‘పెట్టుబడి’ చెక్కులపై డిజిటల్‌ సంతకం! | Agriculture Department towards Digitization | Sakshi
Sakshi News home page

‘పెట్టుబడి’ చెక్కులపై డిజిటల్‌ సంతకం!

Published Thu, Jan 18 2018 3:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Agriculture Department towards Digitization - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రైతులకు పెట్టుబడి పథకం’సొమ్ము దుర్వినియోగం కాకుండా వ్యవసాయ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయాధికారి (ఏవో), తహసీల్దార్ల డిజిటల్‌ సంతకాలతో రైతులకు చెక్కులివ్వాలని యోచిస్తోంది. ఏవో, తహసీల్దార్లు నేరుగా పెన్నుతో సంతకాలు చేయాలన్న నిబంధనతో నిధులు పక్కదారి పట్టే ప్రమాదముందని భావిస్తున్న ఆ శాఖాధికారులు ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. ఇందుకు సంబంధించి ఏవో, తహసీల్దార్ల సంతకాలు ముందే సేకరించి డిజిటైజ్‌ చేయాలని భావిస్తున్నారు. గతంలో కరువు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు నష్ట పరిహారం సొమ్ము దుర్వినియోగమైన ఘటనల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుంటున్నారు.  

బ్యాంకులకు జాబితా.. రైతులకు చెక్కులు.. 
పెట్టుబడి పథకంలో భాగంగా రైతుల జాబితాను ముందే సిద్ధం చేసుకొని ఆ ప్రకారం బ్యాంకులకు జాబితా పంపిస్తారు. రైతు పేరు, ఆధార్‌ నంబర్, డిజిటల్‌ సంతకాలతో చెక్కులు సిద్ధం చేసి ఏవోలకు అందజేస్తారు. వాటిని రైతులకు గ్రామసభలో ఏవోలు అందిస్తారు. చెక్కులు తీసుకున్న రైతుల సంతకాలూ సేకరిస్తారు. గ్రామసభలో చెక్కులు తీసుకోని రైతులు ఏవో కార్యాలయంలో తీసుకునే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. పెట్టుబడి పథకం తమకు వర్తించదన్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని.. అలాంటి ప్రచారంతో డబ్బులు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు విన్నవించేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమైంది.  

ఆ భూములకూ ‘పెట్టుబడి’! 
వ్యవసాయ యోగ్యం కాని భూములకు సాయం చేయకూడదంటూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. పట్టాలున్న గుట్టలు, చెరువు శిఖం భూములకు ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖకు వారు విన్నవిస్తున్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను పెట్టుబడి సాయంతో కష్టపడి సాగు భూములుగా మారుస్తున్నామని రైతులు చెబుతున్నారని, ఆయా విన్నపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని అధికారులు అంటున్నారు. మరోవైపు తెలంగాణలో భూములుండి ఇతర రాష్ట్రాలో ఉంటున్న రైతులకూ పెట్టుబడి సాయం ఇస్తామని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. సరిహద్దు జిల్లాల్లో భూములు తెలంగాణలో, రైతులు మరో రాష్ట్రంలో ఉంటున్నారని.. కాబట్టి వారికీ సాయం అందుతుందంటున్నారు. హైదరాబాద్‌ శివారులో వందల ఎకరాల వ్యవసాయ క్షేత్రాలున్న సినిమా నటులు, రాజకీయ నేతలకూ పథకం వర్తిస్తుందని చెబుతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement