
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రైతుల జీవన స్థితిగతులు..సాగు కమతాల స్వరూప స్వభావాన్ని తేల్చే వ్యవసాయగణన (అగ్రికల్చర్ సెన్సెస్) ఇటీవల దేశవ్యాప్తంగా మొదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. భూకమతాల వారీగా రెవెన్యూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు.
మొత్తం పది అంశాలపై మూడు దశల్లో వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా కాగిత రహితంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు వినియోగించి ప్రత్యేక యాప్ ద్వారా డిజిటల్ విధానంలో ఏఈఓలు సర్వే చేస్తుండగా, మిగతా రాష్ట్రాల్లో మాన్యువల్‌గానే చేపడుతున్నారు.
2021–22 ప్రామాణికంగా 11వసారి
దేశంలో వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి ప్రణాళిక, సామాజిక ఆర్థిక విధాన రూపకల్పనకు కేంద్రం ఐదేళ్లకు ఒకసారి వ్యవసాయ గణన నిర్వహిస్తోంది. 1979లో వ్యవసాయగణన మొదలుకాగా, చివరగా పదోసారి 2015–16లో చేపట్టారు.
11వ వ్యవసాయ గణన 2021–22లో జరగాల్సి ఉండగా, కరోనా తదితర కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 2021–22 ప్రామాణిక సంవత్సరంగా ఈ నెల నుంచి వ్యవసాయానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది.
మూడు దశల్లో...
వానాకాలం, యాసంగిలో ఆయా రైతుల వారీగా ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారో తెలుసుకునేందుకు రాష్ట్రంలో ఏటా వ్యవసాయశాఖ సర్వే చేస్తోంది. అయితే కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మూడు విడతల్లో వ్యవసాయ గణన చేపట్టారు.
♦ మొదటి విడతలో రైతు పేరు, సామాజికస్థితి, సాగు విస్తీర్ణం, భూమి వినియోగం, పురుషులు, మహిళలు ఇలా అన్ని సేకరించి రెవెన్యూ గ్రామం వారీగా నమోదు చేస్తున్నారు.
♦ రెండో విడతలో ఎంపిక చేసిన 20 శాతం గ్రామాల్లో ప్రణాళిక శాఖ నిర్దేశించిన టీఆర్‌ఏఎస్ (ట్రైమ్ లీ రిపోర్టెడ్ అగ్రి స్టాటిస్టిక్స్)తో పాటు అదనంగా మరికొంత సమాచారం సేకరిస్తారు.
♦ మూడో దశలో ఏడు శాతం గ్రామాల్లో సాగు ఖర్చులు, యంత్రాల వినియోగం, ఎరువులు, విత్తనాలు, ప్రభుత్వ రాయితీలు తదితర వివరాలు సేకరిస్తారు.
సాంకేతికతతో సర్వే...
తాజాగా రాష్ట్రంలో చేపట్టిన వ్యవసాయ గణనలో అధికారులు వందశాతం సాంకేతికతను సది్వనియోగం చేసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ విధానంలో వ్యవసాయ కమతాలు, రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రైతుబంధు పథకానికి రైతుల నుంచి ఆధార్ కార్డులు, వ్యవసాయ భూముల విస్తీర్ణం, పంటల సాగు తదితర వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచగా, వాటి ఆధారంగా వ్యవసాయగణనలో అదనపు సమాచారం తీసుకుంటున్నారు.
ప్రణాళికకు వ్యవసాయ గణన కీలకం
వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు ఆర్థిక విధాన రూపకల్పనకు వ్యవసాయ గణన ఎంతో ఉపయోగకరం. నిరీ్ణత లక్ష్యం మేరకు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ, ప్రణాళిక శాఖ అధికారులు, సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. – దశరథ్, మహబూబ్‌నగర్ జిల్లా ప్రణాళికశాఖ అధికారి
ఈ నెల 31లోగా పూర్తి చేస్తాం
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో వ్యవసాయ గణన చేయిస్తున్నాం. దీని వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న పథకాలకు అనుగుణంగా ఈ పంటల వివరాల లెక్కల సేకరణ జరుగుతోంది. ఈ నెలాఖరులోపు సర్వే పూర్తి చేస్తాం.
– బి.వెంకటేష్, మహబూబ్‌నగర్ జిల్లా వ్యవసాయ అధికారి