాయక చర్యల్లో డ్రోన్లను వినియోగించేలా వీటిని రూపొందించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం డ్రోన్ల వాడకానికి సంబంధించిన నిబంధనలను ఢిల్లీలో ఆవిష్కరించారు. ప్రస్తుతానికి వ్యవసాయ, ఆరోగ్యం, ప్రకృతి విపత్తుల సందర్భంగా డ్రోన్ల వినియోగంపై మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. 2018, డిసెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. డ్రోన్ల ద్వారా మనుషుల రవాణాతో పాటు మందులు, ఆహారం, ఇతర వస్తువులను డెలివరీ చేయడాన్ని ఇందులో చేర్చలేదని పేర్కొన్నారు. పగటిపూటే వినియోగం: తాజా మార్గదర్శకాల ప్రకారం పౌర అవసరాల కోసం వాడే డ్రోన్లను కేవలం పగటిపూట మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గరిష్టంగా ఈ డ్రోన్లు 450 మీటర్లు ఎత్తుకు వెళ్లేందుకు మాత్రమే వీలుంది. వీటిని వివాహ వేడుకల చిత్రీకరణలో వాడుకోవచ్చు. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు విమానాశ్రయాలు, తీరప్రాంతాలు, రాష్ట్ర సచివాలయాలు, సైనిక కేంద్రాలు, ఢిల్లీలోని విజయ్‌చౌక్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించడానికి వీల్లేదు. కేంద్ర నిఘా సంస్థలతో పాటు జాతీయ సాంకేతిక, పరిశోధన సంస్థ వాడుతున్న నానో డ్రోన్లు మినహా అన్ని నానో డ్రోన్లను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. వీటికి ప్రభుత్వం విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీచేస్తుంది. డ్రోన్ల వినియోగం కోసం తప్పు డు పత్రాలు సమర్పించినా, నిబంధనలు ఉల్లంఘించినా.. లైసెన్సులను సస్పెండ్ లేదా రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేస్తారు. అనుమతి లేకుంటే టేకాఫ్ కాదు.. ‘డిజిటల్ స్కై’ ప్లాట్‌ఫామ్ ద్వారా డ్రోన్ల రిజిస్ట్రేషన్‌తో పాటు టేకాఫ్‌కు అధికారులు అనుమతులు జారీచేస్తారు. ఈ యాప్ స్థానిక పోలీస్‌స్టేషన్‌తో అనుసంధానమై ఉంటుంది. డ్రోన్లను వాడటానికి ముందు వీటిని వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా డ్రోన్లను టేకాఫ్ చేయాలంటే తొలుత మొబైల్ యాప్ ద్వారా అనుమతి కోరాలి. అప్పుడు ఎయిర్‌ట్రాఫిక్‌ను బట్టి అనుమతి ఇవ్వడం లేదా నిరాకరించడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ప్రజా భద్రత దృష్ట్యా అనుమతి లేకుండా డ్రోన్ల టేకాఫ్‌ను నిరోధించేలా కొత్త విధానంలో నిబంధనలు చేర్చారు. దీనిప్రకారం డిజిటల్ అనుమతులు రాకుండా డ్రోన్ల ను టేకాఫ్ చేసేందుకు వీలుకాదు. కేవలం 50 అడుగుల ఎత్తుకు వెళ్లగల నానో డ్రోన్ల(250 గ్రాముల బరువు)కు పోలీసు అనుమతులు అవసరం లేదు. వ్యవసాయం, ఆరోగ్యం సహా 23 విభాగాల్లో డ్రోన్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఎగిరే పళ్లాలతో అమెజాన్ డెలివరీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్: బ్లాక్ ఫ్రైడే అయిపోయింది. సైబర్ మండే కూడా ముగిసింది. ఇక క్రిస్మస్ మిగిలింది. అమెరికా సహా యూరప్‌లో సంవత్సరాంత అమ్మకాలు ఈ ఏడాది హల్చల్ చేస్తున్నాయి. సోమవారంనాటి బ్లాక్‌మండే అమ్మకాల్లో ఆన్లైన్ సంస్థలైన అమెజాన్, ఈబే తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నాయి. ఈ సందర్భంగా శాన్ఫ్రాన్సిస్కోలో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్... తమ 12 లక్షల చదరపుటడుగుల పార్శిల్ సెంటర్‌ను విలేకరులకు చూపించారు. పార్శిళ్ల డెలివరీ కోసం తాము పెద్ద సంఖ్యలో సమకూర్చుకున్న డ్రోన్లను (పైలట్ లేని ఎగిరే వాహనం)... వాటి ద్వారా పార్శిళ్ల అందజేతను ప్రయోగాత్మకంగా చూపెట్టారు. తాము తేనున్న విప్లవాన్ని ఆవిష్కరిస్తూ... ‘‘5 పౌండ్లలోపు బరువుండే పార్శిళ్లన్నిటినీ, 10 మైళ్ల దూరంలో వుండే ప్రాంతాలకు ఈ డ్రోన్ల ద్వారా అందజేస్తాం. మా అమ్మకాల్లో 86 శాతం 5 పౌండ్ల బరువుకన్నా తక్కువుండేవే. బహుశా! నా కల సాకారం కావటానికి మరో మూడునాలుగేళ్లు పట్టొచ్చు. కానీ ఒకసారి మా డ్రోన్లు ఎగరటం మొదలెడితే మానవ వనరులకు సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పంపించిన గంటలోపు డెలివరీ పూర్తవుతుంది’’ అని చెప్పారాయన. ఈ ఆక్టోకాప్టర్లను (8 కాళ్ల) వాణిజ్యపరంగా ఎగరటానికి అనుమతించేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఈ డ్రోన్లను అడ్డుకుని ఎవరైనా దారి మళ్లించొచ్చునని, దొంగిలించవచ్చునని, గాల్లోనే పేల్చేయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అనుమతించే ముందు వీటిని దృష్టిలో పెట్టుకోవాలనే సూచనలొస్తున్నాయి. ఒకేరోజు 2 బిలియన్ డాలర్ల అమ్మకాలు..? సైబర్ మండే సందర్భంగా ఆన్లైన్ సైట్లతో పాటు సంప్రదాయ స్టోర్లు వాల్‌మార్ట్, మేసీస్, వాల్‌గ్రీన్స్, కేమార్ట్, టెస్కో లాంటి సంస్థలు కూడా ఆన్లైన్లో గరిష్ట అమ్మకాలను నమోదు చేశాయి. గతేడాదితో పోలిస్తే భారీ వృద్ధి నమోదైందని, పూర్తి వివరాలు వెల్లడయ్యేసరికి ఈ ఒక్కరోజు అమ్మకాలు 2 బిలియన్ డాలర్లుండవచ్చని రాయిటర్స్ వార్తాసంస్థ తెలియజేసింది. ఇండియాలోనూ కొన్ని సంస్థలు సైబర్ మండే ఆఫర్లను ఇచ్చినట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌కు చెందిన సాల్మన్ రాజు చెప్పారు. ఈ సందర్భంగా తాము 80 శాతం వరకూ డిస్కౌంటిచ్చినట్లు ముంబైకి చెందిన షాప్ యువర్ వరల్డ్ డాట్ కామ్ ప్రతినిధి అభినవ్ తెలిపారు. థాంక్స్ గివింగ్ డే తరవాత వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే’ గానూ , సోమవారాన్ని ‘సైబర్ మండే ’గానూ వ్యవహరిస్తున్నారు.