డిసెంబర్‌ 1 నుంచి వాణిజ్య డ్రోన్లు | Govt permits flying commercial drones | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 1 నుంచి వాణిజ్య డ్రోన్లు

Published Tue, Aug 28 2018 2:48 AM | Last Updated on Tue, Aug 28 2018 2:48 AM

Govt permits flying commercial drones  - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో డ్రోన్ల వాణిజ్య వినియోగానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయం, ఆరోగ్యం, ప్రకృతి విపత్తుల సందర్భంగా సహాయక చర్యల్లో డ్రోన్లను వినియోగించేలా వీటిని రూపొందించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు సోమవారం డ్రోన్ల వాడకానికి సంబంధించిన నిబంధనలను ఢిల్లీలో ఆవిష్కరించారు. ప్రస్తుతానికి వ్యవసాయ, ఆరోగ్యం, ప్రకృతి విపత్తుల సందర్భంగా డ్రోన్ల వినియోగంపై మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. 2018, డిసెంబర్‌ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. డ్రోన్ల ద్వారా మనుషుల రవాణాతో పాటు మందులు, ఆహారం, ఇతర వస్తువులను డెలివరీ చేయడాన్ని ఇందులో చేర్చలేదని పేర్కొన్నారు.  

పగటిపూటే వినియోగం: తాజా మార్గదర్శకాల ప్రకారం పౌర అవసరాల కోసం వాడే డ్రోన్లను కేవలం పగటిపూట మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గరిష్టంగా ఈ డ్రోన్లు 450 మీటర్లు ఎత్తుకు వెళ్లేందుకు మాత్రమే వీలుంది. వీటిని వివాహ వేడుకల చిత్రీకరణలో వాడుకోవచ్చు. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు విమానాశ్రయాలు, తీరప్రాంతాలు, రాష్ట్ర సచివాలయాలు, సైనిక కేంద్రాలు, ఢిల్లీలోని విజయ్‌చౌక్‌ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించడానికి వీల్లేదు. కేంద్ర నిఘా సంస్థలతో పాటు జాతీయ సాంకేతిక, పరిశోధన సంస్థ వాడుతున్న నానో డ్రోన్లు మినహా అన్ని నానో డ్రోన్లను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించాలి. వీటికి ప్రభుత్వం విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీచేస్తుంది. డ్రోన్ల వినియోగం కోసం తప్పు డు పత్రాలు సమర్పించినా,  నిబంధనలు ఉల్లంఘించినా.. లైసెన్సులను సస్పెండ్‌ లేదా రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేస్తారు.

అనుమతి లేకుంటే టేకాఫ్‌ కాదు..
‘డిజిటల్‌ స్కై’ ప్లాట్‌ఫామ్‌ ద్వారా డ్రోన్ల రిజిస్ట్రేషన్‌తో పాటు టేకాఫ్‌కు అధికారులు అనుమతులు జారీచేస్తారు. ఈ యాప్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌తో అనుసంధానమై ఉంటుంది. డ్రోన్లను వాడటానికి ముందు వీటిని వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా డ్రోన్లను టేకాఫ్‌ చేయాలంటే తొలుత మొబైల్‌ యాప్‌ ద్వారా అనుమతి కోరాలి. అప్పుడు ఎయిర్‌ట్రాఫిక్‌ను బట్టి అనుమతి ఇవ్వడం లేదా నిరాకరించడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ప్రజా భద్రత దృష్ట్యా అనుమతి లేకుండా డ్రోన్ల టేకాఫ్‌ను నిరోధించేలా కొత్త విధానంలో నిబంధనలు చేర్చారు. దీనిప్రకారం డిజిటల్‌ అనుమతులు రాకుండా డ్రోన్ల ను టేకాఫ్‌ చేసేందుకు వీలుకాదు. కేవలం 50 అడుగుల ఎత్తుకు వెళ్లగల నానో డ్రోన్ల(250 గ్రాముల బరువు)కు పోలీసు అనుమతులు అవసరం లేదు. వ్యవసాయం, ఆరోగ్యం సహా 23 విభాగాల్లో డ్రోన్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement