మళ్ళీ లైసెన్స్‌ రాజ్యమా? | Sakshi Editorial On Central Govt On Import of Laptops Computers | Sakshi
Sakshi News home page

మళ్ళీ లైసెన్స్‌ రాజ్యమా?

Published Thu, Aug 10 2023 3:38 AM | Last Updated on Thu, Aug 10 2023 3:38 AM

Sakshi Editorial On Central Govt On Import of Laptops Computers

ఎప్పుడో వదిలేసిన పాత విధానాలను ఇప్పుడు మళ్ళీ తెస్తే... కొత్త ఫలితాలు వస్తాయా? కేంద్ర ప్రభుత్వం మాత్రం వస్తాయనే అనుకుంటున్నట్టు ఉంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్‌ కంప్యూటర్ల దిగుమతిపై ప్రభుత్వం గత వారం హఠాత్తుగా షరతులు పెట్టడాన్ని చూస్తే, మళ్ళీ 1970ల నాటి ప్రభుత్వ విధానాలు గుర్తొస్తున్నాయి. జాతీయ భద్రత కారణంగా చైనా, కొరియాల నుంచి ఈ దిగుమతులను నియంత్రించాలని ప్రభుత్వ భావన.

లైసెన్సు తీసుకుంటేనే అనుమతిస్తా మని సర్కార్‌ చెబుతోంది. అయితే, వెల్లువెత్తిన విమర్శలు, వ్యక్తమైన ఆందోళనలతో ప్రస్తుతానికి మూడు నెలల పాటు నవంబర్‌ 1 దాకా ఈ షరతులను వాయిదా వేసింది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికే ఈ నిబంధనలని పాలకుల మాట. కానీ, షరతులతో అది సాధ్యమవుతుందా? చైనాను లక్ష్యంగా చేసు కొని పెడుతున్న ఈ నిషేధం తీరా భారతీయులకే నష్టం కలిగిస్తుందన్న విశ్లేషణలూ ఉన్నాయి. 

దేశంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతులు ఏటా 6.25 శాతం వంతున పెరుగుతున్నాయి. 2022 – 23లో 533 కోట్ల డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను దిగుమతి చేసుకున్నాం. అందులో 75 శాతం చైనావే. ఇప్పుడు పౌరుల డిజిటల్‌ భద్రత రీత్యా ఈ దిగుమతులపై షరతులు పెడుతున్నామంటున్నారు. ఆ సాకు చూపడానికి కారణం ఒకటే! జాతీయ భద్రత కారణమైతేనే బహుళ పక్ష వాణిజ్య ఒప్పందాల్లో దిగుమతులపై షరతులు పెట్టే వీలుంటుంది.

దేశీయ ఉత్పత్తులను కాపు కాసుకోవడం కారణమంటే రచ్చ తప్పదు. అయితే, ఎంత జాతీయ భద్రతను సాకుగా చూపినప్పటికీ, ఈ దిగుమతుల షరతులకు అవతలి వైపు నుంచి ట్యారిఫ్‌ల ప్రతిచర్యలు, దీర్ఘకాలిక వివాదాలు ఎలాగూ తప్పవు. పరిశ్రమతో ఎలాంటి సంప్రతింపులూ జరపకుండానే హడావిడి నిర్ణయం తీసుకొని, సుస్థిర వ్యవస్థను హఠాత్తుగా మార్చడంతో వచ్చిపడే ఇబ్బందులు సరేసరి.

ప్రస్తుత నిబంధనల ప్రకారం మన దేశంలోని కంపెనీలు ల్యాప్‌టాప్‌లను యథేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చు. రానున్న కొత్త రూల్స్‌తో ప్రత్యేక లైసెన్స్‌ ఉంటే కానీ, దిగుమతి సాధ్యం కాదు. 2020లో కలర్‌ టీవీల దిగుమతి పైనా భారత్‌ ఇలాంటి షరతులే పెట్టడం గమనార్హం. అలాగే, మొబైల్‌ఫోన్లపైనా అధిక ట్యారిఫ్‌లు విధించింది. పలు స్మార్ట్‌ఫోన్‌ సంస్థలు భారత్‌లోనే విడిభాగా లను కూర్చి, తయారు చేస్తున్నాయి.

కానీ, కంప్యూటర్ల సంగతలా కాదు. చైనా సంస్థ లెనోవా మినహా యాపిల్, డెల్, సామ్‌సంగ్, షియామీ తదితర ఉత్పత్తులన్నీ దిగుమతులే! కంప్యూటర్ల దిగుమతికి లైసెన్స్‌ దెబ్బతో ఈ సంస్థల గంపగుత్త ఆర్డర్లపై దెబ్బ పడుతుంది. కలర్‌ టీవీల్లా కాక కంప్యూటర్లు విద్య, పరిశోధన, పౌరసేవల్లో కీలకం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుకై ఈ మధ్యే రిలయన్స్‌ సంస్థ రూ. 20 వేల లోపలే లభించే జియోబుక్‌ను తెచ్చింది. అదీ చైనా తయారీయే! రిలయన్స్‌ ఇప్పుడిక పాలకుల నుంచి ప్రత్యేక లైసెన్స్‌ తెచ్చుకోకుంటే, దిగుమతి చేసుకోలేదు.  

షరతుల వార్తలతో ఈ వారం కంప్యూటర్ల అమ్మకాలు 25 శాతం పెరిగాయి. చివరకు కొరత ఏర్పడి, ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఇప్పటికే కోవిడ్‌ వల్ల సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు, సెమీ కండక్టర్‌ సంక్షోభం సతమతం చేస్తున్నాయి. షియామీ, రియల్‌మి, వన్‌ప్లస్‌ లాంటి కొత్త ఉత్పత్తులతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారతీయ ట్యాబ్‌ మార్కెట్‌ ఈ షరతులతో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అసలు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, ఐటీ సేవల కేంద్రంగా పేరున్న దేశం కంప్యూటర్ల దిగుమతులపై షరతుల పాట పాడడం ఎలా చూసినా అనూహ్యమే! ప్రజలపై ప్రభావం చూపుతూ, దీర్ఘకాలిక ఆర్థిక పర్యవసానాలున్న నిర్ణయాలను తీసుకొనే ముందు పాలకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రభుత్వంలోని ఆర్థిక శాస్త్రవేత్తలతో సంప్రతింపులు జరిపివుంటే పాలకులు ఈ హఠాన్నిర్ణయం తీసుకొనేవారు కాదు. దేశీయ ఉత్పత్తి పెంచడం, దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం, విశ్వసనీయ హార్డ్‌వేర్‌ను అందుబాటులో ఉంచడం మంచి లక్ష్యాలే. కానీ, వాటి కోసం పాత లైసెన్స్‌ రాజ్యానికి తిరోగమించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. 

ఫలానా చైనా ఉత్పత్తుల వల్ల భద్రతలో ముప్పుందని భావిస్తే, ఆ దేశ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేస్తే సరి. అలాకాక మొత్తం వ్యవస్థను లైసెన్సుల అగచాట్లలోకి నెట్టాల్సిన పని లేదు. అనేక కష్టాలు భరించాకే లైసెన్స్‌ రాజ్యబంధనాల్ని వదిలించుకున్నామని విస్మరించలేం. సులభంగా లైసెన్సులు ఇస్తామంటున్నా, ఆశ్రితపక్షపాతం సహా సమస్యలు మామూలే! ఇవాళ మనది సేవల రంగంతో పురోగమిస్తున్న ఆర్థికవ్యవస్థ. అందులో కీలకమైన కంప్యూటర్‌ హార్డ్‌వేర్ల కొరతతో దీర్ఘకాలిక నష్టమే. 

దేశీయోత్పత్తిని పెంచేందుకు ఉత్పత్తితో ముడిపడ్డ ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని 2020లో ప్రారంభించిన కేంద్రం వివిధ రంగాలకు దాన్ని విస్తరించినా, ఐటీ హార్డ్‌వేర్‌ రంగంలో ఆశించినంత భాగస్వామ్యం రావట్లేదు. కేటాయింపులు రెట్టింపు చేసినా అదే పరిస్థితి. అలాగని, దిగుమతులపై షరతులు, లైసెన్స్‌ రాజ్యం పెడితే దేశీయ ఉత్పత్తి పెరుగుతుందనుకోవడం అవివేకం. ఆ సంగతి గత చరిత్ర నిరూపించింది.

అపార ఇంజనీరింగ్‌ ప్రతిభ, తక్కువ వేతనానికే మెరుగైన సేవలు ఇస్తున్నా మనం అంతర్జాతీయ ఉత్పత్తి సేవల భాగస్వామ్యంలో ఎందుకని, ఎక్కడ వెనుకబడిపోయామో మథనం సాగాలి. ఆ విధాన లోపాన్ని సరిచేసుకోవాలి. ప్రతి వెయ్యిలో 15 మందికే కంప్యూటర్‌ చేరిన దేశంలో షరతులతో ఆ లోటు పెరుగుతుందా, తరుగుతుందా? ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యపై సమగ్ర దృష్టి పెట్టాలి. సంబంధింత పక్షాలతో క్షుణ్ణంగా చర్చించాలి. అనివార్యమైతే తప్ప అనవసర షరతులతో నష్టమని గుర్తించాలి. లేదంటే భారత పురోగతి మరోసారి కుంటుపడుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement