ఎగిరే పళ్లాలతో అమెజాన్ డెలివరీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్: బ్లాక్ ఫ్రైడే అయిపోయింది. సైబర్ మండే కూడా ముగిసింది. ఇక క్రిస్మస్ మిగిలింది. అమెరికా సహా యూరప్‌లో సంవత్సరాంత అమ్మకాలు ఈ ఏడాది హల్‌చల్ చేస్తున్నాయి. సోమవారంనాటి బ్లాక్‌మండే అమ్మకాల్లో ఆన్‌లైన్ సంస్థలైన అమెజాన్, ఈబే తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నాయి. ఈ సందర్భంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్... తమ 12 లక్షల చదరపుటడుగుల పార్శిల్ సెంటర్‌ను విలేకరులకు చూపించారు.
పార్శిళ్ల డెలివరీ కోసం తాము పెద్ద సంఖ్యలో సమకూర్చుకున్న డ్రోన్‌లను (పైలట్ లేని ఎగిరే వాహనం)... వాటి ద్వారా పార్శిళ్ల అందజేతను ప్రయోగాత్మకంగా చూపెట్టారు. తాము తేనున్న విప్లవాన్ని ఆవిష్కరిస్తూ... ‘‘5 పౌండ్లలోపు బరువుండే పార్శిళ్లన్నిటినీ, 10 మైళ్ల దూరంలో వుండే ప్రాంతాలకు ఈ డ్రోన్‌ల ద్వారా అందజేస్తాం. మా అమ్మకాల్లో 86 శాతం 5 పౌండ్ల బరువుకన్నా తక్కువుండేవే. బహుశా! నా కల సాకారం కావటానికి మరో మూడునాలుగేళ్లు పట్టొచ్చు. కానీ ఒకసారి మా డ్రోన్‌లు ఎగరటం మొదలెడితే మానవ వనరులకు సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పంపించిన గంటలోపు డెలివరీ పూర్తవుతుంది’’ అని చెప్పారాయన. ఈ ఆక్టోకాప్టర్లను (8 కాళ్ల) వాణిజ్యపరంగా ఎగరటానికి అనుమతించేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఈ డ్రోన్‌లను అడ్డుకుని ఎవరైనా దారి మళ్లించొచ్చునని, దొంగిలించవచ్చునని, గాల్లోనే పేల్చేయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అనుమతించే ముందు వీటిని దృష్టిలో పెట్టుకోవాలనే సూచనలొస్తున్నాయి.
ఒకేరోజు 2 బిలియన్ డాలర్ల అమ్మకాలు..?
సైబర్ మండే సందర్భంగా ఆన్‌లైన్ సైట్లతో పాటు సంప్రదాయ స్టోర్లు వాల్‌మార్ట్, మేసీస్, వాల్‌గ్రీన్స్, కేమార్ట్, టెస్కో లాంటి సంస్థలు కూడా ఆన్‌లైన్లో గరిష్ట అమ్మకాలను నమోదు చేశాయి. గతేడాదితో పోలిస్తే భారీ వృద్ధి నమోదైందని, పూర్తి వివరాలు వెల్లడయ్యేసరికి ఈ ఒక్కరోజు అమ్మకాలు 2 బిలియన్ డాలర్లుండవచ్చని రాయిటర్స్ వార్తాసంస్థ తెలియజేసింది. ఇండియాలోనూ కొన్ని సంస్థలు సైబర్ మండే ఆఫర్లను ఇచ్చినట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌కు చెందిన సాల్మన్ రాజు చెప్పారు. ఈ సందర్భంగా తాము 80 శాతం వరకూ డిస్కౌంటిచ్చినట్లు ముంబైకి చెందిన షాప్ యువర్ వరల్డ్ డాట్ కామ్ ప్రతినిధి అభినవ్ తెలిపారు. థాంక్స్ గివింగ్ డే తరవాత వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే’ గానూ , సోమవారాన్ని ‘సైబర్ మండే ’గానూ వ్యవహరిస్తున్నారు.